రచయిత అంటేనే రెబెల్‌!

ABN , First Publish Date - 2022-08-01T06:16:19+05:30 IST

ప్రతిష్టాత్మక మూర్తిదేవి పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డా. ప్రతిభారాయ్‌. మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఇతివృత్తంగా ఆమె రాసిన...

రచయిత అంటేనే రెబెల్‌!

ప్రతిష్టాత్మక మూర్తిదేవి పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డా. ప్రతిభారాయ్‌. మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఇతివృత్తంగా ఆమె రాసిన ‘‘యాజ్ఞసేని’’ నవల భారతీయ సాహిత్యంలో కొత్తపంథాకి నాంది. ఒడియా భాషతో భారతీయ సాహిత్యంలో ప్రతిభారాయ్‌ సేవలు విశిష్టమైనవి. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమకారిణిగా తన పాత్ర ప్రత్యేకమైంది. ‘‘సమాజంలో అణచివేత, అన్యాయాలకు గురవుతున్న వారికి గొంతుకగా నిలవడమే రచయిత కర్తవ్యం’’ అని ఆమె చెబుతున్నారు. ప్రతిభారాయ్‌ ఇటీవల ‘విశ్వంభర సినారె జాతీయ సాహిత్య పురస్కారం’ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా సంభాషించారు. 

ఇంటర్వ్యూ: సాంత్వన్‌



సినారె జాతీయ సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆయనతో మీకున్న పరిచయం గురించి...

తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా... ఇవి ఇరుగుపొరుగు రాష్ట్రాలు అయినా, ఒకరి సాహిత్యం మరొకరు చదవలేని పరిస్థితి. అందుకు కారణం అనువాదాలు తగ్గిపోవడం. సినారె ‘విశ్వంభర’ను ఇంగ్లీషులో చదివాను. మానవత్వం, మాధుర్యం, హై ఫిలాసఫీ కలగలిసిన ఆ కవితలు అద్భు తంగా అనిపించాయి. అవి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తాయి. మానవీయకు అద్దంపట్టే కవిత్వం. సినారెను వ్యక్తిగతంగా రెండు సార్లు కలిశాను. అప్పటికి నాకంత పెద్ద గుర్తింపు లేదు. కానీ నన్ను ఆయన అభినందించారు. ఆయన గొప్పకవి మాత్రమే కాకుండా, గొప్ప మానవ హృదయం కలిగిన వాడని అప్పుడే గ్రహించాను. తర్వాత ప్రముఖ కవి కె. శివారెడ్డి కవిత్వం చదివాను. రచయిత్రి ఓల్గా నాకు ఆత్మీయురాలు. అలా తెలుగు సాహిత్యంతో నాకు ఆత్మీయానుబంధమే ఉంది.


దేశ అధ్యక్షురాలిగా ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆమెతో మీకున్న అనుబంధం...

ద్రౌపది ముర్ము ఒక అసామాన్య మహిళ. దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత శుభాకాంక్షలు చెబుదామని, ఢిల్లీలోని ఆమె కార్యాలయానికి (రాష్ట్రపతి భవన్‌ కాదు) వెళ్లాను. నా మోకాలి సమస్య వల్ల పై అంతస్తులోని ఆమెను కలవలేనని, పుష్పగుచ్ఛం వ్యక్తిగత కార్యదర్శికి ఇచ్చి వెనుతిరుగుదామనుకున్నాను. కానీ నేను వచ్చానని తెలిసి, ద్రౌపది ముర్ము స్వయంగా కింది అంతస్తుకు వచ్చిమరీ నన్ను ఆప్యాయంగా పలకరించారు. నన్ను గుర్తుపట్టారా అని అడిగితే, ఆమె చెప్పిన సమాధానం ‘మీరెందుకు తెలియదు. ప్రతిభారాయ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ ఒడిశా’ అంటూ అభిమానంగా మాట్లాడారు. ‘ఇప్పుడు ప్రైడ్‌ ఆప్‌ ఒడిశా నేను కాదు, మీరు’ అన్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం ఆమె సొంతం. తప్పనిసరిగా ఆమె హోదాకు వన్నె తెస్తుంది.


