నిర్లక్ష్యానికి మూల్యం..!

ABN , First Publish Date - 2021-07-26T07:05:38+05:30 IST

కరువుకు ఆలవాలమైన జిల్లాకు వచ్చే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాల్సిన పాలకులు అనాలోత చర్యలతో వస్తున్న జలాలను సైతం వృథా చేస్తున్నారు.

నిర్లక్ష్యానికి మూల్యం..!
ఎత్తేసిన ఎస్కెప్‌ చానల్‌



హెచ్చెల్సీ జలాలు వృథా

500 క్యూసెక్కుల నీరు వంక పాలు

తెగిపోయిన రెండు గ్రామాల లింకు రోడ్డు

కాడా పనుల నిర్వహణలో అలసత్వం

నిధులు విడుదల కావని పనులు చేయని కాంట్రాక్టర్‌

పాలకులు, అధికారుల వైఖరితో నష్టపోతున్న రైతులు

రాయదుర్గం, జూలై 25 : కరువుకు ఆలవాలమైన జిల్లాకు వచ్చే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాల్సిన పాలకులు అనాలోత చర్యలతో వస్తున్న జలాలను సైతం వృథా చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్య ధోరణి, అధికారులు ఉదాసీనత వెరసి హెచ్చెల్సీ జలాలు వృథా అయ్యాయి. జిల్లాలో తాగు, సాగునీటికి ప్రాణాధారమైన హెచ్చెల్సీ నీరు 500 క్యూసెక్కులను ఆదివారం వృథాగా వాగుకు వదిలేశారు. దీంతో హెచ్చెల్సీకి నీరు విడుదల చేస్తారనే ఆశతో ఉన్న జిల్లా రైతులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. హెచ్చెల్సీ నిర్వహణ ఈ ఏడాది భారంగా ఉంటుందని ముందు నుంచి అధికారులు గగ్గోలు పెడుతున్నా వారి మాటలను సర్కారు పెడచెవిన పెట్టింది. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో అందవనే నెపంతో ఏడాది కిందట మంజూరైన పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు వేసి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది హెచ్చెల్సీ జలాలను పీఏబీఆర్‌ వరకు సరఫరా చేయాల్సి ఉండగా ఈ ఏడాది చేయలేనని ఓ అధికారి సెలవులో వెళ్లి పోయినట్లు సమాచారం. దీంతో అత్యవసరంగా చేయాల్సిన పనులు ఆలస్యంగా మొదలుపెట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా అధికారుల్లో ముందు చూపు లేకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడంతో పదిహేను రోజులు ఆలస్యంగా నీటిని తీసుకోవాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురైంది. కర్ణాటకతో పాటు జలాలను తీసుకోవడానికి కాలువ సహకరించకపోవడంతో ఆరు రోజులు ఆలస్యంతో తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో కర్ణాటక తన వాటా నీటిని తీసుకుంటుండగా ఆంధ్రా మాత్రం జలాలను తీసుకోవడంలో నత్తతో పోటీ పడాల్సి వస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


డిస్ట్రిబ్యూటరీలు మూసి వేసి ఎస్కేప్‌ల ఎత్తివేత 

ఆంధ్రా సరిహద్దులోని 105 కిలోమీటరు వద్ద హెచ్చెల్సీ జలాలు జిల్లాలో ప్రవేశించి కాలువలో ప్రవహిస్తుండగా ఎస్కేప్‌ చానల్‌ ద్వారా హగరి నదికి వృథాగా వదిలేశారు. రోజుకు 500 క్యూసెక్కుల ప్రకారం రెండు రోజుల పాటు పుష్కలంగా నీటిని వాగుకు వదిలేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. కాగా కణేకల్లు చెరువు వరకు ఉన్న డిస్ర్టిబ్యూటరీ కాలువలను మాత్రం  పూర్తిగా మూసి వేశారు. కనీసం జలాలను ఆయకట్టుకు వదిలి ఉంటే కొంత వరకు సద్వినియోగం అయ్యేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక జలాలు చొరబడి రావడంతో అవి పనికి రావనే భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. రెండురోజుల అనంతరం సరిహద్దులో అధికారికంగా ఆంధ్రా వాటా నీరు వచ్చినప్పటికీ ఎస్కేప్‌ చానళ్లను మాత్రం తెరిచే ఉంచారు. ఆదివా రం మధ్యాహ్నం వరకు నీటిని వాగులోకి మళ్లించారు. దీంతో ఒక్కసారిగా వాగులో ఉధృతంగా ప్రవహించిన నీరు రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డును తెంచేసింది. డీ.హీరేహాళ్‌ మండలంలోని తిమ్లాపురం, నాగలాపురం గ్రామాల నుంచి ఉద్ధేహాళ్‌కు వెళ్లే దారి పూర్తిగా తెగి పోయింది. 


