పెళ్లిపీటల మీదే కుప్పకూలిన వధువు

ABN , First Publish Date - 2022-05-13T09:19:25+05:30 IST

వివాహ వేదిక కళకళలాడుతోంది. పెళ్లి తంతుతో సందడిగా మారింది. మంత్రోచ్ఛారణల మధ్య పెళ్లి కుమారుడు..

పెళ్లిపీటల మీదే కుప్పకూలిన వధువు

  • తలపై జీలకర్ర బెల్లం పెడుతుండగా ఘటన
  • ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
  • విషం తీసుకోవడమే కారణమంటున్న వైద్యులు


విశాఖపట్నం, కొమ్మాది, మే 12 (ఆంధ్రజ్యోతి): వివాహ వేదిక కళకళలాడుతోంది. పెళ్లి తంతుతో సందడిగా మారింది. మంత్రోచ్ఛారణల మధ్య పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. విషం తీసుకోవడం వల్లే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. వధువు తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరుకు చెందిన ముంజేటి ఈశ్వరరావు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. భార్య అనూష, ఇద్దరు పిల్లలతో కలిసి చందానగర్‌ ప్రాంతం పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్‌ గృహకల్ప (బ్లాక్‌ నంబర్‌ 58)లో నివాసం ఉంటున్నారు. కుమారుడు సూర్యప్రకాష్‌ బీటెక్‌, కుమార్తె సృజన (22) బీకాం పూర్తిచేశారు. ఈశ్వరరావు బంధువు నాగోతి విజయ్‌కుమార్‌ మధురవాడ నగరంపాలెంలోని పోర్టు కాలనీలో నివాసం ఉంటున్నారు. సృజనకు సంబంధం చూడాలని విజయ్‌కుమార్‌ను ఈశ్వరరావు కోరడంతో ఆయన తనకు వరుసకు సోదరుడైన నాగోతి శివాజీతో సంబంధం కుదిర్చారు. ఈనెల 11న ముహూర్తం పెట్టుకోవడంతో ఈశ్వరరావు కుటుంబం 7న హైదరాబాద్‌ నుంచి విశాఖకు చేరుకుని.. 8న నిశ్చితార్థం చేసుకున్నారు. తొమ్మిది, పది తేదీల్లో శివాజీ, సృజన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పాల్గొన్నారు. పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. 


బుధవారం రాత్రి 8గంటలకు వధూవరులిద్దరూ పెళ్లిపీటలపైకి వచ్చారు. సరిగ్గా 9 గంటల సమయంలో శివాజీ.. వధువు తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కేజీహెచ్‌ డౌన్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సృజన మృతిచెందింది. ఆమె విషం తాగడం వల్లే చనిపోయినట్టు భావించిన ఆస్పత్రి వైద్యులు పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సృజన మృతిపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక దానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తామని పీఎం పాలెం పోలీసులు తెలిపారు. కాగా, సృజన హ్యాండ్‌బ్యాగ్‌లో గన్నేరుపప్పు ఉన్నట్టు తెలిసింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆమె ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతోందని చెబుతున్నారు. అయితే.. ఇది ఆత్మహత్యే అని భావిస్తున్న పోలీసులు అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పెళ్లి ఇష్టంలేకనో లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

Read more