ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

ABN , First Publish Date - 2021-12-02T05:29:42+05:30 IST

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు సవరణ జాబితాలు పడక్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

ఓటరు హెల్ప్‌లైన్‌ గరుడ యాప్‌పై  విస్త్రృత ప్రచారం చేయాలి

 వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

సిద్దిపేట టౌన్‌/సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ రూరల్‌, డిసెంబరు 1: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు సవరణ జాబితాలు పడక్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఓటరునమోదు కార్యక్రమం, గరుడయాప్‌ వినియోగం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బుధవారం  ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు. జనవరి 1, 2022 నాటికి 18ఏళ్లు నిండి న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. డిసెంబరు 20లోగా అభ్యంతరాలను, ఓటరు క్లెయిమ్స్‌ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5న తుది జాబితా రూపొందించాలని స్పష్టంచేశారు. ఓటర్లకు తమ పోలింగ్‌ స్టేషన్‌లను సులువుగా తెలుసుకొనే విధంగా భారత ఎన్నికల కమిషన్‌ గరుడ యాప్‌ను రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారంచేయాలన్నారు. గరుడ యాప్‌ వినియోగంపై బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతీ నెల తనిఖీ చేయాలని, అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు  జిల్లాలో గరుడ యాప్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సిద్దిపేట కలెక్టరేట్‌ నుంచి  జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి  బి చెన్నయ్య, ఎన్నికల ఉప తహసీల్దార్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవోలు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా నుంచి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ నుంచి పాల్గొన్నారు. కాగా మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌, ఆర్డీవో సాయిరాం, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌  శైలేంద్ర కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-02T05:29:42+05:30 IST