నగరమంతా కాషాయమయం

ABN , First Publish Date - 2022-05-26T06:05:21+05:30 IST

రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్‌కీ.. జై శ్రీరాం..జైజై శ్రీరాం, జై హనుమాన్‌.. జైజై హనుమాన్‌... భారత్‌ మాతాకీ జై.. అంటూ నినాదాలతో కరీంనగర్‌ పురవీధులు పులకరించాయి.

నగరమంతా కాషాయమయం
ర్యాలీలో మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌, దేవతామూర్తుల రూపంలో కళాకారులు

- జై శ్రీరాం.. నామస్మరణలతో మారుమోగిన కరీంనగర్‌

- కాషాయధ్వజాలు, నినాదాలతో భారీ ర్యాలీ 

- ఆకట్టుకున్న భారీ శ్రీరామహనుమాన విగ్రహాలు

- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

- ‘హిందూ ఏక్తా యాత్ర’కు అనూహ్య స్పందన 


కరీంనగర్‌ కల్చరల్‌, మే 25: రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్‌కీ.. జై శ్రీరాం..జైజై శ్రీరాం, జై హనుమాన్‌.. జైజై హనుమాన్‌... భారత్‌ మాతాకీ జై.. అంటూ నినాదాలతో కరీంనగర్‌ పురవీధులు పులకరించాయి. ఓవైపు భారీ కాషాయ ధ్వజాలు, మరోవైపు కాషాయ దుస్తులు, జంక్షన్లన్నిటినీ కాషాయమం చేయడంతో నగరం కొత్తశోభను పులుముకుంది.   కొవిడ్‌-19 కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం శ్రీహనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన హిందూ ఏక్తాయాత్రకు అనూహ్య స్పందన లభించింది.  భారీ శ్రీరామ, హనుమాన్‌ విగ్రహాలు వేషధారణలు ఆకట్టుకోగా, కేరళ వాయిద్య బృందం ఆకర్షించింది. భక్తిశ్రద్ధల మధ్య  ఘనంగా ఏక్తా యాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌వద్ద సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీస్వామి, బండి సంజయ్‌తో కలసి పూజలు జరిపి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీస్వామి మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా హిందువుల కోసం కృషిచేస్తున్న ఓ సింహం బండి సంజయ్‌ అని అభినందించారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.  పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు యాత్రలో పాల్గొనగా యాత్ర రాజీవ్‌చౌక్‌, టవర్‌సర్కిల్‌, ప్రకాశంగంజ్‌, శాస్త్రీరోడ్‌, భారత్‌టాకీస్రోడ్‌, కమాన్‌రోడ్‌, బస్టాండ్‌, తెలంగాణచౌక్‌, ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్‌, కోర్టు, మంచిర్యాల చౌరస్తాల మీదుగా వైశ్యభవన్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాపరామకృష్ణ, నాయకులు మూగ జయశ్రీ పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


పోలీసుల భారీ బందోబస్తు


కరీంనగర్‌ క్రైం : పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. డ్రోన్‌  కెమెరాలు, వీడియో కె మెరాలతో యాత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. సమస్యాత్మక ప్రాంతాలు, పలు కూడళ్లలో కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని పర్యవేక్షించారు. యాత్ర జరుగుతున్న దారి పొడవునా పోలీసులు బందోబస్తు చేపట్టారు. సీపీ సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు, పోలీసుల బందోబస్తుతో యాత్ర ఆసాంతం ప్రశాంతంగా కొనసాగింది. తిరిగి యాత్ర వైశ్యభవన్‌ చేరే వరకు పోలీసులు అణువవుణా జాగ్రత్తలు తీసుకున్నారు. బందోబస్తులో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నరేశ్‌, దామోదర్‌రెడ్డి, లక్ష్మీబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-26T06:05:21+05:30 IST