మహాత్మాగాంధీపై అధ్యయనం.. బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికా ప్రతినిధుల సభ

ABN , First Publish Date - 2020-12-05T22:37:33+05:30 IST

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ‘హెచ్.ఆర్. 5517: గాంధీ-కింగ్

మహాత్మాగాంధీపై అధ్యయనం.. బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికా ప్రతినిధుల సభ

అట్లాంటా: మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ‘హెచ్.ఆర్. 5517: గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్స్ఛేంజ్ ఇనీషియేటివ్ యాక్ట్’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ గురువారం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌ పరిశీలనకు పంపారు. అమెరికన్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు, మానవ హక్కుల నిపుణుడు దివంగత జాన్ లూయిస్ ఈ బిల్లును రూపొందించారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌‌లపై అధ్యయనం చేయడమే లక్ష్యంగా జాన్ లూయిస్ ఈ చట్టాన్ని తయారుచేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రతి ఏడాది వార్షిక ఎడ్యుకేషనల్ ఫోరమ్‌ను ఏర్పాటు చేస్తారు. అమెరికా-భారత్‌కు చెందిన పండితులు, విద్యావంతులు ఈ ఫోరమ్‌లో పాల్గొని గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌లపై అధ్యయనం చేసేందుకు పనిచేస్తారు. 


అంతేకాకుండా ఘర్షణలకు సంబంధించిన అంశాలను అహింసా మార్గాల ద్వారా ఎలా పరిష్కరించాలన్న దానిపై శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా-భారత్‌ల మధ్య సాన్నిహిత్యం మరింత బలపడనుంది. ఈ బిల్లును రూపొందించిన జాన్ లూయిస్ ఈ ఏడాది మొదట్లో అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ల గురించి మాట్లాడుతూ.. ‘వారిద్దరూ రాజకీయ నాయకులు కాదు. చట్టసభ సభ్యులూ కాదు. దేశాధ్యక్షులుగా కూడా పనిచేయలేదు. కానీ అహింసా మార్గంలో పోరాటం చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలనే ప్రేరణను ఎంతో మందికి కలిగించారు. 


వీరిద్దరి కృషి, ఐడియాలు అమెరికా, భారత్‌లను ఎంతగానో మార్చాయి. వీరి సేవలు మనకు ఎంతో లాభాన్ని కలిగించాయి. గాంధీ-మార్టిన్ లూథర్ కింగ్‌ల గురించి బోధించకుంటే నేను ఈరోజు ఎక్కడ ఉండేవాడినో నాకే తెలీదు’ అని చెప్పారు. గాంధీ-మార్టిన్ లూథర్ కింగ్‌లపై అధ్యయనం చేసేందుకు రానున్న ఐదేళ్ల కాలానికి 150 మిలియన్ డాలర్లను బడ్జెట్‌లో కేటాయించాల్సిందిగా జాన్ లూయిస్‌ బిల్లులో కోరారు.

Updated Date - 2020-12-05T22:37:33+05:30 IST