కదంతొక్కిన ఆదివాసీలు

ABN , First Publish Date - 2022-05-27T06:05:29+05:30 IST

చలో సీలేరు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు తరలివెళ్లారు. స్థానిక ఆదివాసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో సీలేరు కార్యక్రమానికి జీకేవీధి మండలంలోని ధారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల, గాలికొండ, సీలేరు పంచాయతీలకు చెందిన నిరుద్యోగ ఆదివాసీ యువతీ, యువకులతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కదంతొక్కిన ఆదివాసీలు
చలో సీలేరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

జెన్‌కోలో శతశాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌

హక్కుల సాధన కోసం ఉద్యమించాలని జేఏసీ పిలుపు

సీలేరు, మే 26: చలో సీలేరు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు  తరలివెళ్లారు. స్థానిక ఆదివాసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో సీలేరు కార్యక్రమానికి జీకేవీధి మండలంలోని ధారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల, గాలికొండ, సీలేరు పంచాయతీలకు చెందిన నిరుద్యోగ ఆదివాసీ యువతీ, యువకులతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో జేఏసీ నాయకులు పలువురు మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్సులోని జెన్‌కో ప్రాజెక్టు ప్రాంతమంతా 5వ షెడ్యూల్‌ ఏజెన్సీ ఏరియాలో ఉందని, భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉద్యోగాలు శతశాతం స్థానిక గిరిజనులకే చెందాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ ఆ విధంగా అమలు జరగడం లేదన్నారు. సీలేరు ప్రాంతంలోనే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ పక్కనే ఉన్న దుప్పులవాడ, ధారకొండ, గుమ్మిరేవుల పంచాయతీల్లో పలు గ్రామాల్లో లోఓల్టేజీలతో చీకట్లో గడపాల్సిన పరిస్థితి నెలకొందని, ఆదివాసీ గ్రామాలకు సీలేరు నుంచి తక్షణమే విద్యుత్‌ సరఫరా చేసేంత వరకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అలాగే సీఎస్‌ఆర్‌ నిధులతో సీలేరు పరిసర గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఈ చర్యలు చేపట్టడం లేదన్నారు. సీలేరులో నూతనంగా ప్రారంభించే 1350 మెగావాట్ల పంపింగ్‌ స్టోరేజ్‌  ప్రాజెక్టు(ఎత్తిపోతల ప్రాజెక్టు) నిర్మాణం వల్ల పార్వతీనగర్‌, బుసుకొండ, వలసగెడ్డ, శాండికొండ తదితర గ్రామాల్లో గిరిజనులు భూములు కొల్పోయే పరిస్థితి ఉందని, అటువంటి వారికి ముందుగా భూమికి బదులు భూమి, ఇంటికి ఒకరికి ఉపాధి, ఇళ్లు వంటి ప్యాకేజీలను ప్రకటించి ఆ తరువాతే ప్రాజెక్టు పనులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీలేరు ప్రాజెక్టు పరిధిలో రూ.15 లక్షలలోపు నిర్వహించే పనులు ఎటువంటి టెండర్లు లేకుండా నామినేషన్‌పై స్థానిక ఆదివాసీలకే ఇవ్వాలన్నారు. స్థానిక జెన్‌కో ఆస్పత్రిలో పరిసర ప్రాంతాల గిరిజనులకు ఉచితంగా వైద్య సేవలు, మందులు పంపిణీ చేయాలన్నారు. జెన్‌కో డీఏవీ పాఠశాలలో గిరిజనుల పిల్లలకు ఉచితంగా  చదువులు చెప్పాలని, ఈ డిమాండ్లను జెన్‌కో యాజమాన్యం అంగీకరించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అనంతరం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సభా ప్రాంగణం నుంచి జెన్‌కో ఎస్‌ఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. తమ పరిధిలో ఉన్న వాటిని సానుకూలంగా పరిష్కరిస్తామని, తమ పరిధిలో లేనివి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ నాయకులు కొడా ఆనంద్‌, మార్క్‌రాజు, గొర్లి గణేశ్వరరావు, కె.బలరామ్‌(ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి), గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు, సీలేరు సర్పంచ్‌ కె.పరదేశి తదితరులు పాల్గొన్నారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీకేవీధి సీఐ అశోక్‌కుమార్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2022-05-27T06:05:29+05:30 IST