కరోనా కాలంలోనూ ఐశ్వర్య‘మస్తు’!

ABN , First Publish Date - 2021-06-16T06:16:00+05:30 IST

కరోనా సంక్షోభ కాలంలోనూ భారతీయుల ధన సంపత్తి మరింత పెరిగిందని అంతర్జాతీయ కన్సల్టింగ్‌ కంపెనీ బీసీజీ తెలిపింది. గత ఏడాదిలో భారతీయుల ద్రవ్య సంపద 11 శాతం వృద్ధి చెంది 3.4 లక్షల కోట్ల

కరోనా కాలంలోనూ ఐశ్వర్య‘మస్తు’!

రూ.255 లక్షల కోట్లకు భారతీయుల ధన సంపత్తి 

గత ఏడాది 11% వృద్ధి

బీసీజీ నివేదిక వెల్లడి 

2025 నాటికి రూ.412 లక్షల కోట్లకు


ముంబై: కరోనా సంక్షోభ కాలంలోనూ భారతీయుల ధన సంపత్తి మరింత పెరిగిందని అంతర్జాతీయ కన్సల్టింగ్‌ కంపెనీ బీసీజీ తెలిపింది. గత ఏడాదిలో భారతీయుల ద్రవ్య సంపద 11 శాతం వృద్ధి చెంది 3.4 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.255 లక్షల కోట్లు) చేరుకుందని తాజా రిపోర్టులో వెల్లడించింది. అంతేకాదు, 2020తో ముగిసిన ఐదేళ్లకు నమోదైన సమ్మిళిత వృద్ధికి సమానంగా గత ఏడాదిలో సంపద వృద్ధి జరిగిందని బీసీజీ అంటోంది. స్థిరాస్తులు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, అప్పులు మినహాయించి దేశంలోని వయోజనుల వద్దనున్న మొత్తం సంపదను ద్రవ్య సంపత్తిగా నిర్వచించిందీ సంస్థ. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


  • మున్ముందు సంవత్సరాల్లోనూ భారత్‌లో ఆర్థిక సంపద వేగంగా పెరగనుంది. అయితే, సంపద వృద్ధి రేటు మాత్రం కాస్త తగ్గి 10 శాతానికి పరిమితం కావచ్చు. 
  • 2025 నాటికి భారత వయోజనుల మొత్తం ధన సంపత్తి 5.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.412 లక్షల కోట్లు) కు చేరుకోవచ్చని అంచనా.  
  • 2025 వరకు 10 కోట్ల డాలర్ల (రూ.750 కోట్లు)కు పైగా సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య భారత్‌లోనే అధికంగా వృద్ధి చెందనుంది. ఈ ఐదేళ్లలో వీరి సంఖ్య దాదాపు రెట్టింపై 1,400కు చేరుకోవచ్చు. 
  • భారతీయుల క్రాస్‌ బోర్డర్‌ వెల్త్‌ (నివాస దేశానికి బయట కలిగి ఉన్న సంపద) గత ఏడాదిలో 19,400 కోట్ల డాలర్లకు పెరిగింది. మొత్తం ధన సంపత్తిలో 5.7 శాతానికి సమానమిది. 2025 నాటికి 6.3 శాతానికి పెరగవచ్చని అంచనా. 
  • దేశంలో దాదాపు సగం ధన సంపత్తి నగదు, డిపాజిట్లు, షేర్లు, జీవిత బీమా పెట్టుబడుల రూపంలో ఉంది. 
  • రియల్‌ ఎస్టేట్‌, విలువైన గృహోపకరణాలు, బంగారం, ఇతర విలువైన లోహాల రూపంలోనున్న ఆస్తులను రియల్‌ అసెట్స్‌గా నిర్వచించింది బీసీజీ. గత ఏడాది చివరి నాటికి భారతీయుల రియల్‌ అసెట్స్‌ విలువ ప్రస్తుత ధరల ప్రకారం 14 శాతం పెరిగి 12.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2025 నాటికి 18.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. 

Updated Date - 2021-06-16T06:16:00+05:30 IST