దేశవ్యాప్తంగా మీకు పేరు తెచ్చిన నవల ‘యాజ్ఞసేని’. 

‘ద్రౌపది’ ఇతివృత్తంగా సాగే ఆ నవల రచనకు ప్రేరణ ఏంటి ? 

పురాణ, ఇతిహాసాల్లోని కొన్ని పాత్రలను సమాజం తప్పుగా అర్థం చేసుకుంటోంది. మనం ఓ పాత్రను అర్థం చేసుకోడానికి ముందు ఆ కాలమాన పరిస్థితులను అంచనా వేయాలి. ఉదాహరణకి శ్రీకృష్ణుడు   స్త్రీ లోలుడు అంటారు. అసలు ఆయన ఎందుకు అంతమంది గోపికల్ని వివాహమాడాల్సి వచ్చింది అనే విషయాన్ని సంగ్రహించకుండా, ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని తేల్చేయడం సమంజసం కాదు. అలా చేయడం వల్ల       ఆ పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీసినవారమవుతాం. తద్వారా భావితరాలవారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అలానే మహాభారతంలోని ద్రౌపదిని నేటి సమాజం సరిగ్గా అర్థం చేసుకోలేదు. మానసిక సంఘర్షణ నుంచే రచనలు పుడతాయి. అలాగే మహోన్నత వ్యక్తిత్వంగల ద్రౌపదిని ప్రస్తుత సమాజం సరిగ్గా అర్థంచేసుకోడం లేదన్న బాధ, భావసంఘర్షణ నుంచి ‘యాజ్ఞసేని’ నవల రాశాను. నా చిన్నతనంలో ‘ద్రౌపది వస్త్రాపహరణం’ నాటకం చూసి, ‘‘ఏంటీ నాటకం అస్సలు బాగాలేదు. కౌరవసభలో అంతమంది ముందు ఆమె చీర లాగుతుంటే, అందరూ చూస్తూ ఊరుకున్నారేగానీ ఒక్కరూ అడ్డుకోలేదు’’ అని మా నాన్నని అడిగాను. దానికి ఆయన ‘‘అది నాటకం అమ్మా, నిజం కాదు’’ అని సమాధానమిచ్చారు. కానీ మూల రచనలోనూ అదే ఉంది కదా. సభలో భీష్మాచార్యులు వంటి పెద్దలు ఉన్నారు. వారెవరూ తప్పు అని ఎందుకు నోరువిప్పలేదని అడిగాను. అప్పుడు నాన్న నాకు ద్రౌపది పాత్ర ఔన్నత్యాన్ని వివరించారు. ఆ స్ఫూర్తితోనే తర్వాత, నేను ఆ నవల రాశాను. హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషల్లోకి అనువాదమైంది. నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత అహల్య పాత్ర గొప్పతనాన్ని వివరించేలా ‘మహామోహ’ నవల రాశాను. ఆ రెండు నవలలు నాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.


ఓ రచయితకు ఉండే సామాజిక, నైతిక బాధ్యత గురించి వివరించండి?

సమాజంలో అన్యాయాలకు, అణచివేతకు గురవుతున్నవారికి న్యాయపూరిత మద్దతు ప్రకటించడం రచయితల నైతిక బాధ్యత. 

కొన్నేళ్ల క్రితం నేను, నా స్నేహితురాలు కలిసి పూరి జగన్నాథ్‌ ఆలయానికి వెళ్లాం. అక్కడ ఓ పాండా (పూజారి) నా స్నేహితురాలి శరీర ఛాయ ఆధారంగా అన్యమతస్తురాలని ఆరోపిస్తూ, దారుణంగా అవమానించాడు. ఒక మనిషి రంగు ఆధారంగా, ఆ వ్యక్తి ఏ మతమో, ఏ కులమో నిర్ణయిస్తామా. అదెంత అన్యాయం! అదే నేను వారిని నిలదీశాను. తర్వాత నా అనుభవాన్ని ఒక పత్రికలో ‘‘ది కలర్‌ ఆఫ్‌ రిలీజియన్‌ ఈజ్‌ బ్లాక్‌’’ పేరుతో రాశాను. దాంతో ఆ పూజారి నామీద పరువునష్టం దావా వేశాడు. అప్పుడు నామీద చాలానే విమర్శలొచ్చాయి. అయినా, నేనెక్కడా భయపడలేదు. తిరిగి అతనే రాజీ చేసుకుందామని లేఖ రాశాడు. అందుకు నేను అంగీకరించలేదు. పదేళ్ల విచారణ అనంతరం తుది తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది.


