సదాశివపేటలో చెరువుకట్టనే వెంచర్‌కు దారి

ABN , First Publish Date - 2022-05-21T05:08:34+05:30 IST

పట్టణంలోని ఊబచెరువు కట్టను కోట్ల రూపాయల ఖర్చుతో మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దితే అది ఓ వెంచర్‌ నిర్వాహకులకు వరంలా మారింది.

సదాశివపేటలో చెరువుకట్టనే వెంచర్‌కు దారి
వెంచర్‌కు డీటీసీపీ అనుమతులు ఇచ్చిన అసలు రోడ్డు

శిథిలమవుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ రోడ్డు

సదాశివపేట, మే 20: పట్టణంలోని ఊబచెరువు కట్టను కోట్ల రూపాయల ఖర్చుతో మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దితే అది ఓ వెంచర్‌ నిర్వాహకులకు వరంలా మారింది. ఈ మినీట్యాంక్‌బండ్‌ రోడ్డునే వెంచర్‌కు ప్రధాన దారిగా చూపుతూ ప్లాట్ల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మినీ ట్యాంక్‌బండ్‌ రోడ్డు ముఖద్వారం వద్ద వెంచర్‌ నిర్వాహకులు బోర్డులు పెట్టినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలో గోడలపై రాతలను నిషేధించిన మున్సిపల్‌ అధికారులు వెంచర్‌ అమ్మకాల కోసం పెడుతున్న భారీ బోర్డులను, హోర్డింగులను తొలగించడం లేదు. నిత్యం వెంచర్‌లోకి వెళ్లే వాహనాల రద్దీతో ఊబచెరువు కట్ట ధ్వంసమవుతున్నది. ఇటీవల చెరువు కట్ట కిందిభాగం నుంచి భారీగా నీరు లీకేజీ అయ్యి కట్ట కింద సాగు భూముల్లోని పంటలు నీట మునిగాయి. వెంచర్‌కు కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం 60 ఫీట్ల వెడల్పుతో అప్రోచ్‌ రోడ్డు ఉండాలి. సదురు వెంచర్‌కు డీటీసీపీ ద్వారా మంజూరు అయిన తుది లేఅవుట్‌లో గొల్లగూడెం రోడ్డు మార్గం అప్రోచ్‌ రోడ్డుగా ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా తక్కువ వెడల్పుతో ఉండడంతో ఇక్కడి నుంచే వెంచర్‌ దారి అని తెలిస్తే ప్లాట్ల అమ్మకాలు తగ్గుతాయనే రియల్‌ వ్యాపారులు ఈ కుయుక్తులు పన్నుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి మినీ ట్యాంక్‌బండ్‌(ఊబచెరువు)కట్టను ప్రమాదంలో పడకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.





Updated Date - 2022-05-21T05:08:34+05:30 IST