Abn logo
Sep 26 2021 @ 17:08PM

Very powerful.. ఇవి ఉంటే.. వీసా ఇక్కట్లు లేనట్టే!

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ ప్రయాణాలు చేయాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి! పాస్‌పోర్ట్ అంటే ఓ దేశపౌరుడికి అక్కడి ప్రభుత్వం ఇచ్చే అధికారిక గుర్తింపు. అయితే.. పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన మనం ఇతర దేశాల్లో కాలు పెట్టలేం. ఇందుకు అనుమతిస్తూ ముందుగా ఆయా దేశాల ప్రభుత్వాలు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని దేశాల పాస్‌పోర్టులతో వీసా చిక్కులు లేకుండానే విదేశీ ప్రయాణాలు పెట్టుకోవచ్చు. ఆ పాస్‌పోర్టులకు ఉన్న ‘శక్తి’ అలాంటిది. కొన్ని సందర్భాల్లో వీసా అవసరమే ఉండదు.. మరికొన్ని సందర్భాల్లో గమ్యం చేరుకున్నాక వీసా జారీ అవుతుంది. ప్రపంచం దృష్టిలో ఓ  దేశానికున్న దౌత్యపరమైన ప్రధాన్యమే అక్కడి పాస్‌పోర్టు పవర్‌ను నిర్ణయిస్తుంది. 

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టులు ఏవో తెలిపే హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్(సూచి) తాజాగా విడుదలైంది. ఇందులో జపాన్ పాస్‌పోర్టు(స్కోరు-193) తొలిస్థానాన్ని దక్కించుకోగా.. రెండో స్థానంలో సింగపూర్(192) ఉంది. అంటే.. జపాన్ పాస్‌పోర్టు ఉన్న వారు ఏకంగా 193 గమ్యస్థానాలకు, సింగపూర్ పాస్ పోర్టు ఉన్న వారు 192 గమ్యస్థానాలకు.. వీసా జంజాటాలు లేకుండా చేరుకోవచ్చు. జర్మనీ, దక్షిణకొరియా దేశాలు ఉమ్మడిగా మూడోస్థానాన్ని సాధించాయి. అగ్రరాజ్యం అమెరికా ఏడో స్థానంలో ఉంది.  

అయితే.. కరోనా సంక్షోభం కారణంగా వీసా జంజాటాలు లేని గమ్యస్థానాల సంఖ్య ఇక్కడ పేర్కొన్న దానికంటే కాస్త భిన్నంగా ఉంటుందని హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రూపకర్తలు హెన్లీ అండ్ పార్టనర్స్ పేర్కొన్నారు. ఉదాహరణకు కరోనా సంక్షోభానికి మునుపు 193 స్కోర్ ఉన్న జపాన్ పాస్‌పోర్టుతో 193 గమ్యస్థానాలకు ముందస్తు అనుమతులు లేకుండా వెళ్లే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇది 75 మాత్రమే. కరోనా లాంటి తాత్కాలిక అవాంతరాలను  హెన్లీ ఇండెక్స్ పరిగణలోకి తీసుకోదు కాబట్టి..  పాస్‌పోర్టు ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ఇక మనదేశం ర్యాంకు 90. భారత పాస్‌పోర్టుతో వివిధ దేశాల్లోని 58 గమ్యస్థానాలకు వీసా చిక్కులు లేకుండా వెళ్లిరావచ్చు. 113వ ర్యాంకు దక్కించుకున్న దాయది దేశం పాకిస్తాన్..  అత్యంత చెత్త పాస్‌పోర్టుల జాబితాలో చోటు దక్కింది.

తాజా వార్తలుమరిన్ని...