మరొక విషయంలోనూ మీరు న్యాయస్థానంలో పోరాడినట్లు ఉన్నారు?

అవును. అప్పటి ఒడిశా పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ చైర్మన్‌ అవినీతిని బాహాటంగా విమర్శించాను. అప్పుడు అదే బోర్డులో నేను సభ్యురాలిని కూడా. దాంతో అతను నా మీద కోటిరూపాయలకు పరువునష్టం దావా వేశాడు. మళ్లీ రాజీ చేసుకుందామని రాయబారం పంపాడు. అతను గెలిస్తే, అంత సొమ్ము కట్టగలవా, అందుకే రాజీ చేసుకోమని నాకు చాలామంది సలహాలిచ్చారు. కానీ ఒకవేళ అదే జరిగితే ఒక్కొక్కరి వద్ద ఒక్కోరూపాయి విరాళం సేకరించి మరీ అతనికి కడతాను, అంతేకానీ వెనక్కి తగ్గనని తేల్చేశాను. ఎనిమిదేళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం అతన్ని దోషి అని నిర్ధారించింది. అతన్ని సర్వీసు నుంచి తొలగించారు.




జూలై 29న హైదరాబాద్‌లో సినారె జాతీయ స్థాయి సాహిత్య పురస్కారం

‘విశ్వంభర’ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా స్వీకరిస్తూ....



మీ నవలల్లో కథల్లో స్త్రీ ప్రాతినిధ్యం గురించి?

నేను స్త్రీవాదిని కాదు. మానవత్వాన్ని, సమాజంలో సున్నితత్వాన్ని కాంక్షించే వ్యక్తిని. కేవలం స్త్రీల కోసమే రచనలు చేయలేదు. అణచివేత, అన్యాయాలకు గురవుతున్న వర్గాల గురించి రాయడం నా కర్తవ్యం. నా రచనల్లో స్త్రీ పాత్రలు స్వాభిమానంతో, అణచివేతను ప్రశ్నిస్తూ, తమ హక్కుల కోసం నినదించే విధంగా ఉంటాయి. అలా ఉండటాన్నే నేను కోరుకుంటాను. అనాథల ఇతివృత్తంతో ‘ది లాస్ట్‌ గాడ్‌’ నవల రాశాను. దానిపై ఒడిశా సమాజంలో పెద్ద చర్చ జరిగింది. నా కథ, నవలా రచనల్లో ముగింపు పాఠకులకే వదిలేస్తాను. సమాజంలో మహిళలు ఎక్కువ అణచివేతకు గురవుతున్నారు కనుక, తప్పనిసరిగా నా రచనల్లో వారికి కాస్తంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలానే ఒడిశా, ఆంధ్రా సరిహద్దులోని ‘బండ’ తెగ పట్ల కొన్నేళ్ల నుంచి సమాజంలో చాలా దురాభిప్రాయాలున్నాయి. నేను ఆ కమ్యూనిటీ వారందరినీ స్వయంగా కలిసి, వారితో చర్చించాను. వారంతా చాలా మంచి మనుషులు. సమాజం నుంచి వెలివేతకు గురైన మనుషులు. ఆ కమ్యూనిటీపై నా పోస్ట్‌ డాక్టరేట్‌ పరిశోధన చేశాను. తద్వారా వాళ్ల సాంస్కృతిక వైవిధ్యతను, జీవనవిధానాన్ని, వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించాను.


ప్రస్తుతం మన సమాజంలోని అసహన వాతావరణంమీద మీ అభిప్రాయం?

