ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2022-09-29T05:45:10+05:30 IST

సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఓ కార్మికుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

- వైద్యుల నిర్లక్ష్యమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు, కార్మిక సంఘాల ధర్నా

గోదావరిఖని, సెప్టెంబరు 28: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఓ కార్మికుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆర్‌జీ-1 పరిధిలోని సీఎస్‌పీ1లో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేసే తిప్పారపు శ్రీనివాస్‌(46) అనే కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురికావడంతో ఐదు రోజుల క్రితం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందా డు.  వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శ్రీనివాస్‌ మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. శ్రీనివాస్‌కు సరైన వైద్యం అందలేదని,  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హైదరాబాద్‌కు రెఫర్‌ చేయాలని సూచించినా వైద్యులు నిర్లక్ష్యం వహించారని  శ్రీనివాస్‌ భార్య ఆరోపించింది. 

- ఆసుపత్రి ఎదుట ఆందోళన..

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శ్రీనివాస్‌ మృతి చెందాడంటూ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, మెండె శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, టీబీజీకేఎస్‌ నాయకుడు పుట్ట రమేష్‌, ఏఐటీ యూసీ నాయకులు రంగు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో నాసిరకమైన మందులు ఇస్తున్నారని, ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్‌కు వైద్యులు సరైన వైద్యం అందించలేదని, హైదరాబాద్‌కు తరలించాలని విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. నాసిరకం మందుల వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రిలో నైపుణ్యం కలిగిన వైద్యులను నియమించాలని వారు డిమాండ్‌ చేశారు. 

- వైద్యుడిపై హత్య కేసు నమోదు చేయాలి..

శ్రీనివాస్‌ మృతికి కారణమైన వైద్యుడు మధుకర్‌పై హత్యానేరం నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు, బంధువులు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌కు సరైన వైద్యం అందించకపోవడం వల్లనే మృతి చెందాడని, ఒకే నెలలో ముగ్గురు సదరు వైద్యుని చేతిలో మృతి చెందారని, వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

- కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆసుపత్రిలో కాంగ్రెస్‌ పార్టీ రామగుండం ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.1కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్యుడిని విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-09-29T05:45:10+05:30 IST