బుద్ధుడు చెప్పిన యుద్ధ తంత్రం

ABN , First Publish Date - 2020-07-10T05:30:00+05:30 IST

మానవ జీవితాలు ఎన్ని సంఘర్షణలకు లోనవుతాయో మానవ సమాజం కూడా అంతే! సంఘర్షణ, శాంతి ప్రతి సమాజానికీ అనుభవమే! భిన్న ఆలోచనలూ, విభిన్న మనస్తత్వాలూ, స్వార్థాలూ, దురాశలూ...

బుద్ధుడు చెప్పిన యుద్ధ తంత్రం

మానవ జీవితాలు ఎన్ని సంఘర్షణలకు లోనవుతాయో మానవ సమాజం కూడా అంతే! సంఘర్షణ, శాంతి ప్రతి సమాజానికీ అనుభవమే! భిన్న ఆలోచనలూ, విభిన్న మనస్తత్వాలూ, స్వార్థాలూ, దురాశలూ... ఇవన్నీ సంఘర్షణకు మూలస్తంభాలు. వ్యక్తులకు స్థలం హద్దుల దగ్గర తగాదాలు వచ్చినా, రైతులకు పొలం గట్ల దగ్గర పోట్లాటలు వచ్చినా, దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చెలరేగి సమరం దాకా తీసుకువచ్చినా... ఇవన్నీ దురాశ, దురాక్రమణల్లో భాగాలే!


‘సొంత ఉనికికే ప్రమాదమైతే వీరత్వం చూపించి తమను తాము రక్షించుకోవాలి’ అని చెప్పే  కథ ‘వడ్డకీ సూకర జాతకం’గా బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధం. ‘నీకు నీవుగా హింసకు పూనుకోకు. అలాగే భరించలేని హింసకు బలి కాకు’ అనే గొప్ప శాంతి, స్వేచ్ఛలకు సంకేతం బౌద్ధ సందేశం. 


శాంతి, అహింసలను ఈ ప్రపంచానికి పరిచయం చేసినవాడు బుద్ధుడు. ఎదుటివాడు దుర్మార్గుడైతే అతనిలోని దుర్మార్గాన్ని తొలగింపజేయడానికి ప్రయత్నించమన్నాడు. ఎంత చెప్పినా వినకుండా ఎదుటివాడు మన చెంప మీద కొడితే... ఇంకో చెంపను చూపించాలని బుద్ధుడు చెప్పలేదు. నీపై జరిగే హింసను నీ శక్తి మేరకు ఎదిరించమనే చెప్పాడు. ‘ఆపలేని హింసను అడ్డుకోవడం స్వేచ్ఛలో భాగమే!’ అంటుంది బౌద్ధం. దాన, శీల, జ్ఞాన, సమాధి స్థితులకు బౌద్ధం ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో, వీర్య గుణాలకు కూడా అంతే ప్రాధాన్యమిచ్చింది. ఈ వీర్య గుణంలోంచి పుట్టినవాడే బోధిధర్ముడు. మన తెలుగు బౌద్ధ భిక్షువు. ప్రపంచానికి మార్షల్‌ ఆర్ట్స్‌ అందించిన అసమాన ధీరుడు. అలాంటివాడే బౌద్ధారామంలోని ధనుగ్గహ థేరుడు. అతను చెప్పిన శక్రవ్యూహాన్ని పన్ని, మగధరాజును బంధిస్తాడు కోసల రాజు. ఈ సందర్భంలో బుద్ధుడు చెప్పిన కథ ఇది.


సూరంగముడు అనే సైనికుడికి అడవిలో ఒక అందమైన అడవి పందిపిల్ల దొరికింది. దాన్ని తెచ్చి పెంచుకున్నాడు. ‘వీర సూకరం’ అని పేరు పెట్టాడు. దానికి చాలా పనులు నేర్పాడు. అది పెరిగి పెద్దదయింది. ‘అడవిలో తన జాతి జీవుల మధ్య పెరగాల్సిన ఇది నా దగ్గర ఒంటరిగా ఉంది’ అని సూరంగముడు అనుకొని, ఒకరోజు దాన్ని అడవిలో వదిలి వచ్చాడు. ఆ పంది సంతోషంగా అడవంతా తిరిగి, ఒక కొండ గుహ దగ్గరకు చేరింది. అది తాను చిన్నతనంలో పెరిగిన ప్రదేశమేనని గుర్తుపట్టింది. కానీ, అక్కడ పందులు లేవు. ‘ఏమైపోయాయి?’ అని వెతికింది. చెల్లాచెదురైన పందులు పొదల్లో కనిపించాయి. వాటిని వివరం అడిగింది. 

