మహాత్ముడి సిద్ధాంతాల నీడలో ప్రపంచం

ABN , First Publish Date - 2020-10-02T06:10:57+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధాల ప్రభావశీలత ఎంతటిదో నేడు ప్రపంచమంతటా రుజువైంది. సముద్రమంతటి విశాలమైన ఆయన ఆలోచనా దృక్పథం...

మహాత్ముడి సిద్ధాంతాల నీడలో ప్రపంచం

గాంధీజీ ప్రబోధాలు అజరామరం. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరీక్షించి నిర్ధారించుకున్న తర్వాతే జాతిపిత వాటిని బోధించడం ఇందుకు కారణం. స్థలాకాలాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రబోధాలు నిత్యం అనుసరణీయాలు. ఆ మేరకు గాంధీమార్గం అత్యుత్తమం, అత్యంత శాశ్వతమని ప్రపంచం గ్రహిస్తోంది.


జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధాల ప్రభావశీలత ఎంతటిదో నేడు ప్రపంచమంతటా రుజువైంది. సముద్రమంతటి విశాలమైన ఆయన ఆలోచనా దృక్పథం సాయంతో విశ్వ జనావళి తమ సమస్యల చిక్కుముడులను విప్పుకుంటోంది. ఆయుధ పోటీ నడుమ చిక్కుకుపోయిన ప్రపంచం ఈనాడు గాంధీ సిద్ధాంతంపై గాఢమైన విశ్వాసం ప్రదర్శిస్తోంది. యుద్ధాలు ఏ సమస్యనూ పరిష్కరించజాలవని ప్రజలు అర్థం చేసుకోక తప్పని పరిస్థితి నేడు ఏర్పడింది. ప్రపంచంలో హింసాత్మక విప్లవాలు ఏ మార్గాన్నీ చూపలేకపోయాయి. అనివార్యంగా అనుసరించదగిన అత్యుత్తమ మార్గం సత్యాగ్రహం, అహింసేనని కాలమే స్పష్టంగా నిరూపించింది. తదనుగుణంగా భిన్నాభిప్రాయాలను, నిరసనను వ్యక్తం చేయడానికి ప్రత్యామ్నాయ, మానవీయ మార్గం ఒకటి ఉందని విశ్వ మానవాళి, వ్యవస్థలు లేదా దేశాలు విశ్వసిస్తుండటం తిరుగులేని వాస్తవం.


 గాంధీజీ ఆలోచనలోని ఔచిత్యం కాలంతోపాటు ముందుకు సాగుతోంది. ప్రస్తుతకాలంలో పర్యావరణ పరిరక్షణ అనేది అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ప్రాధాన్య సమస్యగా పరిణమించింది. పర్యావరణ పరిస్థితులు దిగజారటంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మేధావులు, ఉద్యమకారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, పర్యావరణం గురించి జాతిపిత మహాత్మాగాంధీ తనదైన సిద్ధాంతాన్ని ఏనాడో ఆవిష్కరించారు. పర్యావరణం అనే మాట బాపూజీ కాలంలో వాడుకలో లేనప్పటికీ ఆయన దార్శనికత ఎంతో ముందుచూపుతో ఉండేది. అందుకే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను అప్పట్లోనే అంచనా వేయగలిగిన ఆయన ఎంతగానో ఆందోళన వెలిబుచ్చారు. ‘ప్రతి ఒక్కరి అవసరాన్నీ తీర్చగలిగినంత ప్రకృతి వనరులు ఈ భూమ్మీద ఉన్నాయి... అంతేగానీ దురాశను తీర్చగలిగినంతగా కాదు’ అని గాంధీజీ విశ్వసించారు. ‘స్వాస్థ్యకీ కుంజీ’ (ఆరోగ్యానికి తాళంచెవి) అనే వ్యాసంలో పరిశుభ్రమైన గాలి గురించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి జీవికీ గాలి, నీరు, ఆహారం మూడూ ప్రాణాధారమే అయినా, వాటిలో పరిశుభ్రమైన గాలి అత్యంత ప్రధానమైనదని నొక్కిచెప్పారు. నూలు వడికి చేనేత వస్త్రాలను ధరించాల్సిందిగా భారతీయులందరికీ ప్రబోధించారు. స్వదేశీ భావనను ప్రోత్సహించడం మాత్రమేగాక సాధారణ వ్యర్థాలతోపాటు జౌళి మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలను తగ్గించాలన్నది ఆయన ప్రబోధంలోని అంతరార్థం.


