గెలవాలంటే ఇలా ఉండాలి!

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

‘‘జీవితం యుద్ధం లాంటిది. యుద్ధం క్రీడ లాంటిది’’ అన్నారు ప్రాచీన శాస్త్రవేత్తలు. అయితే నేడు యుద్ధాన్ని క్రీడగా భావించాల్సిన స్థితి నుంచి, క్రీడను సైతం యుద్ధంగా చేసే స్థితికి వచ్చాం. జీవితాన్ని క్రీడగా, తేలిగ్గా తీసుకోవడం గురించిభగవద్గీతలో...

గెలవాలంటే  ఇలా ఉండాలి!

‘‘జీవితం యుద్ధం లాంటిది. యుద్ధం క్రీడ లాంటిది’’ అన్నారు ప్రాచీన శాస్త్రవేత్తలు. అయితే నేడు యుద్ధాన్ని క్రీడగా భావించాల్సిన స్థితి నుంచి, క్రీడను సైతం యుద్ధంగా చేసే స్థితికి వచ్చాం. జీవితాన్ని క్రీడగా, తేలిగ్గా తీసుకోవడం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.


  • మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా
  • నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః


జీవితాన్ని ఒక క్రీడగా, ఒక నాటకంగా, ఒక చలనచిత్రంగా తీసుకోవాలంటే జీవితంలో అన్ని ఘట్టాలను సన్నివేశాలుగా, మనల్ని మనం పాత్రలుగా భావించుకోవాలి. కొన్ని సుఖానుభూతులు కలిపితే జీవితం అవుతుంది. ‘మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా’ అంటే ‘‘నువ్వు చేసే పనులు, వాటి ఫలితాలు నాయందు విడిచిపెట్టు’’ అంటున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. ‘అధ్యాత్మ చేతసా’...ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన బుద్ధిని పెంచుకో!  ‘నిరాశీః’... ఎటువంటి ఆశా పెట్టుకోకు! ‘నిర్నిర్మమో భూత్వా’... మమకారం కూడా వద్దు!  ‘యుధ్యస్వ’... ఇవి లేకుండా యుద్ధం చేయి! ‘విగతజ్వరః’... అన్ని భయాలు విడిచిపెట్టు! యుద్ధంలో గెలవాలన్నా, జీవితంలో గెలవాలన్నా ఇలాగే ఉండాలి. నలుగురు తమ్ముళ్ళు శవాలుగా పడి ఉన్నప్పుడు యక్షుడు వేసే ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పాడు. తమ్ముళ్ల మీద ఆశ లేదు, మమకారం లేదు. అన్నీ భగవంతుడిపై వదిలేశాడు. ‘నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః’కు మంచి ఉదాహరణ ఇది. 




అదే జీవితం అంటే...

జీవితంలో నిరాశ చెందకూడదు. ఆశా జీవితం గడపాలి. ఈ విషయాన్ని భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి పద్యం ద్వారా తెలుసుకుందాం.


  • ఖండిత బయ్యు భూజంబు వెండి మొలుచు
  • క్షీణుఁడయ్యును నభివృద్ధి జెందు సోము
  • డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
  • జనములను దాపమొందరు సాధుజనులు

చెట్టు మొదలు వరకు కొట్టేసినా మళ్లీ చిగురిస్తుంది. చంద్రుడు కృష్ణపక్షం పదిహేను రోజుల్లో క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తాడు. అమావాస్య రోజున అసలు కనిపించడు. శుక్లపక్షంలో  దినదినాభివృద్ధి చెంది పూర్ణిమ రోజున వెలుగులు జిమ్ముతాడు. ఈ విధంగానే హృదయాన్ని సంక్షోభపెట్టే ఏ సంఘటనకూ సాధువులైన వారు చలించరు. మన జీవితాల్లో... పదేళ్ల క్రితం ఓ భయంకరమైన సంఘటన జరిగి ఉంటుంది. ఇవ్వాళ చూస్తే ‘అది జరిగిందా?’ అనిపిస్తుంది. అలాంటివి మళ్లీ జరగవని లేదు. జరుగుతాయని లేదు. జీవితమంటేనే అది! ముఖ్యంగా యువతరం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 

-గరికిపాటి నరసింహారావు




Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST