YS Jagan పాలన ఏడ్చినట్టే ఉంది.. ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తారు.. ఎకరంన్నర పొలం పందెం..

ABN , First Publish Date - 2022-05-17T09:19:16+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ పాలన ఏడ్చినట్టే ఉందని, ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన మహిళ

YS Jagan పాలన ఏడ్చినట్టే ఉంది.. ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తారు.. ఎకరంన్నర పొలం పందెం..

  • గుంటూరు స్పందనలో మహిళ సవాల్‌

గుంటూరు (తూర్పు), మే 16: రాష్ట్రంలో జగన్‌ పాలన ఏడ్చినట్టే ఉందని, ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన మహిళ సవాల్‌ చేసింది. కావాలంటే తన ఎకరంన్నర పొలం పందెం కాస్తానని వెల్లడించింది. ఆక్రమణకు గురైన తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఎన్నో రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్పందనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె జగన్‌ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దళిత కుటుంబానకి చెందిన తనకు జగన్‌ పెన్షన్‌ కూడా కట్‌ చేశాడని.. కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశాడని వాపోయింది.


వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కె వెంకాయమ్మకు గ్రామంలో 4.50 సెంట్లు భూమి ఉంది. దానిలో 3.50 సెంట్లు అదేగ్రామానికి చెందిన కర్ని ప్రకాశం ఆక్రమించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ అనేకసార్లు స్థానిక అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో గుంటూరు కలెక్టరేట్‌లో స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు పాలన చేతగాదని చెప్పింది. అన్న క్యాంటీన్లు తీసివేశాడని, కొవిడ్‌ సమయంలో అసమర్ధత పాలన అందించాడని మండిపడింది. అసలు ఆయన పథకాలు తనకు వద్దే వద్దని తేల్చి చెప్పింది. ఒక పక్క డబ్బులు వేస్తూ మరో పక్కన లాక్కుంటున్నాడని తిట్ల పురాణం అందుకుంది. జగన్‌ ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీలమీద ప్రేమ ఉన్నట్టు చెప్పుకుని తిరుగుతున్నారు తప్ప ఆయనకు పరిపాలన చేతగాదని మండిపడింది. చంద్రబాబు సమయంలో చంద్రన్న కానుకులు, రంజాన్‌ తోఫాలు అందించారని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని.. కావాలంటే తనకున్న ఎకరంన్నర పొలం పందెం కాస్తానంటూ సవాల్‌ విసిరింది. జగన్‌ మాత్రం మరోసారి అధికారంలోకి రాడని తేల్చి చెప్పింది.

Updated Date - 2022-05-17T09:19:16+05:30 IST