Abn logo
Sep 25 2021 @ 00:33AM

ధిక్కార స్వరం

సంతబొమ్మాళి : సమావేశం నుంచి బయటకు వచ్చేస్తున్న రెబల్‌ ఎంపీటీసీలు

-అధికార పార్టీ అభ్యర్థికి మద్దతివ్వని రెబల్‌ ఎంపీటీసీలు                                                   

- సంతబొమ్మాళిలో కోరం లేక ఎన్నిక వాయిదా                                                  

సంతబొమ్మాళి, సెప్టెంబరు 24: సంతబొమ్మాళి మండలంలో వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ధిక్కార స్వరం వినిపించారు. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ-18, టీడీపీ-2 స్థానాలను కైవసం చేసుకుంది. శుక్రవారం ఎంపీపీ ఎన్నికలు జరగ్గా.. మండల పార్టీ అధ్యక్షుడు సుగ్గు రామిరెడ్డి సతీమణి, హెచ్‌.ఎన్‌.పేట ఎంపీటీసీ సభ్యురాలు సుగ్గు నిర్మలను ఎంపీపీగా, లక్కివలస ఎంపీటీసీ చింతల రాజును వైస్‌ ఎంపీపీగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎంపిక చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు వారి పేర్లు ప్రకటించినట్టు వెల్లడించారు. రెబల్‌ సభ్యులు సుగ్గు నిర్మలకు పదవి ఇచ్చేందుకు నిరాకరించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఉమ్మిలాడ ఎంపీటీసీ మేరుగు రాజేశ్వరిని రెబల్‌ అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఎన్నిక సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు దువ్వాడ శ్రీనివాస్‌ తన సతీమణి వాణి(టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు)తో కలిసి సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. రెబల్‌ నాయకులతో సంప్రదించారు. నిర్మలకు కాకుండా ఎవరికి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని రెబల్‌ నేతలు దువ్వాడకు తేల్చి చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు నిర్మలకే ఎంపీపీ పదవి ఇస్తామంటూ దువ్వాడ శ్రీనివాస్‌ వారికి తెలిపారు. దీంతో రెబల్‌ నాయకులు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. రెబల్‌ ఎంపీటీసీ సభ్యులు పది మందితో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా బయటకు వచ్చేశారు. సమావేశ మందిరంలో ఎనిమిది మంది సభ్యులు మాత్రమే మిగిలారు. గంటకుపైగా మండల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు వేచిచూశారు. కోరం లేక ఎంపీపీ ఎన్నిక శనివారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ నేతల మధ్య వర్గవిభేదాల   నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. టెక్కలి సీఐ నీలయ్య ఆధ్వర్యంలో టెక్కలి, సంతబొమ్మాళి, నౌపడ ఎస్‌ఐలు కామేశ్వరరావు, గోవింద్‌, సాయికుమార్‌లు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


పొందూరులోనూ కోరం లేక..  

పొందూరు : పొందూరులో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేపింది. నాటకీయ పరిణామాల మధ్య కోరం లేక శనివారానికి వాయిదా పడింది. మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. వైసీపీ -12, టీడీపీ -9 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో వైసీపీకి చెందినవారే ఎంపీపీ, వైఎస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులుగా ఎంపికవుతారని అంతా భావించారు. వైసీపీ సీనియర్‌ నాయకుడు సువ్వారి గాంధీ ఎంపీపీ పదవిని ఆశించారు. ఆయనకు ఎంపీపీ పదవి ఇచ్చేందుకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ససేమిరా అన్నట్టు సమాచారం. స్పీకర్‌ తీరుపై గాంధీ అలకబూనడంతో వారిద్దరి మధ్య ఇటీవల దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో గాంధీ వర్గం ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరవుతుందని భావించిన స్పీకర్‌ తమ్మినేని.. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో శుక్రవారం పొందూరులోనే మకాం వేశారు. మొదట ఎన్నికలకు వైసీపీ నుంచి 9 మంది సభ్యులు హాజరయ్యారు. స్పీకర్‌ సూచనతో రాపాక సభ్యురాలు చింత రమణమ్మను వైసీపీ నాయకులు తీసుకువచ్చారు. సువ్వారి గాంధీతో పాటు వైసీపీకి చెందిన తాడివలస, కొంచాడ ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు కూడా హాజరుకాలేదు. 21 మంది సభ్యులు ఉన్న కార్యవర్గంలో 10 మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు చేసేదిలేక ఎన్నికను వాయిదా వేశారు.   


 ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రవికుమార్‌

ఎంపీపీ ఎన్నికను జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీలో పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు వైసీపీ సభ్యుల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు సాగించారు. ఇద్దరు వైసీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకావడం లేదని తెలుసుకుని.. తమ ఎంపీటీసీ సభ్యులు కూడా గైర్హాజరయ్యేలా చేశారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.