ఆడబిడ్డ పుడితే అక్కడ పండుగే!

ABN , First Publish Date - 2021-02-24T06:32:41+05:30 IST

ఆడ శిశువుల్ని గర్భంలోనే చంపేస్తున్న వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ ఊళ్లో అమ్మాయి పుడితే సంబురం అంబరాన్నంటుతుంది. గ్రామపంచాయతీ విద్యుద్దీపాల వెలుగుల్ని సంతరించుకుంటుంది...

ఆడబిడ్డ పుడితే అక్కడ పండుగే!

ఆడ శిశువుల్ని గర్భంలోనే చంపేస్తున్న వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ ఊళ్లో అమ్మాయి పుడితే సంబురం అంబరాన్నంటుతుంది. గ్రామపంచాయతీ విద్యుద్దీపాల వెలుగుల్ని సంతరించుకుంటుంది. శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. ఊరంతా మిఠాయిలు పంచుకొని వేడుక చేసుకుంటుంది. తల్లిదండ్రులకు ధీమానూ, ఆడబిడ్డలకు ఆర్థిక భద్రతనూ అందిస్తున్న ఆ ఊరు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదా్‌సపూర్‌... 


ఎవరికైనా బిడ్డ పుట్టినట్టు చెప్పగానే... ఆడా, మగా అనే ప్రశ్న వెంటనే ఎదురవుతుంది. అడుగడుగునా వేధింపుల నుంచి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో ఇంకా కొనసాగుతున్న వరకట్న మహమ్మారి వరకూ... ఆడబిడ్డలు ఎదుర్కొనే సమస్యలు అనేకం. కొన్ని ప్రాంతాల్లో ఆడ శిశువులను గర్భంలో లేదా పుట్టిన వెంటనే చంపేసే దారుణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యలకు పరిష్కారంగా సంగారెడ్డి జిల్లాలోని హరిదా్‌సపూర్‌ గ్రామం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. 


అలా మొదలైంది...

అది 2020 జనవరి ఒకటో తేదీ. గ్రామంలోని సత్యవతి, నాగేశ్‌ దంపతులకు మూడో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. అంతకుముందు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో ఆ కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఈ సంగతి తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి రోహిత్‌ కులకర్ణి, గ్రామ సర్పంచ్‌ షఫీ వారి ఇంటికి వెళ్ళారు. ఆడబిడ్డ కుటుంబానికి భారం కాదని నచ్చజెప్పి, ఆ కుటుంబంలో ఆత్మస్థైర్యం నింపారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలకు మిఠాయి పంచిపెట్టారు. ఊళ్లోని వారందరూ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని, సంబరాలు జరుపుకొన్నారు. సత్యవతి, నాగేశ్‌లనూ ఘనంగా సన్మానించారు. వారి బిడ్డ చదువు, పెళ్లి కోసం పొదుపు చేయాలని నచ్చజెప్పి, సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఆ చిన్నారి వివరాలు నమోదు చేయించారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున అయిదు నెలలపాటు జమ చేసి, ఆ కుటుంబానికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని సర్పంచ్‌, కార్యదర్శి భరించారు. అనంతరం... ఆడబిడ్డ జన్మిస్తే, వేడుక చేసుకోవాలనీ, వారి కుటుంబానికి ప్రోత్సాహం ఇవ్వాలనీ 816 మంది జనాభా ఉన్న ఆ గ్రామం తీర్మానం చేసుకుంది. అప్పటి నుంచీ గ్రామంలో ఆడబిడ్డ పుట్టినప్పుడు... వారి ఇంటినీ, పంచాయతీ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడం, మిఠాయిలు పంచడం, ఆ బిడ్డలను సుకన్య సమృద్ధి యోజనలో నమోదు చేయించడం, అయిదు నెలల ప్రోత్సాహకం అందజేయడం కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 50 మందికి పైగా ఆడబిడ్డలను ఈ పథకంలో చేర్పించారు. 


అది చాటి చెప్పడానికే...

