వరంగల్‌ డిక్లరేషన్‌ను గడపగడపకు తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-05-19T06:03:07+05:30 IST

ఇటీవల రాహుల్‌గాంధీ సభలో ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ను గ్రామాల్లో గడపగడపకు తీసుకెళ్లి ప్రతీ ఒక్క రైతుకు వివరించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు.

వరంగల్‌ డిక్లరేషన్‌ను గడపగడపకు తీసుకెళ్లాలి
మాట్లాడుతున్న ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌
మల్యాల, మే 18: ఇటీవల రాహుల్‌గాంధీ సభలో ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ను గ్రామాల్లో గడపగడపకు తీసుకెళ్లి ప్రతీ ఒక్క రైతుకు వివరించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. మల్యాలలో బుధవారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేఖ విధానాలను ఎండగట్టాలన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌లోని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ధరణీ పోర్టల్‌ రద్దు, ఉపాధికూలీలకు ఏడాదికి 12 వేలరూపాయలు, చక్కెర కర్మాగారం పునరుద్ధరణ, పసుపు బోర్డు ఏర్పాటు, పంటల బీమాపై ఈ నెల 21 నుంచి గ్రామాల్లో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో వివరించాలన్నారు. తరువాత రైతుల తరుపున పోరాడుతూ వారికి అండగా నిలువాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ కాంగ్రెస్‌ పార్టీ పునర్వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కొండగట్టుకు అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మేడిపెల్లి సత్యం, యువజన కాంగ్రెస్‌  నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యం శంకర్‌గౌడ్‌, దారం ఆదిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు దిగువ కొండగట్టు నుంచి మల్యాల వరకు కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించగా పొన్నం, సత్యం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:03:07+05:30 IST