చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-10-08T06:29:02+05:30 IST

The worker died while receiving treatment

చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
పెంటయ్య (ఫైల్‌ ఫొటో)

సబ్బవరం, అక్టోబరు 7: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కార్మికుడు శుక్రవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి సీఐ రంగనాథం తెలిపిన వివరాలివి. మండలంలోని మొగలిపురం పరిధిలో గల  సీలింగ్‌ షీట్ల తయారీ కర్మాగారంలో గుల్లేపల్లికి చెందిన నక్కెళ్ల పెంటయ్య (38) పనిచేసేవాడు. గత నెల 24న ప్లాంటులో బ్రాయిలర్‌ మరమ్మ తుకు గురికావడంతో ఇన్‌చార్జి ఆ  మూత తీశాడు. దీంతో ద్రవ రూపంలో అధిక ఉష్ణోగ్రతలో ఉన్న జిప్సమ్‌ ఆ ప్రక్కన విధులు నిర్వహిస్తున్న పెంటయ్యతో పాటు సీహెచ్‌.దేముడమ్మ, ఎ.రమణమ్మపై పడింది. దీంతో  పెంటయ్య తీవ్ర గాయాలకు గురికాగా, మిగతా మహిళలు ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే పెంటయ్యను విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం అతడు మృతిచెందినట్టు సీఐ తెలిపారు. కాగా, పరిశ్రమ యజమాని వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకూ మృతదేహాన్ని తీసుకువెళ్లబోమని, కేజీహెచ్‌ మార్చురీలోనే ఉంచేశామని మృతుడి అల్లుడు దేముడుబాబు తెలిపారు.  

 

వరహా నది దాటుతూ వృద్ధురాలి మృతి

గొలుగొండ, అక్టోబరు 7: పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా వరహానదిలో కొట్టుకుపోయి వృద్ధురాలు మృతి చెందినట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. ఎరకంపేట గ్రామానికి చెందిన బందర సత్యవతి(60) గురువారం సాయంత్రం వరహానది దాటుతుండగా కొట్టుకుపోయిందన్నారు. శుక్రవారం ఉదయం గుండుపాల గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. ఎరకంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరు ...

మల్కాపురం, అక్టోబరు 7: హెచ్‌పీసీఎల్‌లో కొండకు ఆనుకొని వున్న చిమ్నీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది కార్మికులు గోడనిర్మాణ పనులు చేపడుతుండగా వర్షానికి బాగా నానిపోవడంతో ఆ గోడ కూలి ఇద్దరు కార్మి కులపై పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయలయ్యాయి. వివ రాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కె.కృష్ణ (46)తో పాటు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామానికి చెందిన పైడితల్లితో పాటు మరికొంతమంది కార్మికులు హెచ్‌పీసీఎల్‌ వ్యర్థాలను వాయు రూపంలో విడిచిపెట్టే చిమ్నీకి సమీపంలోని కొండ వద్ద గోడ నిర్మాణం పనులు చేపట్టారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా పనుల్లో నిమగ్నమై వుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నిర్మాణంలో వున్న గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున కృష్ణ, పైడితల్లిపై గోడ పడడంతో మిగతా కార్మికులు అక్కడకు చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయాలతో వున్న కృష్ణ, పైడితల్లిలను వెంటనే వారికి హెచ్‌పీసీఎల్‌ డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. ఈ మేరకు మల్కాపురం సీఐ లూథర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అదుపు తప్పి బొగ్గు లారీ బోల్తా

పరవాడ, అక్టోబరు 7 : బొగ్గు లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని వెన్నెలపాలెం ఇటుక బట్టీల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బయ్యవరం యార్డు నుంచి వెన్నెలపాలెం సమీపంలో గల ఓ ప్రైవేటు పరిశ్రమకు బొగ్గు లోడుతో లారీ బయల్దేరింది. ఎన్టీపీసీ రహదారి నుంచి వెన్నెలపాలెం వెళ్లే రహదారిలోని ఇటుక బట్టీ సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ సమయంలో వాహనంతో డ్రైవర్‌ ఒక్కడే ఉండడంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. 


69 మద్యం సీసాలు స్వాధీనం

పరవాడ, అక్టోబరు 7: బెల్టు షాపుపై ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు శుక్రవారం దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజపల్లికి చెందిన మూగి ధనరాజు గత నాలుగేళ్లుగా తానాం నుంచి వెంకటాపురం వెళ్లే రహదారికి ఆనుకొని గుట్టుచప్పుడు కాకుండా బెల్టు దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో వెళ్లి దాడిచేశారు.  ఈ సందర్భంగా 69 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, సదరు వ్యాపారిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.

Updated Date - 2022-10-08T06:29:02+05:30 IST