నత్తనడకన ‘జల్‌జీవన్‌ మిషన్‌’

ABN , First Publish Date - 2022-01-22T04:42:15+05:30 IST

జిల్లాలో ‘జల్‌జీవన్‌ మిషన్‌’ పథకానికి అతీగతీ లేకుండా పోతోంది. ప్రజలకు శుద్ధ జలాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలివిడతగా ఎంపిక చేసిన గ్రామాలకు ఇంటింటి కుళాయి ద్వారా నీరందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 1,786 పనులను రూ.301 కోట్లతో పూర్తి చేయాలని భావించింది. పనులు ప్రారంభించింది. నెలలు గడుస్తున్నా పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు.

నత్తనడకన ‘జల్‌జీవన్‌ మిషన్‌’
వృథాగా ఉన్న పైపులైన్‌లు

ఇప్పట్లో ఇంటింటికీ కుళాయి సాధ్యమేనా? 

లక్ష్యం చేరుకునేది ఎప్పటికో?

బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో ‘జల్‌జీవన్‌ మిషన్‌’ పథకానికి అతీగతీ లేకుండా పోతోంది. ప్రజలకు శుద్ధ జలాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలివిడతగా ఎంపిక చేసిన గ్రామాలకు ఇంటింటి కుళాయి ద్వారా నీరందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 1,786 పనులను రూ.301 కోట్లతో పూర్తి చేయాలని భావించింది. పనులు  ప్రారంభించింది. నెలలు గడుస్తున్నా పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. బిల్లుల విడుదలలో జాప్యం వల్లనే పనులు నెమ్మదిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 6,65,023 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటివరకూ 1,06,657 ఇళ్లకు మాత్రమే తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. మిగతా కుటుంబాలు శుద్ధ నీటి కోసం ఇతర వనరులపైనే ఆధారపడుతున్నాయి. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో 3.73 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం 1,786 పనులు పూర్తి చేయాలనుకున్నారు. వీటిలో 5 లక్షల లోపు నిధులతో పూర్తయ్యే 455 పనులు ఎంపిక చేసి నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. వీటిలో ఇప్పటి వరకూ 285 పనులు మాత్రమే పూర్తికాగా మరో 112 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లలో చాలా మందికి బిల్లులు మంజూరు కాలేదు. ఆ ప్రభావం పనులపై పడుతోంది. 


ముందుకు రాని కాంట్రాక్టర్లు

జిల్లాలో ఒక్కో పని రూ.5 లక్షల అంచనాలతో 486 పనులు చేపట్టాల్సి ఉంది. 230 పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. మిగిలిన వాటిని చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయిలో టెండర్లు పిలుస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో మిగిలిపోయిన వాటిని ఒక ప్యాకేజీగా పరిగణించి టెండర్లు పిలుస్తున్నారు. వాటికి ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు. ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. అప్పటిలోగా చేయలేకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు, అంచనాలు, డీపీఆర్‌ల విషయంలో అధికారులు చొరప చూపకపోతే పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. 


టెండర్లు పూర్తిచేస్తాం

పనులు నత్తనడకన నడుస్తున్న మాట వాస్తవమే. పెండింగ్‌ బిల్లులు ఈ 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకా టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్టర్లతో అధికారులు మాట్లాడుతున్నారు. చిన్నవి వేగంగా పూర్తి చేసి   గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తాం. లక్ష్యం మేరకు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. 

- వెలమల రవికుమార్‌, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, శ్రీకాకుళం

Updated Date - 2022-01-22T04:42:15+05:30 IST