‘‘ఓ వీరసూకరమా! ఏం చెప్పేది? ఈ ప్రాంతంలోకి ఒక పెద్ద పులి వచ్చింది. ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి మాలో ఒకర్ని వేటాడి తీసుకుపోతోంది. అలా చాలా సూకరాల్ని పొట్టన పెట్టుకుంది. మిగిలినవారం ఇలా చెల్లాచెదురై పోయాం’’ అని పందులు చెప్పాయి. 

‘‘మీరు భయపడకండి. నేనొక సైనికుడి ఇంట్లో పెరిగాను. నాకు యుద్ధ వ్యూహాలు వచ్చు. రండి! మన స్థావరాలకు వెళదాం’’ అంటూ వీర సూకరం ధైర్యం చెప్పింది. పందులన్నీ గుహల్లోకి వచ్చి చేరాయి.

వీరసూకరం ఆ ప్రాంతాన్నంతా పరిశీలించింది. ఒక చోట ఏటవాలు ప్రదేశం, దాని చివర చిన్న లోయ ఉన్నాయి. వెంటనే మిగిలిన అడవి పందుల్ని పిలిచి - 

‘‘సూకర వీరులారా! శ్రద్ధగా వినండి. యుద్ధంలో చక్రవ్యూహం, పద్మవ్యూహం, శకటవ్యూహం శ్రేష్టమైనవి. ఇక్కడ గుహలు, కొండల్ని బట్టి మనం పద్మవ్యూహం పన్నాలి. నేను ఈ ఏటవాలు స్థలం పైన ఉన్న ఎత్తైన ప్రదేశంలో నిలబడతాను. నేను చెప్పినట్టు మీరు నిలబడాలి. అందరికీ మధ్యలో పిల్లలున్న తల్లులు, వారికి ముందరి వలయంలో పెద్ద పిల్లలు, వృద్ధులు, వారికి ముందు వలయంలో ఆడ సూకరాలు, వాటికి ముందరి వలయంలో ముట్టె, కోరలు పొడవుగా ఉన్న సూకరాలు ఉండాలి. వాటికి ముందు వరుసలో తెగింపు కలిగిన సూకరాలు పది పది చొప్పున ఒక్కొక్క జట్టుగా నిలబడి సిద్ధంగా ఉండాలి’’ అని చెప్పింది వీరసూకరం.

తెల్లారింది. సూకరాలన్నీ ఏటవాలు తలం మీద నిలబడ్డాయి. పెద్దపులి వేటకు వచ్చింది. కొండలా నిలబడిన సూకరాలను చూసి భయపడి, తోక ముడిచింది.

ఆ పులికి సలహాలు చెప్పి, అది తెచ్చిన మాంసం తిని బతికే వృద్ధ పులి ఒకటుంది. అది పెద్ద పులిని ఆపి, విషయం తెలుసుకొని -  ‘‘అవి ఉత్త పిరికివి. నువ్వు ఇలా తిరిగి రావడం మన పులి జాతికే అవమానం’’ అని రెచ్చగొట్టింది. దాంతో పులికి పౌరుషం వచ్చింది. గాండ్రిస్తూ గుహల వైపు బయలుదేరింది. పులి మళ్ళీ తిరిగి రావడం చూసిన వీరసూకరం మిగిలిన సూకరాలన్నిటినీ పద్మవ్యూహం పన్ని, లోయలో నిలబెట్టి, తాను కొండ అంచున నిలబడింది. పెద్ద పులి వచ్చి వీరసూకరం మీదకు దూకింది. అది వేగంగా పక్కకు తప్పుకుంది. పెద్ద పులి వెళ్ళి లోయలో పడిపోయింది. అక్కడే సిద్ధంగా ఉన్న సూకరాలన్నీ పులి మీద పడి, కోరలతో కుమ్మేశాయి. వాటికి పులి పీడ వదిలిపోయింది.

‘‘వీరులారా! ఈ పులికి సలహాలు ఇచ్చి, మన మీదకు పంపించే ముసలి పులి ఉంది కదా! దాన్ని కూడా తరిమేద్దాం రండి’’ అని తన సైన్యాన్ని తీసుకొని, ముసలి పులి ఉన్న చోటుకు చేరింది వీరసూకరం. ఆ పులిని కూడా కుమ్మేశాయి సూకరాలు. 

-బొర్రా గోవర్ధన్‌



Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST