క్షమయా సాధ్యతే సర్వమ్‌

ABN , First Publish Date - 2020-07-23T07:41:52+05:30 IST

ధైర్యం, క్షమ, మనోనిగ్రహం, అస్తేయము (ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం), శుచి, ఇంద్రియ నిగ్రహం, ఉచితానుచిత వివేకం, విద్య, సత్యం, క్రోధరాహిత్యం..

క్షమయా సాధ్యతే సర్వమ్‌

ధృతి క్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహం

ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణమ్‌


ధైర్యం, క్షమ, మనోనిగ్రహం, అస్తేయము (ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం), శుచి, ఇంద్రియ నిగ్రహం, ఉచితానుచిత వివేకం, విద్య, సత్యం, క్రోధరాహిత్యం.. ఈ పది ధర్మ లక్షణాలు అని ఈ శ్లోక భావం ఈ గుణాలు లేకపోతే ప్రాకృతిక ప్రపంచంలోగానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలోగానీ గెలుపు లభించదు. ఈ గుణాలు ఇచ్ఛాశక్తిని పెంచుతాయి. మనోనిలకడ కలగడానికి ఓర్పు, క్షమ అవసరం. నిందలను మౌనంగా సహిస్తే, ఆ నిందల ఫలితం నిందించిన వారికే చెందుతుంది. పైగా, వారి పుణ్యం సహించిన వానికి చెందుతుంది. అందుకే సాధువులు తమకు జరిగిన అపకారాన్ని సహిస్తారేగానీ పగబూనరు. ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు. వెదురు నుండి పుట్టిన అగ్ని వనాన్నే కాల్చినట్టు.. స్పర్థతో జనించే క్రోధం వంశాన్నే నాశనం చేస్తుంది. ఓర్పు కలిగినవాడికి కాలమే తగిన సమయంలో చక్కటి తీర్పునిస్తుంది. ద్వేషాలు దుఃఖాలకు మూలకారణం కాని క్షమా గుణ సాధనలోనే శాంతిని పొందాలి.


క్షమాబలమశక్తానాం, శక్తానాం భూషణం క్షమా

క్షమా వశీకృతేల్లోకే, క్షమాయాకిం న సిద్ధ్యతి

అనగా.. నిర్బలురకు క్షమయే బలం. ఆ క్షమయే బలవంతులకు భూషణం. క్షమ ద్వారా లోకాన్ని వశపరుచుకోవచ్చు. లోకములో క్షమ వల్ల..కాని పని అంటూ ఏదీ ఉండదని దీని అర్థం. గీతాచార్యుడు భక్తి యోగంలో భక్తుని లక్షణాలుగా ముప్పై ఐదింటిని చెప్పాడు. వాటిలోనూ.. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది పుష్పాలు భగవంతునికి అత్యంతప్రీతికరమైనవని, ఆ పుష్పాలను సమర్పించినవాడు తనకు అత్యంత ప్రియమైనవాడని చెప్పాడు. ఆ ఎనిమిదింటిలో కూడా క్షమ తలమానికం. మనిషికి రూపం, గుణం, జ్ఞానం, క్షమ ఒక దాన్ని మించి ఒకటి శోభిస్తాయి.  సంయమి ఎదుట యముడు కూడ తలవంచక తప్పదు. చేతిలో క్షమాస్త్రం ఉన్నవాణ్ని దుర్జనులు కూడ ఏమీ చేయలేరు. గడ్డి లేని చోట పడిన అగ్ని దానంతట అదే శమించినట్లు.. ప్రతీకారం చేయని శాంతుని పట్ల దుర్జనులు సైతం క్రూరత్వాన్ని వదులుకొని శాంతులవుతారు.


క్షమ సత్యము క్షమ ధర్మము

క్షమ వేదము క్షమ అహింస క్షమ యజ్ఞంబౌ

క్షమ సంతోషము క్షమ దయ

క్షమయే ఆధారమగును సర్వంబునకున్‌

క్షమ వల్లక్రోధం నశిస్తుంది. క్షమను ఆశ్రయించడం శ్రేయోదాయకం! క్షమకు మించిన శక్తివంతమైన ఆయుధం లేదు. అదే మనకు సంతోషం. అన్నింటికీ అదే ఆధారం. అందుచేతనే ‘‘క్షమయా సాధ్యతే సర్వమ్‌’’ అన్నారు పెద్దలు.


- మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-07-23T07:41:52+05:30 IST