ది వైట్‌ టైగర్‌

ABN , First Publish Date - 2021-01-31T21:25:51+05:30 IST

‘ఈ ప్రపంచంలో ఏది అందంగా ఉంటుందో తెలుసుకుని, ఎప్పుడైతే రియలైజ్‌ అయ్యావో... ఆ క్షణమే బానిస బతుకును ఆపేసెయ్‌...’ అంటాడు ప్రసిద్ధ కవి ఇక్బాల్‌. ఒకప్పుడు మన దేశంలో వెయ్యికి పైగా కులాలు ఉండొ

ది వైట్‌ టైగర్‌

‘ఈ ప్రపంచంలో ఏది అందంగా ఉంటుందో తెలుసుకుని, ఎప్పుడైతే రియలైజ్‌ అయ్యావో... ఆ క్షణమే బానిస బతుకును ఆపేసెయ్‌...’ అంటాడు ప్రసిద్ధ కవి ఇక్బాల్‌. ఒకప్పుడు మన దేశంలో వెయ్యికి పైగా కులాలు ఉండొచ్చు... కానీ ఇప్పుడున్నది రెండే... ఒకటి పొట్ట బయటికున్నవారు, రెండు పొట్ట లోపలికి ఉన్నవారు. ఎప్పటికైనా లేనోడు, ఉన్నోడి కింద బానిసలా బతకాల్సిందే. ఈ బానిస బతుకులు చికెన్‌ షాపు దగ్గరి ఇనుప జాలీలో ఉన్న కోళ్లలాంటివి... వరుసగా కత్తి వేటుకు బలి కావాల్సిందే... కాకపోతే కాస్త వెనుకా ముందర. అంతేగానీ కోడికి ఆ ఇనుప జాలీ నుంచి బయటపడే మార్గం ఉంటుందా? ఇదే ఉదాహరణను పేర్కొంటూ ఇండియాలో ఉన్న కులతత్వం, ధనవంతులు, పేదల మధ్య ఉన్న అంతరం గురించి చైనీస్‌ ప్రీమియర్‌ వెన్‌ జియోబావోస్‌కు ఈ మెయిల్‌ రాస్తుంటాడు బలరామ్‌ (ఆదర్శ్‌ గౌరవ్‌) అనే వ్యాపారవేత్త. ఇంతకుముందు అతడొక మామూలు డ్రైవర్‌... తరానికి ఒకసారి మాత్రమే పుట్టే ప్రత్యేకమైన బ్రీడ్‌కు చెందిన ‘వైట్‌ టైగర్‌’.   


లక్ష్మణ్‌గఢ్‌ అనే చిన్న ఊరిలో టీచర్‌ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు అర్థంకాక తెల్లమొహాలు వేసుకుని చూస్తుంటే బలరామ్‌ మాత్రం ఇంగ్లీషులో సమాధానం ఇస్తాడు. ‘‘నువ్వొక వైట్‌ టైగర్‌వి రా... నువ్విక్కడ చదవాల్సినోడివి కావు ఢిల్లీలో చదువుకోవాల్సినవాడివి’’ అంటాడు టీచర్‌. స్కాలర్‌షిప్‌ కూడా ఇప్పిస్తానంటాడు. కానీ పరిస్థితులు ఆ కుర్రాడికి అనుకూలించవు. అతడి తండ్రి అప్పు తీర్చకపోవడంతో ఊరి భూస్వామి (మహేశ్‌ మంజ్రేకర్‌) బెదిరిస్తాడు. పేదరికానికి తోడు టీబీతో మరణిస్తాడాయన. చితిపై కదులుతున్న తండ్రి శవాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోతాడా కుర్రాడు. అప్పు తీర్చేందుకు నానమ్మ బలవంతంతో బొగ్గులు కొట్టే పనికి కుదురుతాడు. అన్న కూడా అదే పనిచేస్తున్నాడు. ఎదుగుతున్న కొద్దీ బలరామ్‌ హల్వాయి ఆలోచనలు ఒక రూపం సంతరించుకుంటాయి. సరిగ్గా అప్పుడే భూస్వామి కొడుకు అశోక్‌ (రాజ్‌కుమార్‌ రావ్‌) తారసపడతాడు. అతడు తన భార్య పింకీ (ప్రియాంక చోప్రా)తో కలిసి ఇటీవలే ఇండియాకు వచ్చాడు. తండ్రిలా ఔట్‌ డేటెడ్‌ బొగ్గు వ్యాపారం కాకుండా బెంగళూరులో ఏదైనా స్టార్టప్‌ పెట్టాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే అతడి దగ్గర కారు డ్రైవర్‌గా చేరితే తన జీవితం మారుతుందని భావిస్తాడు బలరామ్‌. 



ఊరి నుంచి ధన్‌బాద్‌ పట్టణానికి వెళ్లి అశోక్‌ సార్‌ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తూ డబ్బు సంపాదిస్తానంటాడు. మొదట నిరాకరించినా ‘అక్కడ సంపాదించిన ప్రతీ పైసా తనకు పంపాల’ని షరతు పెడుతుంది బలరామ్‌ నానమ్మ. ‘సరే’నని తన కలను పండించుకునేందుకు ధన్‌బాద్‌ ప్రయాణమవుతాడు. లౌక్యంగా పొగడ్తలతో భూస్వామిని ఒప్పించి వాళ్లింట్లో డ్రైవర్‌గా చేరతాడు. కానీ అక్కడ తనకన్నా సీనియర్‌ డ్రైవర్‌ మరొకరున్నారు. ‘బిజినెస్‌లో పైకి రావాలంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడో ఒక కన్నేసి ఉంచాలి’ అనే సూత్రాన్ని అనుసరించి తెలివిగా తనకు అడ్డుగా ఉన్న సీనియర్‌ డ్రైవర్‌ను తప్పించి అశోక్‌, పింకీలకు డ్రైవర్‌గా మారతాడు బలరామ్‌. డబ్బున్నోడికి, రాజకీయాలకు సంబంధం ఉంటుంది.


అందులో భాగంగా ఒక సమస్య తేల్చుకోవడానికి అశోక్‌, పింకీల మకాం దేశ రాజధాని ఢిల్లీకి మారుతుంది. వారితో పాటు ఢిల్లీకి వస్తాడు బలరామ్‌. ఈ నేపథ్యంలో ఉన్నోడికి, లేనోడికి మధ్య అంతరం, కింది కులస్థులను ఉన్నత వర్గాలు చూసే విధానం ఈ బానిసలో ఒకరకమైన అలజడిని రేపుతుంటాయి. పింకీ పుట్టినరోజు అర్థరాత్రి పీకలదాకా తాగి, తానే డ్రైవ్‌ చేస్తానంటుంది. మైకంలో పిల్లాడిని ఢీ కొట్టి చంపేస్తుంది. ఆ సమయానికి రోడ్డు మీద ఎవరూ లేరు కాబట్టి, ఆ ప్రమాదానికి తనే కారణమని బలరామ్‌ను ‘కన్ఫెషన్‌ లెటర్‌’ ఇవ్వమని ఒత్తిడి చేస్తారు అశోక్‌ కుటుంబసభ్యులు. అంటే డబ్బున్నోళ్ల ముందు పేదలు ఎప్పుడైనా బానిసలే... బలికావాల్సిందే. ఈ పద్ధతి నచ్చక, వారిని ఎదిరించలేక భర్తను వదిలేసి పింకీ తిరిగి అమెరికా వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ బలరామ్‌తో ఒక మాట చెబుతుంది ‘నేనొక తాళం చెవి కోసం చాలాకాలంగా వెదుకుతున్నా... కానీ అన్నివేళలా తలుపులు తెరుచుకునే ఉన్నాయి’ అని. 


అయితే, ఇంతకాలం బానిసలా ఉన్న బలరామ్‌ బెంగళూరులో ‘వైట్‌ టైగర్‌ డ్రైవర్స్‌’ టాక్సీ కాల్‌సెంటర్‌ సంస్థకు అధిపతిగా, వ్యాపారవేత్తగా ఎలా మారాడు? బెంగళూరుకు రాబోతున్న చైనీస్‌ ప్రీమియర్‌ వెన్‌ జియోబావోస్‌ను కలవాలని ఎందుకు ఈ మెయిల్‌ రాస్తున్నాడు? అనేది ఆసక్తికరం. 128 నిమిషాల నిడివిగల ఈ సినిమాను రెండు పొరలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పైకి ధనవంతులు, పేదల నడుమ అంతరం గురించి చూపుతూనే అంతర్గతంగా అవినీతి, కులం, అసమానతలు, ప్రపంచీకరణ, మారు తున్న మానవసంబంధాలను చర్చిస్తాడు దర్శకుడు రమిన్‌ బహ్రానీ. ఇంగ్లీష్‌, హిందీలో సాగే ఈ నవలా చిత్రంలో కొన్ని మెరుపులు, మరకలు ఉన్నప్పటికీ చివరికి మన కళ్ల ముందు నిలిచేది మాత్రం బలరామ్‌ అనే ఆదర్శ్‌ గౌరవ్‌. ఈ సాధారణ డ్రైవర్‌అమాయకపు నవ్వు, అందులోని అలజడి మనల్ని సినిమా పూర్తయ్యాక కూడా వెంటాడుతూనే ఉంటుంది.



నవల... సినిమాగా...

భారతీయ మూలాలున్న ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగ 2008లో రాసిన నవల ‘ది వైట్‌ టైగర్‌’. ప్రసిద్ధ ‘బుకర్‌ ప్రైజ్‌’ను గెలుచుకున్న ఈ నవలకు అమెరికన్‌ దర్శకుడు రమిన్‌ బహ్రానీ కొన్ని మార్పులతో తెర రూపం ఇచ్చారు. ఈ సినిమాలో పింకీగా నటించిన ప్రియాంక చోప్రా కూడా నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. సినిమా స్ర్కిప్టు పూర్తయిన తర్వాత దర్శకుడు బహ్రానీ ప్రధాన పాత్ర బలరామ్‌ కోసం లోకల్‌ బస్సుల్లో తిరుగుతున్న క్రమంలో ఆదర్శ్‌ గౌరవ్‌ కలిశాడు. ఈ పాత్రకు ఎంపికైన తర్వాత ఆదర్శ్‌ జార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఎవరికి తెలియకుండా ప్లేట్లు కడుగుతూ అక్కడివారి బాడీ లాంగ్వేజ్‌, భాష నేర్చుకున్నాడు.   


నటీనటులు: ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్, ఆదర్శ్ గౌరవ్, విజయ్ మౌర్య, మహేశ్ మంజ్రేకర్ తదితరులు

దర్శకుడు: రమిన్ బహ్రానీ

విడుదల: నెట్‌ఫ్లిక్స్


Updated Date - 2021-01-31T21:25:51+05:30 IST