ప్రేమికులు విడిపోయిన సందర్భాల్లో ఎక్కువగా యువతులే మోసపోతుంటారు. మాయమాటలు నమ్మి చివరకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో యువకులు కూడా మోసపోతుంటారు. ఇటీవల అలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. అదే క్రమంలో ఇంగ్లాండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రియుడు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనుమానం రావడంతో లోతుగా విచారించగా అసలు నిజం తెలిసింది.
ఇంగ్లాండ్‌కు చెందిన కర్టనీ ఎయిన్స్ వర్త్(20)అనే యువతి లూయీస్ అనే యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే తర్వాత కొన్నాళ్లకు విభేదాలు వచ్చి విడిపోయారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రియురాళ్లపై ప్రియుళ్లు పగ తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం విచిత్రంగా మాజీ ప్రియుడిపై యువతి పగ తీర్చుకోవాలని కుట్ర పన్నింది. ఎన్నో రకాలుగా ఆలోచించి చివరకు ఒక పథకం పన్నింది. తన మాజీ ప్రియుడి పేరుతో 30 నకిలీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లు ప్రారంభించింది.
మాజీ ప్రియుడు తనను చంపేస్తానని బెదిరించినట్లుగా.. తనకు తానే మెసేజ్‌లు పంపించుకుంది. ఇలా చాలా మెసేజ్‌లు పంపించుకున్నాక.. ఓరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మాజీ ప్రియుడు పగ పట్టాడని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో లూయీస్.. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి.. లోతుగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తన తప్పును ఒప్పుకొంది. దీంతో కోర్టు ఆమెకు 10 నెలల జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి