‘ సైబర్‌’ కనుమలో అసత్యసేన

ABN , First Publish Date - 2022-01-21T09:36:54+05:30 IST

స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. వినూత్న సాంకేతికతలు మన సమష్టి శ్రేయస్సుకు నిర్దేశించుకున్న విలువలు, సంప్రదాయాలకు ప్రమాదకారులుగా పరిణమిస్తున్నాయి....

‘ సైబర్‌’ కనుమలో అసత్యసేన

స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. వినూత్న సాంకేతికతలు మన సమష్టి శ్రేయస్సుకు నిర్దేశించుకున్న విలువలు, సంప్రదాయాలకు ప్రమాదకారులుగా పరిణమిస్తున్నాయి. అవును, మన సమున్నత భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం (రిపబ్లిక్ ఆఫ్ ఇండియా) అంతర్జాల పోకిరీ సేన (ఆర్మీ ఆఫ్ ట్రోల్స్) ఆక్రమణకు గురవుతోంది. విద్వేష జాలం, అసత్య ప్రచారం వెల్లువెత్తుతున్నాయి. ఆ పోకిరీల ప్రభావం ఇప్పటికే మన ప్రజా చర్చలను, పౌర సమాజ వాదోపవాదాలను, సామాజిక సంభాషణలను హీనస్థాయికి దిగజార్చింది. భారతీయ జాతీయతకు అపాయం కలిగిస్తోంది. ఒక వంచనా సామ్రాజ్యాన్ని నెలకొలిపే దిశలో చురుగ్గా పురోగమిస్తోంది. ఈ పోకిరీల దండయాత్ర భారత గణతంత్ర రాజ్యానికే కాదు, మన పురానవ నాగరికతకూ ఒక పెనుముప్పు. స్టాండప్ ప్లీజ్!


అంతర్జాల పోకిరీ సైన్యాన్ని సవాల్ చేయవలసిన సమయమిది. ఇదొక విషమ ఘడియ. సంయమనం ఇక చాలు. ప్రతిఘటనను ప్రారంభించి తీరాలి. ఒక సత్య (యోధుల) సైన్యాన్ని సమీకరించాలి. ఆకాంక్ష మాత్రమేనా? కానే కాదు. ఇదిగో ఒక నిర్దిష్ట ప్రతిపాదన. భారత గణతంత్ర రాజ్య సంరక్షకులు అందరూ తమ తమ రాజకీయ విభేదాలు, శత్రుత్వాలను కొనసాగిస్తూనే ఒక లక్ష్యం కోసం ఏకమవ్వాలి. దేశ పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్న రాజకీయ సంస్థ, దాని ఆస్థానికులు, సమస్త సమర్థకులు అలుపు సొలుపు, నదురు బెదురు లేకుండా సత్యాలుగా వ్యాప్తి చేస్తున్న అబద్ధాల బండారాన్ని బద్దలుగొట్టి, నిజాలను వెల్లడించడమే ఆ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఔదలదాల్చిన వారందరూ సంఘటితమవ్వాలి. ఇందుకొక మేధో మండలిని ఏర్పాటు చేసుకోవాలి. సమాజ సంబంధిత ప్రతి విషయాన్ని సులభంగా, సుబోధకంగా తెలియజేసేందుకు ఒక పటిష్ఠ, ప్రభావశీల ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ అంగీకృత యోజనను శక్తిమంతమైన సందేశాలుగా మార్చి, వాటిని ప్రజలకు పంపేందుకు దేశవ్యాప్తంగా ఉత్తమ సృజనశీల ఆలోచనాపరులు అందరినీ ఒక సమైక్య వేదిక మీదకు తీసుకురావాలి. ఆ సందేశాలను పలు మార్గాలలో విభిన్న వేదికల ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ఒక సమర్థ, సృజనశీల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లక్షలాది స్వచ్ఛంద సేవకులతో ఒక సమాహార వ్యవస్థను నెలకొల్పాలి. సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తితో సంధాయకతను సృష్టించుకోవాలి. తల్లి భాషల్లో, ప్రజల పలుకుబడుల ద్వారా సత్యం ప్రతి ఒక్కరి మనస్సుల్లో సుప్రతిష్ఠితమవ్వాలి.


వాస్తవాలను నిశితంగా పరీక్షించవలసిందే. అయితే సత్యం అనేది వాస్తవాల తనిఖీకే పరిమితం కాకూడదు. వాటి ఆవలి వైపునకు వెళ్లి తీరాలి. అప్పుడే సత్యాసత్య వివేచన వికసిస్తుంది. అంతర్జాల పోకిరీ సేన వాస్తవాలను ఖాతరుచేయదు. భయపడదు అని చెప్పడమే సరైన విషయం. కనుక అనుభవజన్య సత్యాలను ఆలంబన చేసుకోవాలి. ప్రజల అనుభవంలోకి వచ్చిన సత్యాలను విశదంగా వెల్లడించేందుకు అవసరమైన మార్గాలను కనుగొనవలసి ఉంది.


