రష్యా జీవాయుధాలను వాడబోతోంది : జో బైడెన్

ABN , First Publish Date - 2022-03-23T00:15:59+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో భాగంగా జీవ, రసాయనిక ఆయుధాలను

రష్యా జీవాయుధాలను వాడబోతోంది : జో బైడెన్

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై యుద్ధంలో భాగంగా జీవ, రసాయనిక ఆయుధాలను రష్యా ప్రయోగించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అసలు బాధ్యతను మరుగుపరచి, వేరొకరిపై నిందలను మోపే ఉద్దేశం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మాటల్లో కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు బైడెన్ చేసిన హెచ్చరికల్లో ఇది చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. 


ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఇప్పుడు కొత్త తరహా నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని బైడెన్ అన్నారు. తన బాధ్యతను మరుగుపరచి, ఇతరులపై ఆరోపణలు గుప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. యూరోపులో అమెరికాకు జీవ, రసాయనిక ఆయుధాలు ఉన్నాయని పుతిన్ చెప్తున్నారన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పారు. ఉక్రెయిన్‌లో జీవ, రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారన్నారు. దీనినిబట్టి ఈ రెండిటిని ప్రయోగించేందుకు పుతిన్ ఆలోచిస్తున్నారని స్పష్టమవుతోందని తెలిపారు. 


ఇదిలావుండగా, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి చర్చించడానికి తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. రష్యాకు అసంతృప్తి కలిగించిన అంశాల గురించి వినడానికి తాను సిద్ధమేనన్నారు. అదే విధంగా ఉక్రెయిన్ ప్రజల ఆలోచనలన్నిటినీ తాను పుతిన్‌కు వివరిస్తానని చెప్పారు. అన్ని సమస్యలను పరిష్కరించడం సాద్యం కాకపోవచ్చునని, కనీసం యుద్ధాన్ని ఆపగలిగే అవకాశం రావచ్చునని తెలిపారు. తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించబోమని తెలిపారు. అయితే రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ విలేకర్లతో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో కొంత వరకు చర్చలు జరుగుతున్నాయని, ప్రక్రియ కొనసాగుతోందని, మరింత క్రియాశీలక, సారవంతమైన చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.


మరోవైపు ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంలో వీథి పోరాటాలు నిరాఘాటంగా జరుగుతున్నాయని ఆ దేశ ఎంపీ లెసియా వసిలెంకో ఓ ట్వీట్‌లో తెలిపారు. తాగేందుకు నీరు లేదని, మంచు కరిగిపోతోందని తెలిపారు. నగరంలో లక్ష మందికిపైగా ప్రజలు చిక్కుకున్నారని, కీవ్ నగరానికి వెళ్ళే రోడ్లన్నీ మందుపాతరలతో నిండిపోయాయని పేర్కొన్నారు. 


బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని వారాల నుంచి బాంబులను కురిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ నౌకాశ్రయ నగరం మరియుపోల్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి. 


Updated Date - 2022-03-23T00:15:59+05:30 IST