భారత్‌కు నచ్చజెప్పేందుకు కృషి : అమెరికా

ABN , First Publish Date - 2022-03-03T19:30:06+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని

భారత్‌కు నచ్చజెప్పేందుకు కృషి : అమెరికా

వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని భారత దేశాన్ని కోరేందుకు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తోందని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ చెప్పారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోనీ బ్లింకెన్ ఈ కృషిలో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ సబ్ ప్యానల్‌‌‌కు ఈ వివరాలను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెలిపారు. 


లూ మాట్లాడుతూ, ఉక్రెయిన్ సంక్షోభంపై అవిశ్రాంతంగా భారత దేశంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కృషిలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోనీ బ్లింకెన్ ముందు వరుసలో ఉన్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని ఇతర సీనియర్ అధికారులు అత్యున్నత స్థాయిలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 


భారత దేశం తన వైఖరిని వివరించేటపుడు ముఖ్యంగా రెండు విషయాలపై దృష్టి పెడుతోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణకు దౌత్య పరిష్కారం లభించాలని కోరుకుంటుండటంపైనా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 18 వేల మంది విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంపైనా దృష్టి పెడుతోందని చెప్పారు. 


భారత్‌పై అమెరికన్ సెనేటర్ల విమర్శలు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను విమర్శించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఓటింగ్ నుంచి బుధవారం గైర్హాజరైన 35 దేశాల్లో భారత దేశం ఉండటంపై అమెరికన్ చట్టసభల సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా-భారత దేశం మధ్య సంబంధాలపై సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ హియరింగ్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు భారత దేశాన్ని తీవ్రంగా విమర్శించారు. 


సమష్టి స్పందనకు చాలా ప్రాధాన్యం

ఈ విమర్శలపై లూ స్పందిస్తూ, రష్యాకు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించాలని భారత్‌ను కోరేందుకు తామంతా అన్ని విధాలుగానూ కృషి చేస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని  సమష్టిగా ఖండిస్తూ స్పందించడానికి ఎంత ప్రాధాన్యముందో గట్టిగా నొక్కి వక్కాణించడం కోసం భారత దేశంతో అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిరంతరం చర్చిస్తోందని చెప్పారు. చిన్న చిన్న అడుగులు వేస్తున్నామని, అమెరికా, భారత దేశం ప్రదర్శిస్తున్న వైఖరుల మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించడం కోసం ప్రతి రోజూ కృషి చేస్తున్నామని తెలిపారు. 


మార్పు కనిపిస్తోంది

రష్యాపై భారత దేశం స్పష్టమైన వైఖరిని నిర్ణయించుకోకపోయినప్పటికీ, ఇటీవలి కాలంలో కొంత మార్పు కనిపిస్తోందని అమెరికా భావిస్తోందన్నారు. ఉక్రెయిన్‌కు మానవతావాద సాయాన్ని పంపిస్తామని భారత్ చెప్పిందన్నారు. ఇది చాలా ముఖ్యమైనదన్నారు. ఉక్రెయిన్ నాయకత్వం దీనిని కోరుకుంటోందన్నారు. ఐక్య రాజ్య సమితి చార్టర్‌ను అన్ని దేశాలు గౌరవించాలని ఐరాస సమావేశంలో భారత్ పిలుపునిచ్చిందన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిచ్చిందని చెప్పారు. ఇది రష్యాను విమర్శించడం కాకపోయినప్పటికీ, ఐరాస చార్టర్‌ను, ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘించిందని స్పష్టంగా చెప్పినట్లేనన్నారు. 


ఐరాస సాధారణ సభలో...

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండించే తీర్మానంపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో జరిగిన ఓటింగ్‌లో 141 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, ఐదు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత దేశంతో సహా 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. 


Updated Date - 2022-03-03T19:30:06+05:30 IST