సాధారణ వ్యవహారాలు, సుదూర సంఘటనల గురించి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ప్రజల ప్రత్యక్ష అనుభవంలోని వాటిపై అసత్యాలను వ్యాప్తి చేయడం సాధ్యమవుతుందా? సమాధానం స్పష్టమే. ఉదాహరణకు లద్దాఖ్‌లో మన భూభాగాలు కొన్నిటిని చైనాకు కోల్పోయాం. అయితే లద్దాఖ్‌లో అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. ఈ విషయంలో మోదీ సర్కార్ మసకబరిచిన సత్యాలను విస్పష్టంగా వెల్లడించడం అంత తేలికకాదు. అయితే కొత్త ఉద్యోగాల సృష్టి, కొవిడ్ సంక్షోభంలో మృతుల వాస్తవ సంఖ్య విషయమై పాలకుల మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. జనుల వ్యక్తిగత అనుభవాలు ప్రభుత్వ గణాంకాలకు విరుద్ధంగా ఉంటాయి కదా.


వాస్తవాలను నిరూపించడమే సరిపోదు. వాటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని గుర్తించాలి. అప్పుడు అవి మనకు ఒక కొత్త దృక్పథాన్ని సమకూరుస్తాయి. ఫెరోజ్‌పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాణాలకు పెద్ద ప్రమాదమేర్పడిందనే అతిశయోక్తులు ప్రచారమయ్యాయి. ఫెరోజ్‌పూర్ సంఘటనపై, ఆ ఘటన సంభవించిన మరుసటి రోజు వైరల్ అయిన వీడియోలు ఆ అతిశయోక్తుల గుట్టును బయటపెట్టాయి. ఇంతటితో సరిపుచ్చకూడదు. 2002 ఎన్నికలకు ముందు అక్షరధామ్‌పై జరిగిన దాడి నుంచి ఫెరోజ్‌పూర్ ఉదంతం దాకా ఎన్నికల సందర్భంగా సంభవించిన సంఘటనలు అన్నిటినీ నిశితంగా పరిశీలించండి. అవి సంభవించిన తీరులో ఒక రీతి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం అనుభవపూర్వక సత్యాలనే కాదు, భావోద్వేగ సత్యాలను కూడా సంధానం చేయడాన్ని నేర్చుకోవాలి. 


సాయుధ సైన్యానికి వలే సత్య సైన్యానికి కూడా ఒక వ్యూహాత్మక సిద్ధాంతం అవసరం. సత్య సైన్యం సూత్రప్రాయంగా సత్యానికే నిబద్ధమవుతుంది. శక్తిమంతమైన వ్యూహంగా సత్యంపైనే సదా ఆధారపడి ఉంటుంది. అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎంత అననుకూలమైనది అయినప్పటికీ సత్యాన్నే మాట్లాడగల నైతిక ధైర్యం సత్య సైనికుడికి ఉండి తీరాలి. మీరు సత్యమని చెప్పినది స్వతంత్ర, నిష్పాక్షిక పరిశీలనలో కూడా సత్యంగా రుజువు కావాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా సత్యమవుతుంది. అంతర్జాల పోకిరీసేన ప్రతిరోజూ హిందూ–ముస్లిం వ్యవహారాలపై వాదోపవాదాలకు మనలను ఆహ్వానిస్తుంది. మన ప్రతిస్పందన ఏమైనప్పటికీ సమాజంలో ఆ మత వర్గాల వారి మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా చేయడమే ఆ పోకిరీల లక్ష్యం. మరి వారికి మనం విసిరే వ్యూహాత్మక సవాల్ ఎలా ఉండాలి? మన సవాల్‌కు ఆ పోకిరీలు ఆత్మ రక్షణలో పడి తీరాలి. పోరాట క్షేత్రాలను వేరే అంశాలకు మళ్ళించడమే అందుకు మార్గం. ఇదే వారికి మనం విసరగల సరైన సవాల్. సత్య సైన్యం భారతీయ భాషలను ఆలంబన చేసుకోవాలి. ప్రజల నుడికారంలో మాట్లాడాలి. ప్రభావశీల ఆయుధాలుగా హాస్యం, అధిక్షేపం, వ్యంగ్యాన్ని ప్రయోగించాలి. అప్పుడు అబద్ధాల బండారాన్ని బయటపెట్టడం సాధ్యమవుతుంది. ప్రజలకు సత్యం తెలుస్తుంది.


మనం ఇప్పుడు సత్యానంతర ప్రపంచంలో నివశిస్తున్నాం. ఈ కొత్త జగత్తులో సత్యశీల రాజకీయాలకు తావు ఉందా? ఉందని నేను విశ్వసిస్తున్నాను. అంతర్జాల పోకిరీల ప్రచారాన్ని చూస్తే సత్యం విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. లఖింపూర్ ఖేరీ ఘటనపై మీడియా సంపూర్ణ మద్దతుతో జరిగిన ప్రచారాన్ని గుర్తు చేసుకోండి. అయితే నిరసన తెలుపుతున్న రైతుల పైకి కేంద్రమంత్రి సుపుత్రుడు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిర్దాక్షిణ్యంగా కారును నడిపిందీ స్మార్ట్ ఫోన్‌లో నిక్షిప్తమైన దృశ్యాల వీడియో మరుసటిరోజు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన తరువాత జరిగిందేమిటో మీకు తెలుసు. ఎంత దుర్మార్గం జరిగిందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. అలాగే ఇబ్బందికరమైన వాస్తవాలను ఏ ప్రభుత్వమూ ఎంతోకాలం కప్పిపుచ్చలేదు. ఎందుకంటే సత్యమే ముఖ్యం. సత్యమే అత్యంత ప్రభావశీల శక్తి. కొత్త సాగు చట్టాలపై రైతుల ఉద్యమాన్నే చూడండి. మట్టి మనుషుల భావోద్వేగ సంకల్పం ఎండా వానల్లో సైతం వీథుల్లోనే ఉండి తీరేలా చేసింది. చివరకు మోదీ ప్రభుత్వం తన నిర్ణయాలు ఉపసంహరించుకునేలా చేసింది.


సత్య (యోధుల) సైన్యాన్ని ఎక్కడ సమీకరించాలి? మనలో సత్యాన్వేషకులు ఉన్నారా? ఉన్నారు. మెగసెసే అవార్డు గ్రహీత అయిన ప్రముఖ పాత్రికేయుడు రావిష్ కుమార్‌ను సామాజిక మాధ్యమాలలో అనుసరిస్తున్న వారి సంఖ్యను పరిశీలించండి. పెద్ద మీడియా సంస్థలన్నీ అత్యంత గర్హనీయంగా అధికారంలో ఉన్న వారికి లొంగిపోయాయి. దీంతో ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ చిన్న యూట్యూబ్ ఛానెల్స్ ప్రభవించి వర్థిల్లుతున్నాయి. వీటిని అనుసరించే వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా సత్యాన్ని కోరుకుంటున్నారు. సత్యావిష్కరణ జరిగితీరాలని వారు ప్రగాఢంగా అభిలషిస్తున్నారు. రైతుల ఉద్యమమే ఇందుకొక రుజువు. సత్య సమరంలో సైనికులు అయ్యేందుకు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఒక పెద్ద సత్య సైన్యం సత్య సంరక్షణకు సంసిద్ధంగా ఉంది.


సరే, ఈ స్వచ్ఛంద సత్యశీలురను ఒక సైన్యంగా ఎందుకు పిలవాలి? ప్రజాపోరాటాలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నవారు నా ప్రతిపాదనలోని సైనిక ధర్మధోరణికి కలవరపడుతున్నారు. అయితే మహాత్మాగాంధీ జీవిత అంతిమ దశను ఒకసారి గుర్తుచేసుకోండి. దేశ విభజనతో ప్రజ్వరిల్లిన మత విద్వేష హింసాకాండను నివారించేందుకు ఆయన ఏర్పాటు చేసింది శాంతి సేన కాదూ? వాస్తవమేమిటంటే మనం ఇప్పుడు ఒక యుద్ధంలో ఉన్నాం. మన జాతిని, మన నాగరికతను, మన గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న యుద్ధమది. ఈ పవిత్ర యుద్ధాన్ని విజయవంతం చేసేందుకు మీకు ఒక సైన్యం తప్పక అవసరమవుతుంది. అదే సత్య సైన్యం.


తాజా కలం: బహు భాషా కోవిదుడు జీఎన్ దేవీ ఒక భిన్న సూచన చేశారు. నేను ప్రతిపాదించిన ‘ట్రూత్ ఆర్మీ’ (సత్య సైన్యం)ని ‘ట్రోత్ ఆర్మీ’గా పిలవాలని ఆయన అన్నారు. ట్రోత్ అనేది వాడుకలో లేని పదం. దాని అర్థం కోసం నిఘంటువు చూశాను. ప్రమాణం, ప్రతిజ్ఞ, వాగ్దానం అనే అర్థాలు కనిపించాయి. భారత స్వాతంత్ర్యం 75వ వసంతంలో ‘భవిష్యత్తుతో మన సమష్టి సమాగమానికి’ ఒక ట్రోత్ సైన్యం అవసరం చాలా ఉంది.


యోగేంద్ర యాదవ్

Updated Date - 2022-01-21T09:36:54+05:30 IST