ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2022-01-25T03:45:29+05:30 IST

దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించుకొనే ఏకైక అస్త్రం. ఓటుతో సమర్ధవంతుడైన నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనే వెసలుబాటు పౌరులకు ఉంది.

ఓటు వజ్రాయుధం

రాజ్యాంగం  పౌరులకు కల్పించిన హక్కు

జిల్లాలో 5,93,849 మంది ఓటర్లు 

ఓటు హక్కును మరవొద్దు

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

మంచిర్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్‌ను నిర్ణయించుకొనే ఏకైక అస్త్రం. ఓటుతో సమర్ధవంతుడైన నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనే వెసలుబాటు పౌరులకు ఉంది.   ఎన్నికలు రాగానే హడావుడి చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించే నాయకులు, అనంతరం ఓటేసిన వారిని విస్మరించే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు ముఖ్య భూమిక పోషించాల్సిన సమయం. ఓటు వేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పౌరులు అనామకులను అందలమెక్కిం చిన వారవుతారు. తాను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందనే అభిప్రాయం అనర్హులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి ఉన్న విలువ సార్థకం అవుతుంది. నేషనల్‌ ఓటర్స్‌ డే 2022 యొక్క థీమ్‌ ‘ఎన్నికల్లో అందరినీ కలుపుకొని, అందరికీ అందుబాటులోకి తెసుకెళ్లడం, అందరూ పాల్గొనేలా చేయడం’.  

ప్రలోభాలకు లొంగవద్దు

ఎన్నికలంటేనే డబ్బు, మద్యం ఏరులై పారుతున్న రోజులివి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నోట్లు, మద్యం కోసం ఓటు హక్కును దుర్వినియోగం చేసే ఓటర్లూ లేకపోలేదు. ఓటు వేస్తే మాకేంటి అనే ధోరణి కొందరిలో కనిపిస్తుంది. ప్రజలు వేసే ఓటు తమ ప్రాంతాన్ని ఐదేళ్ల వరకు పాలించే నాయకున్ని ఎన్నుకొనే బ్రహ్మాస్త్రం అనే విషయాన్ని విస్మరించకుండా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుకు సంపూర్ణ అర్థం వస్తుంది.  దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఓటు హక్కు, దాని వినియోగంపై పౌరులకు యేటా అవగాహన కల్పిస్తాయి. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా గుర్తించేందుకు జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు విలువలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తోంది. 

జిల్లాలో ఓటర్లు

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రకారం 1-1-2022 నాటికి జిల్లాలో 5,93,849 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,97,912 మంది ఉండగా స్త్రీలు 2,95,891 మంది ఉన్నారు. వీరితోపాటు ఇతరులు 46 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బలగాలు) ఓటర్లు మరో 605 మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 6000 మంది ఓటర్లు కొత్తగా జాబితాలో చేరగా, 3202 మందిని జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా 1 శాతం ఓటర్లు పెరిగారు. కొత్తగా నమోదైన 18, 19 సంవత్సరాలు గల యువ ఓటర్లు 2436 ఉన్నారు. జిల్లాలోని ఓటర్లు నియోజక వర్గాల వారీగా ఇలా...

చెన్నూరు నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,75,641 మంది ఉండగా పురుష ఓటర్లు 88,281 మంది, మహిళలు 87,353, ఇతరులు 7గురు ఉన్నారు. వీరితోపాటు నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఐ ఓట్లు పురుషులు 6 ఉండగా, సర్వీస్‌ ఓటర్లు పురుషులు 131 మంది, స్త్రీలు 4 గురు ఉన్నారు. యువ ఓటర్లు 944 ఉన్నారు. 

బెల్లంపల్లి నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,62,051 మంది ఉండగా పురుషులు 81,276, మహిళలు 80,758 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. వీరితోపాటు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు పురుషులు 2, సర్వీస్‌ ఓటర్లు  పురుషులు 147, స్త్రీలు 7గురు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 522 యువ ఓటర్లు ఉన్నారు.

మంచిర్యాల నియోజకవర్గం

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,56,157 మంది ఉండగా పురుషులు 1,28,355 మంది, మహిళలు 1,27,780 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరితోపాటు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 21 మంది ఉండగా పురుషులు 23 మంది, మహిళలు 4గురు ఉండగా, సర్వీసు ఓటర్లు  పురుషులు 308 మంది, స్త్రీలు 8 మంది ఉన్నారు. వీరిలో కొత్తగా నమోదైన వారిలో 970 మంది యువ ఓటర్లు ఉన్నారు. 

ఓటు హక్కును వినియోగించుకోవాలి

భారతి హోళికేరి, కలెక్టర్‌ 

దేశంలో పరిపాలన ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. ప్రజలే పాలకులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఓటింగ్‌ కీలక ప్రక్రియ. 18 సంవత్సరాలు నిండగానే ఓటరుగా నమోదు చేసుకోవాలి. యేటా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. యువతపై దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉన్నందున కచ్చితంగా వారు ఓటరు నమోదు చేసుకోవాలి. ప్రజలు ఎలాంటి పాలకున్ని ఎన్నుకుంటే అలాంటి పాలనే వస్తుంది. ఓటు అనేది హక్కుతోపాటు బాధ్యత కూడా. ఆ బాధ్యతని మర్చిపోతే హక్కులు కూడా రావు. ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.  

Updated Date - 2022-01-25T03:45:29+05:30 IST