Abn logo
Oct 27 2021 @ 23:57PM

ఓటరు జాబితాను అన్ని జిల్లాల్లో విడుదల చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌

కామారెడ్డి, అక్టోబరు 27: స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబరు 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో, అదనపు కలెక్టర్లతో ఎస్‌ఎస్‌ఆర్‌ 2022పై  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబరు 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈవీఎంల భద్రతపై పర్యవేక్షించాలన్నారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా గాని, ఫారం 6 ద్వారా గాని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రచారం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, ఆర్‌డీవో శ్రీను, ఎన్నికల సూపరింటెండెంట్‌ సరళ, అధికారులు రవికుమార్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

విలేజ్‌ లెవల్‌ మల్టీ డిసిప్లీనరీ టీంలు ప్రతీ ఇంటిని సర్వే చేయాలి
విలేజ్‌ లెవల్‌ మల్టీ డిసిప్లీనరీ టీంలు ప్రతీ ఇంటిని సర్వే చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇతర దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ అందించాలని తెలిపారు. వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు, ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే చేసి మొదటి, రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను నమోదు చేయాలని తెలిపారు.