పడి లేచిన కెరటం

ABN , First Publish Date - 2020-11-26T05:51:52+05:30 IST

కొవిడ్‌–19కు త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోందన్న ఆశలతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదుటపడుతున్నాయి....

పడి లేచిన కెరటం

కొవిడ్‌–19కు త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోందన్న ఆశలతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదుటపడుతున్నాయి. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కార్యకలాపాలు సాధారణ స్థాయిలకు చేరుకుంటుండడంతో పాటు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు వృద్ధి పథంలో సాగుతున్నాయి. కొవిడ్‌–19 దెబ్బకు ఈ ఏడాది మార్చిలో కనిష్ఠ స్థాయిలకు పతనమైన స్టాక్‌ మార్కెట్లు క్రమంగా కోలుకుని ప్రస్తుతం ఇన్వెస్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. గత ఏడాది చివరలో చైనాలో కొవిడ్‌–19 మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచమంతా అతలాకుతలమైంది. వ్యాధి కట్టడి కోసం అగ్రరాజ్యం మొదలుకుని అన్ని దేశాలు లాక్‌డౌన్‌ బాట పట్టాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రపంచ వృద్ధి రేటు మైనస్‌లోకి జారుకుంది. ఇదే సమయంలో భారత్‌ సహా అంతర్జాతీయంగా పలు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఏడాది జనవరిలో బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ) ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 41000 స్థాయిల్లో ఉండగా కొవిడ్‌–19 వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా పతనబాట పడుతూ వచ్చింది. ఇదే సమయంలో ఆ వ్యాధి కట్టడి కోసం మార్చి 23న భారత ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సెన్సెక్స్‌ ఏకంగా 3,934 పాయింట్లు నష్టపోయి 25,980 స్థాయిలకు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 7,600 స్థాయిలకు పడిపోయాయి.


కొవిడ్‌–19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావటంతో అమెరికా సహా పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి. అమెరికా ప్రకటించిన ప్యాకేజీలతో అక్కడి ఆర్థిక వ్యవస్థలో నిధుల లభ్యత గణనీయంగా పెరిగిపోయింది. పేరుకుపోయిన నిధులను.. పెట్టుబడులుగా మార్చేందుకు అక్కడి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్‌ వంటి వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలోకి వాటిని గుమ్మరించారు. ఇది భారత స్టాక్‌ మార్కెట్లకు ఎంతగానో కలిసివచ్చింది. ఎఫ్‌పీఐల నిధుల ప్రవాహం వెల్లువెత్తటంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు తారాజువ్వలా దూసుకుపోయాయి. మార్చి నెలలో ఒక వారం రోజుల పాటు పతన బాట పట్టిన మార్కెట్లు ఏప్రిల్‌ ఆరంభం నుంచి మళ్లీ బుల్‌ రన్‌ను కనబరిచాయి. ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెల్లువెత్తటంతో ఏప్రిల్‌ 8న సెన్సెక్స్‌ ఏకంగా మళ్లీ 30 వేల మార్కును, నిఫ్టీ 8,700 మార్కును అధిగమించాయి. ఇక అప్పటి నుంచి భారత మార్కెట్లు మధ్యమధ్యలో చిన్న ఆటుపోట్లు ఎదుర్కొన్నా వాటిని అధిగమిస్తూ వచ్చాయి. ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చిన పబ్లిక్‌ ఇష్యూలు కూడా మంచి లాభాలతో లిస్ట్‌ కావటం కలిసివచ్చింది. బ్యాంక్‌ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లు తగ్గటంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లించటం కూడా స్టాక్‌ మార్కెట్‌ దూకుడుకు కారణంగా ఉంది. 


ఫైజర్‌, మోడెర్నా వంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ సంస్థలు కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రభావశీలత ఆశించిన స్థాయిలో ఉందని ప్రకటించటం కూడా ఊపునిచ్చింది. ఆగస్టు, సెప్టెంబరు వరకు ఓ మోస్తరుగా ఉన్న ఆర్థిక, స్టాక్‌ మార్కెట్ల కార్యకలాపాలు అక్టోబరు నుంచి అమాంతం పెరిగిపోయాయి. కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లోకి అడుగుపెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ.. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. మార్చి నెలతో పోల్చితే ఈ రెండు సూచీలు దాదాపు 70 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 44 వేల పాయింట్లకు చేరువలో ఉండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ నెల 24న జీవితకాల గరిష్ఠ స్థాయి 13 వేల పాయింట్లను అధిగమించింది. అక్టోబరు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు చూస్తే భారత మార్కెట్లు 12 శాతం పెరగటం విశేషం. మరోవైపు మార్చి నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 5,500 కోట్ల డాలర్లుగా ఉండగా ప్రస్తుతం ఇది 8,600 కోట్ల డాలర్ల (రూ.6.36 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టగానే మరిన్ని ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా భవిష్యత్‌లో స్టాక్‌ మార్కెట్లకు కలిసిరానుందని అంచనా. అయితే మార్కెట్ల దూకుడును నిశితంగా గమనించాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌–19 కారణంగా చమురు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు తగ్గటంతో స్టాక్‌ మార్కెట్లు, బంగారం వంటి విలువైన లోహాల్లోకి పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను మళ్లించారని వారంటున్నారు. మార్కెట్లోకి ఒకసారి వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత వీరు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి భిన్న రంగాల్లోకి మళ్లించే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించటం మంచిదని సూచిస్తున్నారు.

Updated Date - 2020-11-26T05:51:52+05:30 IST