ఆహా ఏమి రుచి...

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

హైదరాబాద్‌ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్‌లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం...

ఆహా ఏమి రుచి...

మన దేశంలో ఒక్కో  ప్రాంతానిది ఒక్కో రుచి. హైదరాబాద్‌ అనగానే బిర్యానీ గుర్తొచ్చినట్లే.. లక్నో అనగానే కబాబ్‌లు నోరూరిస్తాయి. వీటితో పాటు ఇంకొన్ని ప్రత్యేక రుచులు కూడా ఈ ప్రాంతాల సొంతం. అలాంటి నాలుగు నాన్‌వెజ్‌ రుచులను ఓహ్రీ రెస్టారెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ విక్రమ్‌ సింహ మీ కోసం అందిస్తున్నారు..




అవద్‌ కీ గలౌటీ కబాబ్‌


కావలసినవి

మటన్‌ (బోన్‌లెస్‌) - ఒకకేజీ, ఉల్లిపాయలు - 200గ్రా, వెల్లుల్లి పేస్టు - 100గ్రా, సెనగపిండి - పావుకేజీ, పచ్చి బొప్పాయి పేస్టు - 40గ్రా, గరంమసాలా - 20గ్రా, జీడిపప్పు - 30గ్రా, వేగించిన పుట్నాల పొడి - 25గ్రా, మైదా - 75గ్రా, ఉప్పు - రుచికి తగినంత, లవంగాలు - 10గ్రా, నెయ్యి - 200ఎంఎల్‌, కశ్మీరీ కారం - 50గ్రా, కుంకుమపువ్వు - 2గ్రాములు.


తయారీ విధానం

  1. మటన్‌ను శుభ్రంగా కడిగి మీట్‌ గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి.
  2. తరువాత అందులో వెల్లుల్లి పేస్టు, పుట్నాల పొడి, గరంమసాలా, తగినంత ఉప్పు, కారం, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.
  3. ఉల్లిపాయ, జీడిపప్పును పేస్టు చేసి వేయాలి.
  4. ఇప్పుడు పచ్చి బొప్పాయి పేస్టు, లవంగాల పొడి వేసి బాగా కలియబెట్టుకోవాలి.
  5. నెయ్యి రాసిన కవర్‌ కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
  6. తరువాత మటన్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న వడల మాదిరిగా ఒత్తుకుని రెండు వైపులా(గ్రిల్‌) కాల్చాలి. 
  7. షెర్మన్‌తో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


పచ్చి బొప్పాయిలో

  1. క్యాలరీలు 43
  2. ఫ్యాట్‌ 0.3గ్రా
  3. ప్రొటీన్‌ 0.5గ్రా
  4. కార్బోహైడ్రేట్లు 11గ్రా


పనీర్‌ దమ్‌ రోల్‌


కావలసినవి

పనీర్‌ - ఒకకేజీ, క్యాబేజీ - ఒక కేజీ, పచ్చి బఠాణీ - 100గ్రా, కారం - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, కశ్మీరీ కారం - 30గ్రా, పచ్చిమిర్చి - 50గ్రా, నూనె - 200గ్రా, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ - 100గ్రా, రవ్వ - 100గ్రా, జున్ను - 250గ్రా, నెయ్యి - 150గ్రాములు.


తయారీ విధానం

  1. పనీర్‌ని వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  2. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, బఠాణీ వేసి వేగించాలి.
  3. కాసేపు వేగిన తరువాత తరిగిన క్యాబేజీ వేయాలి. నీరు ఇగిరిపోయేంత వరకు చిన్నమంటపై ఉడికించాలి.
  4. ఇప్పుడు కారం, రవ్వ, కశ్మీరీ కారం వేసి మరికాసేపు వేగించుకుని దింపాలి.
  5. మిశ్రమం చల్లారిన తరువాత జున్ను వేసి కలియబెట్టుకోవాలి.
  6. ఈ మిశ్రమాన్ని పనీర్‌ మధ్యలో పెట్టి రోల్‌ చేసి ఫ్రిజ్‌లో గంటపాటు పెట్టుకోవాలి.
  7. తరువాత బయటకు తీసి బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకోవాలి.
  8. స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రోల్స్‌ను అన్ని వైపులా కాల్చాలి.
  9. చివరగా ధనియాల పొడి చల్లుకుని వేడి వేడిగా వడ్డించాలి.


పనీర్‌లో...

క్యాలరీలు 293

ఫ్యాటీ 25గ్రా

ప్రొటీన్‌ 14గ్రా

కార్బోహైడ్రేట్లు 2.97గ్రా



అంబ్రే షియా ముర్గ్‌

కావలసినవి

చికెన్‌ (బోన్‌లెస్‌) - ఒకకేజీ, పెరుగు - 150గ్రా, నిమ్మరసం - 10ఎంఎల్‌, అల్లం వెల్ల్లుల్లి - 50గ్రా, జీలకర్ర పొడి - 10గ్రా, గరంమసాలా - 15గ్రా, కశ్మీరీ కారం - 50గ్రా, ఉప్పు - రుచికి తగినంత.


గ్రేవీ తయారీ కోసం 

నూనె - 200 ఎం.ఎల్‌, ఉల్లిపాయ - 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 15గ్రా, జీలకర్రపొడి - 15గ్రా, పసుపు - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, మెంతి - 5గ్రా, టొమాటో ప్యూరీ - 50గ్రా, జీడిపప్పు - 50గ్రా, వెన్న - 25గ్రా, కొత్తిమీర - 25గ్రాములు.


తయారీ విధానం

  1. చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
  2. తరువాత పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, గరంమసాలా, కశ్మీరీ కారం వేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  3. ఓవెన్‌ను ముందుగానే 260 డిగ్రీసెల్సియస్‌లో హీట్‌ చేసుకోవాలి. 
  4. ట్రేపై గ్రీస్‌ పేపర్‌ వేసి మారినేట్‌ చేసిన చికెన్‌ పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
  5. గ్రేవీ తయారీ కోసం స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. 
  6. జీలకర్రపొడి, పసుపు, ధనియాల పొడి, కశ్మీరీ కారం, మెంతి ఆకులు, గరంమసాలా వేసి కలపాలి.
  7. పావు గంటపాటు వేగించిన తరువాత టొమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్టు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
  8. ఈ గ్రేవీలో చికెన్‌ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
  9. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి.



వందగ్రాముల చికెన్‌లో పోషకవిలువలు


  1. క్యాలరీలు 239
  2. ఫ్యాట్‌ 14గ్రా
  3. ప్రొటీన్‌ 27గ్రా
  4. కార్బోహైడ్రేట్లు 0


మటన్‌ లుక్మీ

కావలసినవి

మటన్‌ కీమా - 200గ్రా, ఉల్లిపాయలు - 20గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 10గ్రా, కారం - 15గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, పసుపు - 5గ్రా, నూనె - 400ఎంఎల్‌, మైదా - 100గ్రా, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 15గ్రా, నెయ్యి లేదా డాల్డా - 25గ్రా.


తయారీ విధానం

  1. మటన్‌ కీమాలో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి.
  2. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  3. తరువాత మారినేట్‌ చేసుకున్న మటన్‌ వేసి చిన్నమంటపై ఉడికించాలి.
  4. ధనియాల పొడి, గరంమసాల చల్లి దింపాలి.
  5. ఇప్పుడు ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని అందులో నెయ్యి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
  6. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి.
  7. మధ్యలో మటన్‌ మిశ్రమం పెట్టి మరో లేయర్‌తో మూసేయాలి. నీళ్లు అద్దుతూ చివరలు మూయాలి.
  8. వీటిని చిన్నమంటపై నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.
  9. వేడి వేడిగా తింటే మటన్‌ లుక్మీ రుచిగా ఉంటుంది.



మటన్‌లో..

  1. క్యాలరీలు 234
  2. ఫ్యాట్‌ 11గ్రా
  3. ప్రొటీన్‌ 33గ్రా
  4. కార్బోహైడ్రేట్లు 0.1గ్రా





విక్రమ్‌ సింహ

కార్ప్ చెఫ్‌, ఓహ్రిస్‌

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST