కూలి భారం

ABN , First Publish Date - 2020-07-07T10:22:29+05:30 IST

గ్రామాల్లో కూలీ రేట్లు పెరిగాయి. కూలీల కొరత కూడా దీనికి కారణం. దీంతో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. పత్తి, కంది, వేరుశనగ,

కూలి భారం

పల్లెల్లో దొరకని కూలీలు

పట్టణ  కూలీలు పల్లెలకు

ఒక్కొక్కరికి రూ.300-500 

పెరిగిపోతున్న పెట్టుబడి 


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 6: గ్రామాల్లో కూలీ రేట్లు పెరిగాయి. కూలీల కొరత కూడా దీనికి కారణం. దీంతో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. పత్తి, కంది, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలను వర్షాధారంగా సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. విత్తనం వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 6.22 లక్షల హెక్టార్లలో పంటలు కావాల్సి ఉంది.


ఇందులో లక్షన్నర హెక్టార్లలో పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి వానజల్లులకు కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందులు పిచికారీ వంటి పనులు ఒకేసారి ఊపందుకున్నాయి. రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరగనుంది. అయితే కూలీల కొరత ఏర్పడింది. సకాలంలో కలుపు తీయకుంటే పంటలకు చీడ పీడల బెడద ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొందరు రైతులు కలుపు తీసేందుకు సమీప పట్టణాల నుంచి అధిక కూలికి మనుషులను పిలిపించుకోడానికి సిద్ధమయ్యారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారింది. 


పట్టణ కూలీలపైనే ఆధారం

కరోనా వల్ల కొందరు కూలీలు పనులకు సిద్ధం కావడం లేదు. దీనికితోడు గ్రామాల్లో ఒకేసారి ఖరీఫ్‌ పనులు ఊపందుకున్నాయి. కూలి పనులకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. కొన్ని పొలాల్లో విత్తనాలు వేయడం, సాగు చేసిన పొలాల్లో కలుపు తీయడం, ఎరువు వేయడం వంటి పనులకు అదును దాటిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక్కో కూలీకి రూ.200ల వరకు ఇచ్చేవారు. ఈసారి మాత్రం రూ.300 - 500 ఇస్తేనే కూలీలు వస్తామని అంటున్నారు. అప్పు చేసి అడిగినంత ఇద్దామన్నా అవసరమైనంత మంది కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో గ్రామాలకు సమీపంలోని పట్టణాల నుంచి ఆటోల్లో కూలీలను తీసుకువచ్చేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. పట్టణాల్లో ఉపాధి దొరకని నిరుపేదలు వ్యవసాయ పనుల కోసం పల్లెలకు వస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో పని దొరక్క పట్టణాలకు పరుగులు తీసేవారు. ఈ సీజన్‌లో మాత్రం పట్టణ పేదలు పల్లెల్లో వ్యవసాయ పనులు చేయడానికి వస్తున్నారు. 


పెరిగిపోతున్న ఖర్చులు

సాధారణంగా గ్రామాల్లో సీజన్‌ బట్టి కూలీ రేట్ల ఉంటాయి. గతంలో రూ.150 నుంచి రూ.200 ఇచ్చేవారు. ప్రస్తుతం కూలీల కొరత పెరగడంతో ఒక్కో కూలీకి రూ.300-500 చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా తగినంత మంది కూలీలు దొరక్కపోవం వల్ల రైతులు తెల్లవారుజామునే సమీపంలోని పట్టణాలకు వచ్చి ఆటోలను ఏర్పాటుచేసుకుని లేబర్‌ కాలనీల్లో కూలీలను మాట్లాడుకుని గ్రామాలకు తీసికెళుతున్నారు. రానుపోను ఈ ఆటో చార్జీలు కూడా రైతులే భరించాల్సి వస్తోంది. దాదాపు 50కి.మీల దూరంలో ఉన్న గ్రామాలకు కూడా పట్టణ కూలీలు వెళ్తున్నారు. ఈ ఖర్చులన్నీ కలిసి రైతులకు వ్యవసాయం భారంగా మారింది. ఇంత ఖర్చుపెట్టి పంట పండిస్తే చివరికి గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఉపాధి హామీకి అనుసంధానం చేస్తేనే..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సొంత గ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు నిధులను కూడా పెద్ద ఎత్తున కేటాయించింది. అయితే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి రైతులకు బాసటగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నామ మాత్రంగానే పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులన్నీ ఉపాధి హామీ ద్వారా చేపట్టేలా నిబంధనలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. తద్వారా వ్యవసాయ పనులన్నింటికీ ఉపాధి ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. 


ఉపాధి హామీతో ఆదుకోవాలి

 కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. దీని వల్ల రైతులకు వ్యవసాయం భారంగా మారదు. ప్రస్తుతం అవుతున్న పెట్టుబడి ఖర్చుల్లో సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంది. 

-జగన్నాథం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి 


కూలీల కొరతతో విత్తనాలు వేయలేకపోతున్నా

నాకు ఐదెకరాల పొలం ఉంది. వేరుశనగ పంటను సాగు చేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్నా. వానలు కూడా బాగానే పడుతున్నాయి. అయితే కూలీలు దొరక్కపోవడం వల్ల విత్తనాలు వేసేందుకు ఇబ్బందిగా మారింది. 

-చిన్న పెద్దయ్య, కొత్తపల్లి


నామమాత్రంగానే ఉపాధి పనులు 

వలస కూలీలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. కానీ గ్రామాల్లో అవసరమైన ఉపాధి పనులు నామమాత్రంగానే జరుగుతున్నాయి. 

-భాస్కర్‌ రెడ్డి, కొత్తపల్లి



ఖరీఫ్‌లో సాగయ్యే విస్తీర్ణం అంచనా: (హెక్టార్లలో)!


పంట విస్తీర్ణం


పత్తి 2,33,933

వరి 82,754

మొక్కజొన్న 30,738

కందులు 67,628

వేరుశనగ 79,543

ఆముదం 16,863

మిరప 14,772

ఉల్లి 15,274

ఇతర 26,991


మొత్తం 6,22,921

Updated Date - 2020-07-07T10:22:29+05:30 IST