క్యూబన్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-07-15T06:21:02+05:30 IST

కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో ఆదివారం సాగిన నిరసనలు, రేగిన విధ్వంసం చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోయింది....

క్యూబన్ల ఆగ్రహం

కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో ఆదివారం సాగిన నిరసనలు, రేగిన విధ్వంసం చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోయింది. దాదాపు పాతికేళ్ళ క్రితం దేశం తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని చవిచూసిన స్థితిలో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు తప్ప, ఇంతటి భారీ నిరసన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. వేలాదిమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, పోలీసు వాహనాలమీద రాళ్ళు రువ్వారు, తగులబెట్టారు. కొందరు ఇదే అదనుగా విదేశీయులకు ఉద్దేశించిన ఖరీదైన దుకాణాలను దోచుకున్నారు. మా స్వేచ్ఛ మాకు కావాలి, ఇక మీ నిరంకుశత్వం చాలు వంటి నినాదాలు కొన్ని అమెరికా పాలకులకు సంతోషం కలిగించాయి. ఇంతటి విధ్వంసంలోనూ యాభైమందిని మాత్రమే అరెస్టు చేసినట్టుగా, ఒక్కరు మరణించినట్టుగా క్యూబా ప్రభుత్వం చెబుతున్నది కానీ, లెక్కల్లో తేడా ఉండవచ్చు. 


ఈ నిరసనలను అమెరికా కుట్రగా అభివర్ణిస్తున్నారు క్యూబా పాలకులు. దీనివెనుక అమెరికన్‌ మాఫియా నియమించుకున్న పెయిడ్‌ ఏజెంట్లు ఉన్నారనీ, వారు ప్రజలను ఎగదోస్తున్నారని దేశాధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌ కన్నెల్‌ వ్యాఖ్యానించారు. అమెరికానుంచి భారీగా డబ్బుముట్టినందునే పోర్న్‌స్టార్‌ మియా ఖాలీఫా సైతం సామాజిక మాధ్యమాల ఆధారంగా ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఇందుకు ప్రతిగా ఆమె భయంకరమైన భాషలో ఎదురుదాడి చేసింది. అమెరికా కూడా ఈ సందర్భాన్ని తనకు నచ్చినరీతిలో వినియోగించుకోవడం సహజం. దశాబ్దాల నిరంకుశపాలననుంచి విముక్తికోసం పోరాడుతున్న క్యూబన్లకు తమ అండాదండా నిండుగా ఉంటాయని బైడెన్‌ హామీ ఇచ్చారు. ప్రజలపై విరుచుపడితే ఊరుకొనేది లేదంటూ క్యూబా ప్రభుత్వానికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ‘అణచివేతను ఆపి, పేదరికాన్ని ఎలా రూపుమాపాలో ఆలోచించండి’ అంటూ అమోఘమైన హితవు కూడా చెప్పారు. ఈ మంచిమాటతో పాటు, క్యూబామీద విధించిన ఆంక్షల్ని కూడా ఎత్తివేస్తామని చెప్పివుంటే క్యూబన్లమీద ఆయనకున్న ప్రేమ మరీ చక్కగా తెలిసొచ్చేది. పైగా, తాను డొనాల్డ్‌ ట్రంప్‌కు పూర్తి భిన్నమనీ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాననీ చెప్పుకున్న మనిషి కూడా. 


క్యూబా కష్టాలకు అమెరికా ఆంక్షలు ప్రధాన కారణం. ఆరుదశాబ్దాలుగా ఆ దేశాన్ని కాల్చుకుతింటూ, అధ్యక్షుడిగా ఉన్న ఫైడెల్‌ కాస్ట్రోను హత్యచేయించడానికి ఆరువందలసార్లు ప్రయత్నించారు అమెరికా పాలకులు. హెల్మ్స్‌–బర్టన్‌ చట్టంతో దెబ్బతీసే ప్రయత్నం కొనసాగినా దశాబ్దాల ఆంక్షలు తట్టుకొని నిలబడింది క్యూబా. 2014లో బరాక్‌ ఒబామా ప్రభుత్వం ఆంక్షల్ని కొంతమేరకు సడలిస్తూ ఒప్పందం చేసుకుంటే, తరువాత వచ్చిన ట్రంప్‌ దానిని కాదని, అదనంగా వందలాది ఆంక్షలను కుమ్మరించాడు. చివరకు ఇంజక్షన్‌ సూదులు కూడా దిగుమతి చేసుకొనే అవకాశం లేకుండా చేశాడు. అయినా, కరోనా కష్టాన్ని సైతం క్యూబా తట్టుకొని నిలబడి, రెండు వాక్సీన్లను అభివృద్ధి చేసుకుంది. వివిధ దేశాలకు వైద్యబృందాలను పంపి సహాయపడింది. బలిసిన దేశాలను సైతం కరోనా కుదిపేస్తుంటే, క్యూబా మాత్రం ఎంతకాలం తట్టుకోగలదు? ప్రధానంగా పర్యాటకం దెబ్బతినడంతో ఆదాయం బాగా పడిపోయింది. ఆర్థికసంక్షోభంతో ధరలు పెరిగాయి, ఆహారకొరత ఏర్పడింది. ఉన్నదానిని సర్దుకోవడం కోసం ప్రభుత్వం ఇటీవల కొన్ని నియంత్రణలను అమలు చేయడంతో, ప్రజలు కూడా భరించలేక ఇలా రోడ్లమీదకు వచ్చారు. వెనెజులా, క్యూబా ఇత్యాది దేశాల విషయంలో అమెరికా ఎంత నిర్దయగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో తెలియనిదేమీ కాదు. ఇప్పుడు కాస్ట్రోలు లేని క్యూబాను లొంగదీసుకొనేందుకు మరింత ప్రత్యేకమైన ప్రయత్నం జరుగుతోంది. క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయమని ఐక్యరాజ్యసమితి ఎన్నిమార్లు చెప్పినా వినని అమెరికాను అన్ని దేశాలూ కలిసి దారికి తీసుకురావడం ముఖ్యం.

Updated Date - 2021-07-15T06:21:02+05:30 IST