దేవునికి చేరువ చేసే మార్గం

ABN , First Publish Date - 2021-01-08T06:02:48+05:30 IST

మానవులను సన్మార్గంలో నడపడానికీ, వారికి మంచి నడవడికను నేర్పడానికీ ప్రతి యుగంలో, ప్రతి జాతిలో ఉత్తమమైన

దేవునికి చేరువ చేసే మార్గం

మానవులను సన్మార్గంలో నడపడానికీ, వారికి మంచి నడవడికను నేర్పడానికీ ప్రతి యుగంలో, ప్రతి జాతిలో ఉత్తమమైన గుణగణాలు, విశ్వాసం కలిగిన ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. అతనే దైవ ప్రవక్త. ఆ ప్రవక్తలు తమతమ కాలాల్లో తమ జాతి ప్రజలను మంచి దారిలో నడిపించారు. దేవుడు ఒక్కడేననీ, ఆ దైవాన్ని పూజించాలనీ బోధించారు. న్యాయాన్ని సంరక్షించారు. భవిష్యత్తు గురించి హెచ్చరించారు. 


‘‘మేము ప్రతి సముదాయంలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాం. శుభవార్తలు వినిపించే, హెచ్చరించే వారుగా  మీ దగ్గరకు పంపించాము. అతని ద్వారా అల్లా్‌హను ఆరాధించండి’’  అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ప్రకటించారు. ‘‘విశ్వాసులకు అల్లాహ్‌ చేసిన మహోపకారం... వారి నుంచే ఒక ప్రవక్తను ఎన్నుకొని, వారి వద్దకు పంపడం. విశ్వాసులకు అతను వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు’’ అని ఖుర్‌ఆన్‌ చెబుతోంది.


ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపామనీ, వారితోపాటు దివ్య గ్రంథాన్నీ, ప్రజలు న్యాయంపై నిలిచి ఉండడానికి ధర్మకాటాను కూడా అవతరింపజేశామనీ, ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో అతణ్ణి ప్రజలు అనుసరించాలనే పంపామనీ అల్లాహ్‌ తెలిపారు. ప్రజలకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్‌ తరఫునే జరుగుతుందనీ, ఏదైనా చెడు జరిగితే అది స్వయంకృతమనీ, సమస్త జనులకూ సందేశం అందజేసే వ్యక్తిగా నిన్ను పంపుతున్నామనీ, దీనికి సాక్షి తానేననీ దైవ ప్రవక్త మహమ్మద్‌కు అల్లాహ్‌ వెల్లడించారు.


‘‘నీవు అంధకారం నుంచి ప్రజలను బైటికి తీసి, కాంతివైపు తీసుకురావడానికి మహోన్నతమైన గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) నీకు అందిస్తున్నా’’మని తెలిపారు. కాబట్టి దైవ ప్రవక్త పట్ల విధేయత చూపినవారు అల్లాహ్‌ పట్ల విధేయత చూపినట్టే! విశ్వాసులందరూ అల్లా్‌హకూ, ఆయన ప్రవక్తకూ విధేయులుగా ఉండాలి. ఆయన సందేశాన్ని తెలుసుకున్నా పట్టించుకోకపోవడం, తెలియకుండా తెలుసుకున్నామని చెప్పడం దైవ ద్రోహానికి పాల్పడడమే! అల్లాహ్‌ ఆదేశాలనూ, ప్రవక్త సందేశాన్నీ పాటించడమే విశ్వాసుల కర్తవ్యం. ప్రవక్తలు చూపిన బాటే పరమావధి. దేవుడికి చేరువ చేసే మార్గం అదే!

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-01-08T06:02:48+05:30 IST