భారత్ సంశయిస్తే చైనాకు బుద్ధి చెప్పే యత్నాలకు విఘాతం : అమెరికా

ABN , First Publish Date - 2020-10-30T16:56:09+05:30 IST

భారత్-అమెరికా మధ్య స్నేహ బంధం గట్టి పడింది. సామ్రాజ్యవాద చైనాను

భారత్ సంశయిస్తే చైనాకు బుద్ధి చెప్పే యత్నాలకు విఘాతం : అమెరికా

న్యూఢిల్లీ : భారత్-అమెరికా మధ్య స్నేహ బంధం గట్టి పడింది. సామ్రాజ్యవాద చైనాను నిలువరించడంలో భారత దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తామని అమెరికా తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో ఘర్షణ సృష్టిస్తున్న చైనాకు గుణపాఠం చెప్పడంలో వెనుకాడవద్దని భారత్‌కు స్పష్టంగా చెప్పింది. ఇరు దేశాల మధ్య సహకారం, సంఘీభావాలు పెరగడానికి ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌ మరింత దోహదపడింది. 




మంగళవారం జరిగిన ఇండో-యూఎస్ 2+2 మినిస్టీరియల్ డయలాగ్‌‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో, అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పర్ పాల్గొన్నారు. ఈ చర్చల్లో భారత్‌కు గట్టి సంఘీభావాన్ని అమెరికా ప్రకటించినట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) విసురుతున్న సవాలును ఎదుర్కొనడంలో భారత్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని మైక్, మార్క్ చెప్పినట్లు సమాచారం. చైనా సామ్రాజ్యవాదం, విస్తరణవాదాలను తిప్పి కొట్టడంలో భారత్ సంశయిస్తే, చైనాకు బుద్ధి చెప్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు.




మైక్ పొంపియో వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ద్వైపాక్షిక అంశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు ఉద్రిక్తతలపై భారత దేశంతో జరుపుతున్న చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోందని, మూడో పక్షం అవసరం లేదని చైనీస్ ఫారిన్ ఆఫీస్ స్పష్టం చేసింది. 




ఇదిలావుండగా, వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో చైనా, భారత్ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. పాంగాంగ్ సో నుంచి ఖాళీ చేయాలని భారత్‌ను చైనా కోరుతుండగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాల ఉపసంహరణ జరగాలని మన దేశం కోరుతోంది.


Updated Date - 2020-10-30T16:56:09+05:30 IST