Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 14 Jul 2022 15:36:52 IST

సినిమా రివ్యూ : ‘ది వారియర్’ (The Warrior)

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం : ది వారియర్ 

విడుదల తేదీ : జూలై 14, 2022

నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, అక్షరా గౌడ, లాల్, ఆది పినిశెట్టి, నదియా, బ్రహ్మాజీ, నాగ మహేశ్, అప్పాజీ అంబరీష, కింగ్‌స్లీ, జాన్ విజయ్, జయప్రకాశ్ 

తదితరులు

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

ఎడిటర్ : నవీన్ నూలి

నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి

దర్శకత్వం : యన్. లింగుసామి

ఎనర్జిటిక్ స్టార్ రామ్.. గతేడాది ‘రెడ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయాడు. అందుకే తదుపరి చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు ‘ది వారియర్’ చిత్రంతో రెడీ అయ్యాడు. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ రోజే (జూలై 14) థియేటర్స్ లో విడుదలైంది. టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా అంచానాల్ని ఏమేరకు అందుకుంది? ద్విభాషా చిత్రంగా రూపొందించేంత విషయం ఈ సినిమాలో ఉందా ? అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (The Warrior movie review)

కథ

సత్య (రామ్ పోతినేని) తన తండ్రి కోరిక మేరకు యం.బీ.బీయస్ చదివి.. కర్నూల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన రోజే రోడ్డు మీద ఒక వ్యక్తిని కొందరు గూండాలు పొడిచి పడేస్తారు. దాన్ని కళ్ళారా చూసిన సత్య తను డాక్టర్‌గా జాయిన్ అవ్వాల్సిన ఆసుపత్రిలోనే అతడ్ని జాయిన్ చేసి బతికిస్తాడు. అయితే అదే రౌడీలు హాస్పిటల్ కు వచ్చి ఆ వ్యక్తిని చంపేసి వెళ్ళిపోతారు. దాంతో ఆవేశంతో రగిలిపోయిన సత్యకు ఆసుపత్రి డీన్ రాబర్ట్ (జయ ప్రకాశ్), గురు (ఆది పినిశెట్టి) గురించి చెబుతాడు. కర్నూల్‌ను గుప్పెట్లో పెట్టుకొని తన కనుసైగలతో నడిపిస్తున్న అతడికి ఎదురెళితే నష్టం నీకే నని హిత బోధ చేస్తాడు. గురు ఎంతటి క్రూరుడు అనే విషయాన్ని వివరిస్తాడు. అంతలో సత్య రేడియో జాకీ అయిన విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) ప్రేమలో పడతాడు. తన ఇంటి పక్కనే ఉంటున్న ఆమె కూడా సత్యతో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉండగా.. సత్య పనిచేసే ఆసుపత్రిలో  నకిలీ సెలైన్ బాటిల్స్ వల్ల కొంతమంది చిన్నారులు చనిపోతారు. ఆ సెలైన్ లు సరఫరా చేసే కంపెనీ గురు బినామీదేనని సత్య తెలుసుకుంటాడు. పోలీస్ స్టేషన్ లో అతడి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ కంపెనీని మూయించేస్తాడు. దాంతో సత్యని నడిరోడ్డుపై దారుణంగా కొట్టి పడేస్తాడు గురు. కట్ చేస్తే రెండేళ్ళకు కర్నూల్‌లో డాక్టర్ సత్య పోలీసాఫీసర్ గా అడుగుపెడతాడు. గురు ఆగడాల్ని సత్య ఎలా అడ్డుకున్నాడు? సత్యను ఎదుర్కోడానికి గురు ఎలాంటి ఎత్తులు వేశాడు? చివరికి సత్య.. గురు ఆటలు ఎలా కట్టించాడు అన్నదే మిగతా కథ.  (The Warrior Movie review)

