సత్యమార్గం

ABN , First Publish Date - 2020-11-23T10:44:23+05:30 IST

సత్యమార్గం

సత్యమార్గం

సుగా ఋతస్య పంథాః 

..అని ఋగ్వేద మంత్రం. సత్య మార్గం సుఖమయమైనది, సరళమైనది అని దీని భావం. సత్యంలో ఉన్న సుఖం ఆసత్యంలో లేదు. సాధారణ దృష్టితో చూస్తే అసత్యమే సుఖంగా కనిపించవచ్చు. ‘‘ఈ రోజుల్లో ‘సత్యం’ అంటూ కూర్చుంటే లాభం లేదు. అసత్యం వల్లనైనా సరే సుఖపడాలి’’ అని కపట జీవితాన్ని సమర్థించే వారు మనలో ఉండవచ్చు. కానీ అసత్యం వలన చాలా ఇబ్బందులున్నాయి. నిజాయితీ లేక పోవడమే అసత్యం. సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే.. లంచగొండితనం, మోసం, కపటం, అధర్మం.. ఇవన్నీ అసత్యానికి పారిభాషిక పదాలే. ఆ లక్షణాలతో కూడిన జీవితానికి అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. పాటించడం కొద్దిగా కష్టమైనప్పటికీ ధార్మిక నైతిక జీవనమే ఉత్తమమైనది. కాబట్టి దాన్ని నమ్ముకోవడం చాదస్తమని భావించరాదు. 


సాధారణంగా ఎవరు చూడట్లేదనో, ఎవరూ గమనించట్లేదనో, ఎప్పటికీ పట్టుపడే అవకాశం లేదనో, అతి తొందరగా డబ్బు సంపాదించాలనే యావతోనో.. కొందరు అసత్య మార్గాన్ని ఆశ్రయిస్తారు. వీరికి పాపభీతి, దైవభీతి ఉండవు. భగవంతుడు సత్యప్రియుడనే మాట వారి నిఘంటువుల్లో ఉండదు. ‘‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో తప్పు ఏముంది’’ అని తమను తాము సమర్థించుకుంటారు. లోకాన్ని ఒప్పించజూస్తారు. కానీ.. అది తప్పు వారి మనస్సాక్షికి తెలుసు. వారి మనసులో భయం పొంచి ఉంటుంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చుకుంటారు. అలాంటివారు గుర్తించాల్సిందేంటంటే.. అసత్య మార్గంలో సాధించిన సంపదలకు అభద్రత, భయం వెన్నంటే ఉంటాయి. అలాంటివారి జీవితంలో అణువణువునా ఆత్మన్యూనతా భావం ఉంటుంది. అసత్యమార్గాన నడిచేవారికి బయటి శత్రువులు అక్కర్లేదు. వారికి వారి అంతరాత్మయే ప్రథమ శత్రువు. మంచిని చెప్పే మిత్రుడు కూడా. ఆ మిత్రుడి మాట వింటే మంచి జరుగుతుంది. వినకపోతే రావణ, దుర్యోధనాదులకు పట్టినగతే పడుతుంది.


జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః

జానామి అధర్మం న చ మే నివృత్తిః 

‘‘ధర్మమని తెలిసినా నేను ఆచరించలేను. అధర్మమని తెలిసినా దాన్ని చేయకుండా ఉండలేను’’ అన్న దుర్యోధనుడి గతి ఏమైందో మనందరికీ తెలిసిందే. సత్య మార్గాన్ని విడవని శ్రీరాముడు మనకు ఆదర్శపురుషుడు అయ్యాడు. అసత్యమార్గాన నడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కాబట్టి.. సుఖమయమైన, సరళమైన సత్యమార్గంలోనే మనందరం నడుద్దాం.

                                                                              గుమ్మా ప్రసాదరావు, 97551 10398 


Updated Date - 2020-11-23T10:44:23+05:30 IST