స్వ‘గ్రహణం’!

ABN , First Publish Date - 2021-10-07T05:35:22+05:30 IST

పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2009లో రాజీవ్‌ స్వగృహ కాలనీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాకు 1100 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో సగం గృహాలను పూర్తిచేసి మిగతా వాటిని అసంపూర్తిగా వదిలేశారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్వ‘గ్రహణం’!
అనామిత్ర కాలనీలో అధ్వాన రహదారులు

- రాజీవ్‌ స్వగృహ కాలనీలో సమస్యల తిష్ఠ

- కనీస సదుపాయాలు కరువు

- లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు

- ఇళ్ల వేలంలో వచ్చిన నిధులు పక్కదారి?

- పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌ 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2009లో రాజీవ్‌ స్వగృహ కాలనీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాకు 1100 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో సగం గృహాలను పూర్తిచేసి మిగతా వాటిని అసంపూర్తిగా వదిలేశారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తి ఇళ్లను విక్రయించడంతో పాటు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన వైసీపీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో స్వగృహాలకు పట్టిన గ్రహణం ఇంకా తొలగడం లేదు.


 ఎస్‌ఎంపురంలో 1,100 నిర్మాణాలు..

జిల్లాకు సంబంధించి ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో 2009లో అనామిత్ర టౌన్‌షిప్‌ పేరుతో 1,100 రాజీవ్‌ స్వగృహ నిర్మాణాలను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ఐదు సెంట్ల స్థలాల్లో 131 క్లాసిక్‌ ఇళ్లు, 4 సెంట్లలో ఇన్‌ట్రిసిక్‌, మూడు సెంట్లలో 91 బేసిక్‌ మోడల్‌, రెండు సెంట్ల స్థలాల్లో సివిక్‌ ఇళ్ల నిర్మాణాలను మొదలుపెట్టారు. మొత్తం 511 గృహాలను పూర్తి చేశారు. మిగతావి వివిధ దశాల్లో వదిలేశారు. ఊరికి చివరగా ఇళ్లు ఉండడంతో చాలామంది లబ్ధిదారులు వాటిని తీసుకొనేందుకు ముందుకురాలేదు. కేవలం 60 మంది లబ్ధిదారుల మాత్రమే గృహాలను పొందారు.


 సీఎం హామీ ఇచ్చినా.. 

పాదయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని రాజీవ్‌ స్వగృహ కాలనీ వాసులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనుకున్నట్లే వైసీపీ అధికారంలోకి రావడంతో ఎస్‌ఎంపురంలో రాజీవ్‌ స్వగృహ కాలనీలో  మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందించింది. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను యథాస్థితిలోనే విక్రయించాలని నిర్ణయించింది. వేలం ద్వారా దాదాపు 320 ఇళ్లను ఇటీవల విక్రయించింది. వాస్తవానికి ఏపీ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా ఇళ్లను విక్రయించిన అధికారులు కాలనీలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి సుమారు రూ.10కోట్ల అంచనాలతో ప్రణాళిక తయారు చేశారు. రహదారులు, తాగునీరు, విద్యుత్‌, కాలువల పనులను హైదరాబాద్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్‌ గత ఏడాది పనులు చేపట్టి మధ్యలో వదిలేశాడు. ప్రస్తుతం కాలనీలో వంద కుటుంబాలకు పైగా నివాసముంటున్నాయి. కనీస రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే ఇళ్లకు చేరేందుకు నరకయాతన పడుతున్నారు. రాత్రిపూట విద్యుత్‌ సరఫరా అంతంతే. సరైన కాలువలు లేకపోవడంతో వీధుల్లోనే మురుగు నిలిచిపోతుంది.  


దారి మళ్లిన నిధులు...

రాజీవ్‌ స్వగృహ కాలనీలోని ఇళ్ల వేలం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు దారి మళ్లించినట్లు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. తాజాగా మరోసారి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ద్వారా మరికొన్ని ఇళ్లను వేలం వేసి విక్రయించింది. వేలంలో రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన ఇళ్లకు మరమ్మతులు చేసుకోవాలని లబ్ధిదారులు చూశారు. కానీ, సరైన రహదారులు, మౌలిక వసతులు లేని కారణంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా  కాలనీలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-10-07T05:35:22+05:30 IST