Sri Lanka-America : శ్రీలంకలో నిరసనకారులపై కఠిన చర్యలు... అమెరికా ఆందోళన...

ABN , First Publish Date - 2022-07-22T17:30:09+05:30 IST

నిరసనకారులపై శ్రీలంక (Sri Lanka) భద్రతా దళాల చర్యలను

Sri Lanka-America : శ్రీలంకలో నిరసనకారులపై కఠిన చర్యలు... అమెరికా ఆందోళన...

కొలంబో : నిరసనకారులపై శ్రీలంక (Sri Lanka) భద్రతా దళాల చర్యలను ఆ దేశంలోని అమెరికన్ రాయబారి (American Ambassador )  జూలీ చున్ (Julie Chun) తీవ్రంగా ఖండించారు. గల్లే ఫేస్‌ (Galle Face)లో నిరసనకారులపై గురు-శుక్రవారాల మధ్య రాత్రి సైన్యం విరుచుకుపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సంయమనం పాటించాలని, గాయపడిన నిరసనకారులకు తక్షణం వైద్య చికిత్స అందజేయాలని కోరారు. 


జూలీ చున్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, గల్లే ఫేస్ వద్ద అర్ధ రాత్రి నిరసనకారులపై చేపట్టిన చర్యలు తీవ్ర ఆందోళనకరమని తెలిపారు. అధికారులు సంయమనం పాటించాలని, గాయపడినవారికి తక్షణమే వైద్య చికిత్స చేయించాలని కోరారు. 


శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు వ్యతిరేకంగా కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ప్రాంగణం వెలుపల నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వీరిని నియంత్రించేందుకు భద్రతా దళాలు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. దీంతో నిరసనకారులు, సైన్యం మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాము ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని రాత్రివేళలో సైన్యం తొలగించిందని నిరసనకారులు ఆరోపించారు. రణిల్ విక్రమసింఘే తమను నాశనం చేయాలనుకుంటున్నారని, కానీ తాము తమ నిరసనను విడిచిపెట్టబోమని చెప్పారు. ఇటువంటి దుష్ట రాజకీయాల నుంచి తమ దేశాన్ని విముక్తి చేస్తామని చెప్పారు. 


రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) శ్రీలంక నూతన అధ్యక్షునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూరియ ఆయన చేత పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటులో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచారు. 


Updated Date - 2022-07-22T17:30:09+05:30 IST