భారతీయ సమాజం ముస్లింలను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోంది. వాళ్లపట్ల చాలా అపోహలు ఉన్నాయి. వాటిని నిర్మూలించాల్సిన కర్తవ్యం రచయితల మీదా ఉంది. ఆ క్రమంలో నేనూ కొన్ని రచనలు చేశాను. అందులో ఒకటి ‘పవిత్ర రాత్రి’ పేరుతో రాసిన కథ పెద్ద చర్చకు తెరతీసింది. బాంబు పేలుళ్లరోజు విధి నిర్వహణ నుంచి ఇంటికి బయలుదేరిన ఒక ముస్లిం అబ్బాయిని తీవ్రవాది అనే అనుమానంతో పోలీసులు కాల్చిచంపుతారు. ఇది ఆ కథ ఇతివృత్తం. తద్వారా ముస్లింల మీద సాధారణంగా చాలామందిలో ఉండే అపోహలు, అనుమానాల గురించి అందులో చర్చించాను. 


ఒడిశా సాహిత్య రంగంలో మహిళా రచయిత్రులకు ఉన్న స్థానం ఏంటి ?

సాహిత్యరంగం రాజకీయరంగం లాంటిది కాదు కదా, రిజర్వేషన్‌ కల్పిస్తే మహిళల భాగస్వామ్యం పెరిగిందన డానికి. అది సృజనతో కూడుకున్నది. సమాజంతో మనకు, మనతో మనకి జరిగే భావ సంఘర్షణల నుంచి సాహిత్య సృజన జరుగుతుంది. ఒడిశాలో ప్రస్తుతం రచయిత్రుల సంఖ్య బాగానే ఉంది. కొత్తతరం అమ్మాయిలు కవిత్వం, కథ, నవలా రచన తదితర ప్రక్రియల ద్వారా చాలామంది ముందుకొస్తున్నారు. అయితే, భర్త ప్రోత్సాహంతో ముందుకొస్తున్న రచయిత్రులు ఎక్కువ కనపడుతున్నారు. నా విషయంలో చూస్తే నా భర్త అక్షరచంద్ర రాయ్‌ ప్రోత్సాహం ప్రత్యేకమైంది. అయితే, అంతిమంగా మన రచనలే మనకు పేరు, ప్రతిష్టలను నిలబెడతాయి కానీ, స్త్రీ, పురుషులు అని కాదు. మంచి రచనలు, సమాజానికి దిక్సూచి లా నిలిచే రచనలు చేసేవారు స్త్రీలైనా, పురుషులైనా ఎన్నటికీ వారికి అగ్రస్థానమే. 


రచయితలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మీ స్పందన ?

రచయిత అంటేనే రెబల్‌! రచయితలంతా విప్లవకారులే. సామాజిక సమస్యలపై వారెప్పుడూ తమ కలంతో పోరు సలుపుతూనే ఉండాలి. ప్రభుత్వాల తప్పుఒప్పులను, పాలకుల లోపాలను ఎత్తిచూపడం రచయితల బాధ్యతే. తమకు వ్యతిరేకంగా రాసినంత మాత్రాన రచయితలపై ఆంక్షలు విధించడం, దాడిచేయడం అప్రజాస్వామికం. రచయితలమీద దాడులు పెరిగాయన్నది వాస్తవం. కల్బుర్గి, గౌరీలంకేష్‌ వంటి మేధావలు, రచయితలను చంపేసిన ఘటనలూ చూశాం. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. రచనలపై అభ్యంతరం ఉంటే, రాజ్యాంగపరంగా పోరాడాలి. అంతేకానీ వారి జీవించే స్వేచ్ఛను హరి స్తాననడం అమానుషం. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. అలా అని ఇతర మతాలకన్నా నా మతం గొప్పది. నీ దేవుడు కన్నా నా దేవుడు గొప్పోడు వంటి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. 


కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మనుషులను ఐక్యం చేసే బాధ్యత రచయితపై ఉంటుంది. రచయుతలకు కొన్ని హద్దులూ ఉంటాయి. మరొకరి విశ్వాసాలను కించపరిచేవిధంగా, వారి పురాణపురుషులను అపహాస్యం చేసే విధంగా రచనలు చేయకూడదు. రచయితకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఉండాలి కూడా.

Updated Date - 2022-08-01T06:16:19+05:30 IST