ఇద్దరి కిడ్నాప్‌ కథ అంతా నాటకమే..

ABN , First Publish Date - 2021-04-21T05:44:37+05:30 IST

మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామ శివారులో రామగిరి మండలంలోని లద్నాపూర్‌ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యల కిడ్నాప్‌ కథా అంతా ఉత్త నాటకమేనని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ వెల్లడించారు.

ఇద్దరి కిడ్నాప్‌ కథ అంతా నాటకమే..
విలేకరులతో మాట్లాడుతున్న డీసీపీ రవీందర్‌

- భూమి కొనుగోలు సమస్య పరిష్కారం కోసం స్కెచ్‌

- వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్‌

మంథని, ఏప్రిల్‌ 20: మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామ శివారులో రామగిరి మండలంలోని లద్నాపూర్‌ గ్రామానికి చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యల కిడ్నాప్‌ కథా అంతా ఉత్త నాటకమేనని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ వెల్లడించారు. మంథని సీఐ కార్యాలయంలో మంగళవారం డీసీపీ రవీందర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈనెల 17వ తేదిన రాజేశం, మల్లయ్యలు భూమి రిజిస్ర్టేషన్‌ కోసం రూ.50 లక్షలతో కాటారంనకు బయలుదేరగా మంథని మండలం గాడుదులగండి గుట్ట దాటిన తర్వాత వీరిద్దరు అదృశ్యమయ్యారని రాజేశం భార్య పుష్పలత ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరుకు కేసు నమోదు చేసుకొని రామగిరి ఎస్‌ఐ మహేందర్‌ విచారణ చేపట్టారన్నారు. ఈనెల 19వ తేదిన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వీరద్దరిని రాజాపూర్‌  గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేశారని తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. తాము బైక్‌పై వెళ్తుంటే కారులో వచ్చిన దుండగులు మాస్కు లేదని చెప్పి తమను ఆపి అడవిలోకి తీసుకెళ్లి కళ్ళకు గంతలు కట్టి వారి వాహనంలో ఎక్కించుకొని కాటారం వైపు తీసుకెళ్లి, ఒక రూంలో బంధించి డబ్బులు తీసుకొని వదిలిపెట్టారని బాధితులు వెల్లడించారన్నారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు విచారించగా వారు ఇరువురు చెప్పి విషయాలు పొంతన లేకపోవడంతో విచారించామన్నారు. దీంతో అసలు విషయాన్ని వెల్లడించారన్నారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బిల్క్‌ ఉన్నిసాబేగం భూమి అమ్ముతానని తమ ఇద్దరి వద్ద నుంచి రూ.36 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని 4సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్‌ చేయకుండా, డబ్బులు వాపస్‌ ఇవ్వకుండా తిప్పించుకుంటోందని చెప్పారన్నారు. కిడ్నాప్‌ నాటకం అడితే తమకు ఆమె భయపడి భూసమస్య పరిష్కారం అవుతుందని ఇలా చేశామని వారు అంగీకరించారన్నారు. పథకం ప్రకారం కిడ్నాప్‌ నాటకం ఆడి పోలీసులను తప్పుదారి పట్టించిన వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన మంథని సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, రామగిరి ఎస్‌ఐ మహేందర్‌, సిబ్బంది కిరణ్‌, సదానందంలను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో వీరికి రివార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, మంథని, రామగిరి ఎస్‌ఐలు ఓంకార్‌యాదవ్‌, మహేందర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:44:37+05:30 IST