‘‘ఆడపిల్లలు బాగా చదవాలి. బాల్య వివాహాలు అరికట్టాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టాయి. గ్రామీణ ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో ఆడపిల్లలను పోషించడం, చదివించడం, పెళ్లి చేయడం భారంగా భావిస్తున్నారు. ఆడపిల్ల భారం కాదని చాటి చెప్పడానికే మా గ్రామంలో ఈ సంబురాలు నిర్వహిస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటి వరకు 58 మంది ఆడపిల్లలను సుకన్య సమృద్ధి యోజనలో నమోదు చేయించాం. ఇప్పుడు గ్రామంలో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంట్లో సంతోషం నెలకొంటోంది’’ అంటారు పంచాయతీ కార్యదర్శి రోహిత్‌ కులకర్ణి


కన్యావందనం..

హరిదా్‌సపూర్‌ గురించి విన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌  స్వామి ఇటీవల ఆ గ్రామంలో కన్యావందనం కార్యక్రమంలో పాల్గొని, గ్రామస్థులను అభినందించారు. ఇక్కడ జన్మించిన ప్రతి అమ్మాయినీ మహాలక్ష్మి స్వరూపంగా భావించడం అద్భుతమనీ, చిలుకూరు ఆలయంలోని మహాలక్ష్మీ అమ్మవారి పారాణిని పదకొండు మంది బాలికల కాళ్ళకు పూసి, ఆశీస్సులు అందజేశారు.  ఒక కుటుంబం విచారాన్ని తొలగించి, వారిలో స్థైర్యాన్ని నింపడానికి ప్రారంభించిన ఆనవాయితీ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. 






కులమతాలకు అతీతంగా...

‘‘మా గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే... కులమతాలకు అతీతంగా ఊరంతా కలిసి మిఠాయిలు పంచుకుంటున్నాం. పంచాయతీ ఆఫీసు వద్ద సంబురాలు జరుపుకొంటున్నాం. నాకు కూతురు పుట్టగానే గ్రామ ప్రజలంతా శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్ల భవిష్యత్తులో భారం కాకూడదని  సుకన్య సమృద్ది పథకంలో నా బిడ్డను చేర్పించడం ఎంతో ఆనందంగా ఉంది.’’

 - షహినా, గృహిణి






ఎంతో సంతోషంగాఉంది...

‘‘నాకు ఇద్దరు ఆడపిల్లలు. భార్గవి, ప్రవళిక, మూడవ సంతానంగా మళ్లీ ఆడబిడ్డ పుట్టడంతో కుటుంబం మొత్తం దిగులు చెందాం. మాది పేద కుటుంబం, ఆ సమయంలో సర్పంచ్‌ షఫీ, కార్యదర్శి రోహిత్‌ మమ్మల్ని ఓదార్చారు. గ్రామంలో సంబురాలు చేశారు. నా మూడవ బిడ్డ భవ్యశ్రీతో పాటు మొదటి కూతురు భార్గవిని కూడా సుకన్య సమృద్ది పథకంలో నమోదు చేయించి, ఆర్థిక ప్రోత్సాహం అందించారు. ఇది నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.’’                                    -సత్యవతి, భవ్యశ్రీ తల్లి






అందరికీ స్ఫూర్తి కావాలి

‘‘మా ఊరిలో కొనసాగుతున్న ఈ సంప్రదాయం అందరికీ స్ఫూర్తి కావాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్నిట్లోనూ రాణిస్తున్నారు. ‘పేద ఇంట్లో ఆడబిడ్డ పుట్టడం భారం కాదు’ అని చాటి చెప్పేలా మా గ్రామంలో ఆడబిడ్డ పుట్టగానే సంబురాలు చేస్తున్నారు. ఆడపిల్లలను కన్నవారిని ప్రోత్సహిస్తూ, ఆ బిడ్డల చదువులు, పెళ్ళిళ్ళ కోసం సుకన్య సమృద్ధి యోజనలో తొలి 5 నెలల వాయిదా డబ్బు చెల్లించి, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు.’’    - నర్సమ్మ గృహిణి





Updated Date - 2021-02-24T06:32:41+05:30 IST