సర్పంచులకు సవాల్‌..!

ABN , First Publish Date - 2021-02-27T05:23:20+05:30 IST

జిల్లాలో 50 మండలాల పరిధిలో 806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టే కారణంగా 13 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 793 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా..

సర్పంచులకు సవాల్‌..!
ఎర్రగుంట్ల మండలం మాలేపాడు గ్రామంలో ఎక్కడి మురుగు అక్కడే

పల్లెల్లో సమస్యల తిష్ట..!

శుభ్రం చేయని డ్రైనేజీలు

పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తం

తాగునీటి కోసం తల్లడిల్లే గ్రామాలెన్నో

పంచాయతీ నూతన పాలకవర్గాలకు సమస్యల తోరణం


పంచాయతీ సమరం ముగిసింది. రెండేళ్ల ప్రత్యేక పాలనకు తెర పడింది. పల్లెపోరులో విజయం సాధించిన సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యులతో నూతన పాలకవర్గం కొలువుదీరింది. సర్పంచులు కుర్చీలో కూర్చొని కూర్చోకముందే సమస్యలు సవాల్‌ విసురుతున్నాయి. వేసని ఆరంభం కావడంతో ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. వీధిదీపాలు, పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలనలో పలు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. వాటిని చెల్లించాల్సిన బాధ్యత నూతన పాలకవర్గానికి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా ప్రభుత్వం ట్రెజరీల నుంచి విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో పేరుకుపోయిన సమస్యలపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో 50 మండలాల పరిధిలో 806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టే కారణంగా 13 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 793 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 534 పంచాయతీల్లో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. 2013లో కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గం గడువు 2018లో ముగిసింది. అప్పుడే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. నాటి ప్రభుత్వం నిర్వహించలేదు. సర్పంచిల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపు రెండున్నరేళ్లుగా స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగింది. 2020 మార్చిలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఇటీవల నిర్వహించారు. ఈ నెల 21వ తేదితో జిల్లాలో 793 పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పడ్డాయి. పంచాయతీలకు వచ్చే నిధుల కంటే గెలుపు కోసం అభ్యర్థులు చేసిన ఖర్చే ఎక్కువని తెలుస్తోంది. కరెన్సీని విచ్చలవిడిగా వెదజల్లారు. సగటున రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని పంచాయతీల్లో రూ.కోటికి పైగానే ఖర్చు చేశారు.


అస్తవ్యస్తంగా పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ

2018 ఆగస్టు నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అంటే.. రెండున్నర ఏళ్లుగా పంచాయతీలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. రెండు మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారి కూడా ఉన్నారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాకపోవడం, స్పెషల్‌ ఆఫీసర్లు అప్పులు చేసి పారిశుధ్య పనులు, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ చేయాల్సి రావడం... వెరసి గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ముప్పాతిక శాతం పంచాయతీల్లో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి మురుగు అక్కడే పేరుకుపోయింది. ఫలితంగా పల్లెసీమలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో ‘పాడా’ నిధులతో పంచాయతీల్లో ప్రగతి పనులు చేస్తుండడంతో అక్కడ సమస్యలు లేకపోయినా.. మిగిలిన గ్రామాల్లో నిధుల లేమితో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.


వేసవి కష్టాలు మొదలయ్యాయి

జిల్లాలో మెజార్టీ గ్రామాల్లో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) లేవు. విద్యుత మోటర్ల బోర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు చేతిబోర్లే శరణ్యం. వర్షాకాలంలో తాగునీటికి పెద్దగా ఇబ్బందులు రాలేదు. వేసవి ఆరంభమైంది. నీటి వినియోగం పెరిగి విద్యుత మోటర్లు కాలిపోవడం, పైపులైన్ల లీకేజీ వంటి సమస్యలు నూతన పాలకవర్గానికి సవాల్‌గా మారనున్నాయి. ఎంపికైన సర్పంచుల్లో 65 శాతానికి పైగా కొత్తవారే ఉన్నారు. పాలనపైన, గ్రామాల్లో పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి నిర్వహణపై వీరికి అవగాన తక్కువ. దీంతో మెరుగైన తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. జిల్లాలో అన్ని పంచాయతీల్లో సుమారుగా రూ.150 కోట్లకు పైగానే కరెంట్‌ బిల్లులు, తాగునీరు సరఫరా, వీధి దీపాల నిర్వహణ సిబ్బంది వేతనాలు వంటి బకాయిలు చెల్లించాల్సి ఉందని అంటున్నారు.


వాస్తవాలు కొన్ని

- రైల్వేకోడూరు పంచాయతీ సర్పంచి ఎస్టీకి రిజర్వు చేశారు. పంచాయతీ జనాభా 50 వేలు పైమాటే. 20 వార్డులు ఉన్నాయి. ఈ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం గ్రీన అంబాసిడర్లకు రూ.4.80 లక్షలు వేతనం బకాయి చెల్లించాల్సి ఉంది. కరెంట్‌ బిల్లులు రూ.36 లక్షలు చెల్లించాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.10 కోట్లు ఖర్చు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులే ఇక ఆధారం. కొత్త సర్పంచికి సుమారుగా రూ.40 లక్షలకు పైగా వెంటనే అవసరం ఉంది. అలాగే.. డంపింగ్‌ యార్డు లేదు. పలు వీధుల్లో డ్రైనేజీ సమస్య వేధిస్తుంది. 

- గాలివీడు మండలంలో 17 పంచాయతీలు ఉన్నాయి. విద్యుత బిల్లులు రూ.7.50 లక్షలు బకాయి ఉంది. తాగునీటి సమస్య పలు గ్రామాల్లో వేధిస్తోంది. పలు పంచాయతీల్లో డ్రైనేజీ సమస్య ఉంది. రోడ్లపైనే మురుగునీరు పారుతోంది. మండల కేంద్రం గాలివీడు మేజర్‌ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ పంచాయతీకి ఏటా రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నా ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది.

- వేంపల్లి మేజర్‌ పంచాయతీ ఆదాయం ఏటా రూ.2.35 కోట్లు పైమాటే. ఇక్కడ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. పల్లె పట్టణ రూపు సంతరించుకుంది. పెరిగిన కాలనీలు, జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని నియమించలేదు. సిబ్బంది తక్కువ కావడంతో మురుగు కాలువలు సకాలంలో శుభ్రం చేయలేకపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్లు ఉంది. కొత్తగా ఎంపికైనా పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

- బి.కోడూరు మండలంలో 10 పంచాయతీలు ఉన్నాయి. విద్యుత బకాయిలే రూ.1.41 కోట్లు ఉన్నాయి. చేతి పంపులు, తాగునీటి విద్యుత బోర్ల మరమ్మతుల బిల్లులు రూ.70 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడు నెలలుగా ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని అధికారులు అంటున్నారు. బకాయిలతో పాటు పలు గ్రామాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయాల్సి ఉంది.

- దువ్వూరు మండలంలో 23 పంచాయతీల్లో రావాల్సిన బిల్లులే రూ.60 లక్షలకు పైగా ఉన్నాయి. మరో రూ.25-30 లక్షలకు పైగా బిల్లులు పెట్టాల్సి ఉంది. అంటే.. రూ.కోటికిపైగా బకాయిలు రావాల్సి ఉంది. కొత్తగా కొలువుదీరిన సర్పంచులు ఈ బిల్లులు చెల్లించడంతో పాటు అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. పలు గ్రామాల్లో తాగునీటి విద్యుత బోర్ల మరమ్మతుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-02-27T05:23:20+05:30 IST