గ్రామాల్లో విస్తరిస్తున్న వైరస్‌

ABN , First Publish Date - 2021-05-17T05:19:36+05:30 IST

మండలంలో ఆదివారం వచ్చిన నివేదిక ప్రకారం కొత్తగా మరో 51 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

గ్రామాల్లో విస్తరిస్తున్న వైరస్‌

చిలమత్తూరు, మే 16: మండలంలో ఆదివారం వచ్చిన నివేదిక ప్రకారం కొత్తగా మరో 51 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోజురోజుకు మండలంలో కరోనా పాజిటీవ్‌ సంఖ్య పేరుగుతోంది. ఇప్పటికే 200 పైచిలుకు ఆక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల్లో పాజిటీవ్‌ కేసుల నమోదు అధికంగా వస్తుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గ్రామాల్లో  జ్వరాలపై గ్రామ వాలంటీర్లతో సర్వే జరుపుతున్నారు. ఈ సర్వేలో పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వారాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వారికి వస్తున్న జ్వరాలు మామూలు జ్వరాలా? లేక విష జ్వరాలా? లేక కోవిడ్‌కి సంబంధించిన జ్వరాలా అనే విషయం వైద్య అధికారులు తేల్చాల్సి ఉంది. సాధారణ జ్వరాలుగా భావించి వాటికి సరైన వైద్యం తీసుకోకుండా కొందరు ఇబ్బందులకు పాలవుతున్నారు. అదే జ్వరాలు చివరికి కోవిడ్‌గా మారుతున్నాయి. ఇప్పటికైనా వైద్యాధికారులు జ్వర పీడుతులకు వెంటనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 

గోరంట్లలో 105 మందికి కరోనా 

గోరంట్ల: మండలంలో 105మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే 600కేసులు మండలంలో ఉండగా శుక్రవారం 46మందికి, శనివారం 69పాజిటివ్‌ కేసులు వచ్చాయి. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు పోలీసులు చెబుతున్నా, ప్రజలు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో కొవిడ్‌ నిబంధనలు పాటించని కారణంగా శనివారం ఒకే రోజు గోరంట్ల పట్టణంలో 7మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా విశ్వరూపం దాల్చి మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం లేకపోలేదు. 

పెనుకొండలో 85 కేసులు 

పెనుకొండ రూరల్‌: కొవిడ్‌ -19 సెకెండ్‌వేవ్‌ పెనుకొండ మండలంలో రోజు రోజుకు విస్తరిస్తోంది. తాజాగా ఆదివారం పెనుకొండ మండలంలో 85 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో పట్టణంలో 43, గ్రామీణ ప్రాంతాల్లో 42కేసులునమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. 

కరోనాతో ఉపాధ్యాయుడి మృతి 

రొద్దం: పెద్దగువ్వలపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు పండిట్‌ ఉపాధ్యాయుడు రమే్‌షబాబు(44) కరోనతో శనివారం రాత్రి మృతిచెందాడు. తలుపుల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు పెద్దగువ్వలపల్లి జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో పనిచేసేవారు. గత నెల పాఠశాలలో సరస్వతిపూజ జరిగిన సందర్భంగా కరోనా సోకిందని ఈనెల 5న కదిరి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం రాత్రి మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపట్ల పాఠశాల ఉపాధ్యాయులు సరస్వతమ్మ, రమేష్‌, గోపాల్‌, సలీం, బ్రమరాంబ, జయసుఽధ, ఉషారాణి, పద్మ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 


Updated Date - 2021-05-17T05:19:36+05:30 IST