అనారోగ్యంతో కొడుకు.. పూణె నుంచి స్కూటీపై ఝార్ఖండ్‌కు తల్లి

ABN , First Publish Date - 2020-07-28T23:12:20+05:30 IST

అనారోగ్యంతో ఉన్న కుమారుడిని చూసేందుకు ఓ మహిళ సాహసం చేసింది. స్కూటర్‌పై మహారాష్ట్ర నుంచి

అనారోగ్యంతో కొడుకు.. పూణె నుంచి స్కూటీపై ఝార్ఖండ్‌కు తల్లి

ఝార్ఖండ్: అనారోగ్యంతో ఉన్న కుమారుడిని చూసేందుకు ఓ మహిళ సాహసం చేసింది. స్కూటర్‌పై మహారాష్ట్ర నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరింది. ఐదు రోజులపాటు 1800 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తానికి కుమారుడిని చేరుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ముంబైలో చిక్కుకుపోయిన సోనియా దాస్ (26).. అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేశాడు. దీంతో చేసేది లేక పూణెలోని తన స్నేహితురాలు సాబియా బానో ఇంటికి చేరుకుంది. 


అదే సమయంలో తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సాయం చేయాలంటూ ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ ద్వారా అర్థించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. రైళ్లు తిరగకపోవడంతో వెళ్లే దారి కనిపించకుండా పోయింది. విమానంలో వెళ్దామంటే డబ్బుల్లేని పరిస్థితి. దీంతో తన కుమారుడిని కలుసుకునేందుకు స్కూటర్‌పై వెళ్లాలని నిర్ణయించుకుంది. 


ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ట్వీట్ చేశానని, మహారాష్ట్ర, ఝార్ఖండ్ హెల్ప్ లైన్లకు ఫోన్ చేశానని, కానీ అవేవీ పనిచేయలేదని దాస్ వివరించింది. దీంతో చివరికి స్కూటర్‌పై జంషెడ్‌పూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఈ నెల 20న రాత్రి స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై బయలుదేరానని పేర్కొంది. ముంబై మీదుగా ఐదు రోజుల ప్రయాణం తర్వాత శుక్రవారం సాయంత్రం జంషెడ్‌పూర్ చేరుకున్నట్టు దాస్ తెలిపింది. 


ఐదు రోజులపాటు 1800 కిలోమీటర్లు ప్రయాణించి కుమారుడి వద్దకు చేరుకున్న సోనియా దాస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె తెగువకు ప్రశంసల వర్షం కురిసింది. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆమెకు బిగ్ సెల్యూట్ అంటూ ట్విట్టర్ హోరెత్తింది. 

Updated Date - 2020-07-28T23:12:20+05:30 IST