 గ్రామీణాభివృద్ధి విషయంలో కూడా ఆయన చూపించిన మార్గం ఇప్పటికి అనుసరణీయం. గ్రామాల సముద్ధరణ గురించి 1946లో ‘హరిజన సేవక్‌’ పత్రికలో రాసిన వ్యాసంలో-, ‘గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి కళలు, హస్తకళా ప్రావీణ్య ఉండాలంటే.. వారి ఉత్పత్తులకు ఆయా గ్రామాల వెలుపల కూడా జనాదరణ ఉండాలి’ అని వివరించారు. ఒకవైపు స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం కొనసాగిస్తూనే... మరోవైపు అసంఘటితంగా ఉన్న భారతీయ సమాజ నిర్మాణాన్ని సంఘటితం చేయడం కోసం వినూత్న కార్యక్రమాలకు రూపుదిద్దేవారు. మెరుగైన సమాజ నిర్మాణంలో విద్య ప్రధాన పాత్ర పోషించగలదని గాంధీజీ విశ్వసించారు. అంతేకాకుండా 1917లో చంపారన్‌ సత్యాగ్రహం సందర్భంగా ‘బర్హర్వా లఖన్‌సేన్‌’లో తొలి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. విద్యకు గల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ 1937 మే 8వ తేదీన ‘హరిజన్‌’లో ఒక వ్యాసం రాశారు. ‘మానవుడంటే నిండు మేధస్సు గానీ, -స్థూలశరీరం గానీ కాదు. హృదయం లేదా ఆత్మ కాదు. ఓ సంపూర్ణ మానవ సృష్టి జరగాలంటే వీటన్నిటితో కూడిన సముచిత, సుస్థిర సమ్మేళనం అవసరం. విద్యలోని అసలైన ఉద్దేశం ఇదే’ అని విశదీకరించారు.


 స్వదేశీ ఉద్యమంద్వారా మాత్రమే భారత్‌ ఒక బలమైన, స్వయంసమృద్ధ దేశంగా రూపొందగలదని ఆయన ఆనాడే ప్రవచించారు. ఈ నేపథ్యంలో నేడు భారత్‌ స్వదేశీ ఉద్యమ బాటలోనే ముందడుగు వేస్తోంది. దీంతో చిన్న పరిశ్రమల వికాసానికి ఒక అవకాశం లభించింది. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో గ్రామీణులు కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి వీలు కలిగింది. స్వదేశీ విధానంతోనే దేశం స్వయంసమృద్ధం కావాలనే గాంధీజీ ఆకాంక్షకు అనుగుణంగా చాలాకాలం తర్వాత మనం వేసిన అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. నేడు ప్రజల్లోనూ స్వదేశీపై అవగాహన పెరుగుతుండటం ఎంతో హర్షణీయం. మన గ్రామాలన్నీ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ బృహత్ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం ‘పరిశుభ్ర భారతం’ (స్వచ్ఛ భారత్‌) వంటి బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల గ్రామాలు, నగరాలు శుభ్రంగా తయారవుతున్నాయి. గ్రామీణ సంస్కరణల్లో పరిశుభ్రతకు స్థానం లేకపోతే మన గ్రామాలు చెత్తబుట్టల్లా మిగిలిపోతాయని గాంధీ చెప్పేవారు. గ్రామీణ పరిశుభ్రత ప్రజాజీవనంలో అవిభాజ్యం. ఇది అవసరమేగానీ, ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం. ఇందుకోసం మనం కఠోరంగా శ్రమించడమే గాక అపరిశుభ్రత నడుమ జీవించే మన చిరకాల అలవాటును త్యజించి తీరాలి. ఇక పల్లెల తరహాలోనే పట్టణాల పరిశుభ్రత గురించి కూడా గాంధీజీ ఆలోచించేవారు. ఈ విషయంలో నగరాల పరిశుభ్రతకు పవిత్రతను ఆపాదించే పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవచ్చునని, ఆయన చెప్పేవారు. ఈ విధానాన్ని మనమింకా అలవరచుకోవాల్సి ఉంది.


గాంధీజీ ప్రబోధాలు అజరామరం. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరీక్షించి నిర్ధారించుకున్న తర్వాతే జాతిపిత వాటిని బోధించడం ఇందుకు కారణం. స్థలాకాలాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రబోధాలు నిత్యం అనుసరణీయాలు. ఆ మేరకు గాంధీమార్గం అత్యుత్తమం.. అత్యంత శాశ్వతమని ప్రపంచం గ్రహిస్తోంది.


ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

(కేంద్ర పర్యాటక -సాంస్కృతిక

శాఖ సహాయ మంత్రి)

Updated Date - 2020-10-02T06:10:57+05:30 IST