Abn logo
Feb 25 2021 @ 01:01AM

వ్యాన్‌ రాదు.. సరుకు అందదు!

నెల ముగుస్తున్నా పంపిణీకాని రేషన్‌ సరకులు

రేషన్‌ బండి కోసం కార్డుదారుల ఎదురుచూపులు

పట్టణంలో ఆరు డిపోల్లో ప్రారంభంకాని ప్రక్రియ

మండలమంతా ఇదే దుస్థితి.. ఆందోళనలో లబ్ధిదారులు


చోడవరం, ఫిబ్రవరి 24: ఇంటి వద్దకే కోటా సరకులు రాలేదు.. వ్యాన్‌ వస్తుందో, రాదో తెలీదు.. పోనీ ఎక్కడుందో సమాచారం ఉండదు.. రేషన్‌ దుకాణానికి వెళ్లినా ఫలితం లేదు.. ఇదీ ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ దుస్థితి. నెల ముగిసిపోతున్నా మండలంలోని సగానికిపైగా డిపోల పరిధిలో కోటా అందించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మండలంలోని 32 పంచాయతీల్లో 53 డిపోలు ఉన్నాయి. చాలా డిపోలలో నెలాఖరు వచ్చినా ఇంకా కోటా సరకుల పంపిణీ ప్రారంభం కాలేదు. మండల కేంద్రంలో కూడా ఆరు డిపోల పరిధిలో ఇప్పటికీ లబ్ధిదారులకు సరుకులు అందలేదు. 3, 6, 7, 8, 10, 46 డిపోల పరిధిలో ఇప్పటికీ సరుకులు పంపిణీ కాలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు సరకుల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండడంతో వారంతా రేషన్‌ సరకుల కోసం పనులు మానుకుని మరీ ఎదురుచూడాల్సి వస్తోంది. 

ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే వాహనాలు రంగంలో దిగడంతో  కార్డుదారులంతా తమ ఇంటి ముంగిటకు రేషన్‌ సరకులు వచ్చేస్తాయని ఎంతో సంబరపడ్డారు. తీరా రోజులు గడచినా సరకులు కాదు కదా కనీసం రేషన్‌ సరకులు ఇచ్చే వాహనం కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు అయోమయంలో మునిగిపోయారు. సరకుల పంపిణీ జరిగిన డిపోల్లో సైతం 70 శాతం మందికి సరకులు అందకపోవడం విశేషం. 


14 పంచాయతీల్లో మొదలుకాని ప్రక్రియ

చోడవరంలో పరిస్థితి ఇలా ఉంటే, మండలంలోని 14 పంచాయతీల్లో బుధవారం నాటికి కూడా సరకుల పంపిణీ ప్రారంభం కాలేదు. నరసయ్యపేట, జన్నవరం, బెన్నవోలు, జన్నవరం, తిమ్మనపాలెం, ఎం.కొత్తపల్లి, దామునాపల్లి, లక్ష్మీపురం, నరసాపురం, గ..జపతినగరం, జి.జగన్నాథపురం, గంధవరం, అంభేరుపురం, శ్రీరాంపట్నం గ్రామాల్లో ఇంకా రేషన్‌ పంపిణీ మొదలుకాని దుస్థితి ఉంది. 


Advertisement
Advertisement
Advertisement