Sad Incident: ఏ భర్తకూ భార్యఇలాంటి లేఖ రాసే పరిస్థితి రాకూడదు.. ఎంతటి విషాద ఘటన..

ABN , First Publish Date - 2022-05-16T02:58:19+05:30 IST

వాళ్లిద్దరికీ ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త ఎంతో మంచివాడు. భార్యను ఎంతో ప్రేమగా.. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. పాప పుట్టింది. బిడ్డను చూసి..

Sad Incident: ఏ భర్తకూ భార్యఇలాంటి లేఖ రాసే పరిస్థితి రాకూడదు.. ఎంతటి విషాద ఘటన..

రామనాథపురం: వాళ్లిద్దరికీ ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త ఎంతో మంచివాడు. భార్యను ఎంతో ప్రేమగా.. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. పాప పుట్టింది. బిడ్డను చూసి ఆ అమ్మానాన్న మురిసిపోయారు. మహాలక్ష్మి పుట్టిందని ఎంతో సంతోషించారు. బిడ్డను చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్న ఈ భార్యాభర్తలకు ఊహించని కష్టమొచ్చింది. ఆ కష్టం వీరి జీవితాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రామనాథపురం జిల్లాలోని పల్లవరాయనాండల్ గ్రామానికి చెందిన దివ్య, మునీశ్వరన్ భార్యాభర్తలు. ఏడాదిన్నర క్రితం పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పాప పుట్టింది. ‘దర్శిని’ అని ఆ చిన్నారికి పేరు పెట్టారు. మునీశ్వరన్ టీ మాస్టర్‌గా పనిచేస్తూ ఉన్నంతలో భార్యను, బిడ్డను సుఖంగా చూసుకుంటున్నాడు. చిన్నారి ‘దర్శిని’కి ఊహించని కష్టమొచ్చింది. ఆ కష్టం కారణంగా ఈ కుటుంబానికి నవ్వు దూరమైంది. 8 నెలల వయసున్న ఆ పాపకు ఉన్నట్టుండి ఒకరోజు మూర్ఛ వచ్చింది. ఎంతో ఆందోళన చెందిన మునీశ్వరన్, దివ్య పాపను ఆసుపత్రిలో చేర్పించారు.



వైద్యులు వైద్య పరీక్షలు చేసి పాప Epilepsy అనే వ్యాధి బారిన పడిందని తేల్చారు. ఈ విషయం తెలిసి పాప తల్లి దివ్య మానసికంగా కుంగిపోయింది. పాప పరిస్థితి తలుచుకుని కుమిలికుమిలి ఏడ్చింది. తీవ్ర మనోవేదనకు గురైన దివ్య పాప ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. భర్తతో కూడా సరిగా మాట్లాడకుండా నిరాశలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో దివ్య క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మునీశ్వరన్ ఉదయాన్నే పనికి వెళ్లిపోయాక దివ్య ఇంటి దగ్గర్లో ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయి క్రిమిసంహారక మందు ఆహారంలో కలిపి పాపకు తినిపించింది. పాపం ఆ చిన్నారి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత భర్త చివరిగా కొనిచ్చిన చీరతో దగ్గర్లో ఉన్న షెడ్డులో ఉరేసుకుని దివ్య ప్రాణం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని భర్తకు వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఆమె లేఖలో రాసిన విషయం యథాతథంగా..



‘‘ చిన్నతనం నుంచి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ.. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నావు. మై డియర్ మునీష్.. నిన్ను ఇబ్బంది పెట్టేందుకు నేను ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. నేనూ, నా పాప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి నేనే కారణం. నన్ను క్షమించు. నువ్వు కొనిచ్చిన ఈ దుస్తుల్లోనే నన్నూ, పాపను పూడ్చి పెట్టు. ఎందుకంటే.. నువ్వు చివరిగా కొనిచ్చిన డ్రెస్ ఇదే. ఈ పరిణామం తర్వాత నీ జీవితం సంతోషంగా ఉంటుందని నేను భావించడం లేదు. కానీ.. నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో. నిజం ఏంటంటే.. నువ్వు ఎంతో మంచివాడివి. నీ బిడ్డను నాతో తీసుకెళుతున్నాను. నువ్వు కట్టిన ఈ తాళి నాతో వచ్చే నీ జ్ఞాపకం. నీ చేతిలో గీతలా ఎప్పుడూ నీతోనే ఉంటాను. Love You My Darling’’ అని దివ్య ఆ సూసైడ్ నోట్‌లో రాసింది. ఆ లెటర్ చదివి మునీశ్వరన్ కుప్పకూలిపోయాడు. భార్యనూ, బిడ్డనూ గుర్తుచేసుకుని కుమిలికుమిలి ఏడ్చాడు. అతని స్థితి చూసిన వారికి బాధతో కళ్లు చెమ్మగిల్లాయి. ఇదిలా ఉండగా.. ‘దర్శిని’ Epilepsy అనే వ్యాధి బారిన పడినప్పటికీ, ఆ అనారోగ్య సమస్యకు చికిత్స అందుబాటులో ఉందని, ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని వైద్యులు చెప్పారు.

Updated Date - 2022-05-16T02:58:19+05:30 IST