కాడా నిధులతో పనులు చేయించలేని పరిస్థితి

హెచ్చెల్సీలో నీటి పారుదలకు అవసరమైన పనులను యుద్ధప్రాతిపదికన చేయటం కోసం గతేడాది ఏప్రిల్‌లో కాడా(కమాండ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ) నిధులు మంజూరయ్యాయి. కాలువలో గత ఏడాది నీటి పారుదల నిలిచిపోయాక పనులను చేయాలి. అయితే గతేడాదితోపాటు ఈ ఏడాది కూడా పనులను అరకొరగా నిర్వ హించి చేతులు దులుపుకున్నారు. కాడా కింద చేపట్టిన పనుల్లో కొన్నింటికి ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. దీంతో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు చేసిన పనులకే డబ్బులు రావడం లేదనే భావనతో చేయాల్సిన పనులను చేయకుండా మిన్నకుండిపోయారు. కాడా కింద రూ. ఆరు లక్షల నిధులతో చేయాల్సిన కణేకల్లు చెరువులోని అవుట్‌ లెట్‌ షట్టర్ల మరమ్మతులు మరుగునపడి పోయాయి, వాటిని మరమ్మతులు చేయపోతే దిగువన పీఏబీఆర్‌కు నీరు మళ్లించలేని పరిస్థితి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అధికారులు కాంట్రాక్టర్‌ను పనులు చేయమని బతిమాలుతున్నట్టు సమాచారం. నీటి విడుదల సమయం దగ్గరపడే కొద్దీ అధికారుల్లో టెన్షన్‌ మొదలయ్యింది. షెట్టర్లు మరమ్మతు చేయిస్తే కానీ నీటిని సరఫరా చేయలేమని వారు చెప్పినట్టు తెలిసింది. చివరకు ఓ అధికారి ఈ ఏడాది నీటి సరఫరా చేయలేమని చేతులెత్తేసి సెలవులో వెళ్లినట్లు సమాచారం. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కనీసం కణేకల్లు షెట్టర్ల పనులు చేస్తే చాలని కాంట్రాక్టర్లను ఒప్పించి వారం కింద పనులు మొదలు పెట్టించినట్లు సమాచారం. అప్పటికే కర్ణాటక తన వాటా నీటిని హెచ్చెల్సీ ద్వారా తీసుకోవడం మొదలుపెట్టింది. 


 ఈ సారి కూడా ఆలస్యమే 

తుంగభద్ర ఎగువ  కాలువ నుంచి జిల్లాకు రావాల్సిన జలాలు రెండేళ్లుగా ఆలస్యంగా అందుతున్నాయి. ఎగువ కాలువలో నీటిని సరఫరా చేసేందుకు ఏమాత్రం అనుకూల వాతావారణం లేదు. దీంతో యుద్ధప్రాతిపదికన చేయాల్సిన పనులు చేపట్టడంలో జాప్యం చేయడమే అందుకు కారణం గతేడాది 134 కిలోమీటరు వద్ద నిర్మాణం పూర్తి చేసేందుకు పదిహేను రోజుల పాటు  శ్రమించాల్సిన పరిస్థితి. దీంతో పదిహేను రోజులు ఆలస్యంగా నీరు తీసుకోవాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురయ్యింది. నీటి సరఫరా కాలువలో నిలిచిపోయిన వెంటనే చేపట్టాల్సిన పనులను చేయించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అటు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, ఇటు పాలకులు కన్నెత్తి చూడకుండా ఉండటం, పైగా బాధ్యతతో కాలువ పరిస్థితి సమీక్షించాల్సిన ప్రజాప్రతినిధులు హెచ్చెల్సీని గాలికి వదిలేయడంతో అగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది.  కేసీ కెనాల్‌ వాటా నీటిని మళ్లించుకునేందుకు ఆలస్యంగా జలాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆపాటికే జలాశయంలో హెచ్చెల్సీకి అందాల్సిన స్థాయిలో నీటి మట్టం పడిపోతోంది. దీంతో అందిన కాటికి అందినంత అంటూ వచ్చిన జలాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అధికారులు పాలకులు సమన్వయంతో కాలువపై పర్యవేక్షించి, సమీక్షిస్తే ఇ లాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా జిల్లాకు రావాల్సిన నీటి కోటా సక్రమంగా అందుతుందని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-07-26T07:05:38+05:30 IST