విశ్లేషణ 

యం.బీ.బీ.యస్ చదివి డాక్టరైన ఒక యువకుడు అన్యాయాలు ఎదుర్కోడానికి.. ఐఏయస్ చదివి పోలీసాఫీసరవడం అనే పాయింట్‌ను.. ఐదు పోలీస్ కథలు విని.. విసిగి వేసారిపోయి.. తన జీవితంలోనే పోలీస్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చి.. చివరికి లింగుసామి చెప్పడంతో ఎగ్జైటైపోయి సినిమా చేయడానికి రామ్ పోతినేని సిద్ధమవడం విడ్డూరమనిస్తుంది. డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు అన్యాయాన్ని ఎదురించడం ఆసాధ్యమని, హీరో ఖాకీ యూనిఫామ్ తొడిగి.. ప్రత్యర్ధుల్ని గడగడలాడించడం సిల్లీ థాట్ అనుకుంటే.. దీన్నే సినిమాగా మలచడం అన్నది విచిత్రమనిపిస్తుంది. తీసేటప్పుడు లింగుసామి లాజిక్ మిస్ అయినా..  ఓటీటీల్లో ప్రపంచ సినిమాల్ని చూడ్డమే పనిగా పెట్టుకొని, ఏదో కొత్త దనముంటుందని ఆశించి..  పనిగట్టుకొని థియేటర్స్‌కు వచ్చి మరీ ఈ సినిమా చూసే ప్రేక్షకుడు మాత్రం లాజిక్కులు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. ‘ది వారియర్’ సినిమా విషయంలో ఇప్పటి యువతరం ప్రేక్షకుల నాడిని కూడా దర్శకుడు మిస్ అయ్యాడని చెప్పాలి. 


హీరోయిజం ఎలివేషన్లు, ఓవర్ బిల్డప్పులు, ఒంటి చేత్తో పదిమందిని చిత్తుగా కొట్టడం, అప్పటి వరకూ పులిలా ఉన్న విలన్  హీరో కొట్టుడుకు పిల్లిలా మారిపోయే సన్నివేశాలు మన తెలుగు సినిమాల్లోనే కనిపిస్తాయి. ‘ది వారియర్’ సినిమా దానికేమాత్రం అతీతం కాదని నిరూపించింది. సినిమా మొత్తం రామ్‌ను  పోలీసాఫీసర్‌గా చూపించినా సినిమా వేరేలా ఉండేదేమో.. డాక్టర్.. పోలీస్ అవడమే ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విషయం. అదే ఈ సినిమాలోని కొత్త పాయింట్ అని దర్శకుడు అనుకుని ఉంటాడు కానీ.. ఆ పాయింట్‌ను కన్విన్సింగ్‌గా చెప్పడంలో మాత్రం తడబడ్డాడని చెప్పాలి. ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ లవ్ ట్రాక్ మీదే కాన్సన్ ట్రేట్ చేసి కాలక్షేపం చేసిన దర్శకుడు.. సెకండాఫ్ కొచ్చేసరికి పూర్తిగా పట్టుకోల్పోయాడు.  ముందునుంచి చాలా పవర్ ఫుల్ గా ఎలివేట్ అయిన విలన్ పాత్ర సెకండాఫ్‌లో తేలిపోయింది. హీరో, విలన్ ఎదురుపడే బలమైన ఒక్కసన్నివేశం కూడా లేకపోవడం, రొటీన్ సన్నివేశాలు, జరగబోయేది ప్రేక్షకుడి ఊహకు అందే విధంగా ఉన్న సన్నివేశాలు ‘ది వారియర్’ సినిమాను పరమ రొటీన్ సినిమాగా మార్చేశాయి. క్రాక్ సినిమాకి అద్బుతమైన డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్ లాంటి రైటర్ కూడా ఈ సినిమా కోసం కొత్తగా రాయడానికి ఏమీ లేకపోయింది. కథనం సీరియస్‌గా నడుస్తుండగా.. పంటికింద రాళ్ళలా పాటలు అడ్డుపడుతుంటాయి. 


డాక్టర్, పోలీసాఫీసర్ సత్యగా రామ్ పోతినేని అద్భుతంగా నటించాడు. రెండు పాత్రల్లోని వేరియేషన్స్, రెండు గెటప్స్ లోని డిఫరెన్స్ ను బాగా క్యారీ చేశాడు. డ్యాన్సులు, డైలాగ్స్ చెప్పడంలోనూ తన మార్క్ చూపించాడు. విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి గ్లామర్, అభినయం ఆకట్టుకుంటాయి. విలన్ గురుగా ఆది పినిశెట్టి ‘సరైనోడు’ చిత్రంలో కన్నా క్రూయల్టీని బాగా పలికించాడు. పవర్ ఫుల్‌గా డైలాగ్స్ చెప్పడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంకా హీరో తల్లిగా నదియా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే బ్రహ్మాజీ, జయప్రకాశ్, అక్షరా గౌడ పాత్రలు మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు  దేవీశ్రీ ప్రసాద్ పాటలు పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మ్యాజిక్ చేయలేకపోయాడు. కెమేరా పనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ‘ది వారియర్’ చిత్రం కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని కాకుండా బీ, సీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. (The Warrior movie review)

ట్యాగ్‌లైన్ :  ది బోరియర్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement