అణు యుద్ధం గురించి ఆందోళన వద్దు : జో బైడెన్

ABN , First Publish Date - 2022-03-01T18:09:10+05:30 IST

ఐక్యరాజ్య సమితికి రష్యా మిషన్‌ నుంచి 12 మంది దౌత్యవేత్తలను

అణు యుద్ధం గురించి ఆందోళన వద్దు : జో బైడెన్

వాషింగ్టన్ : అణు యుద్ధం గురించి భయపడవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ప్రజలను కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా తన అణ్వాయుధ దళాలను అత్యంత గరిష్ఠ స్థాయిలో సన్నద్ధం చేస్తున్న తరుణంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ పిలుపునిచ్చారు, అణు యుద్ధం జరుగుతుందని అమెరికన్లు ఆందోళన చెందక తప్పదా? అని ప్రశ్నించినపుడు ఆయన ‘అక్కర్లేదు’ అని బదులిచ్చారు. వైట్ హౌస్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 


అంతకుముందు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ విలేకర్ల సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ప్రస్తుతం అమెరికా తన అణ్వాయుధ అప్రమత్తత స్థాయిని మార్చవలసిన అవసరం లేదని చెప్పారు. అనేక అంశాలపై రష్యాతో అమెరికాకు ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయన్నారు. అయితే అణ్వాయుధాలను ఉపయోగించడం వల్ల విధ్వంసకర పరిణామాలు సంభవిస్తాయని ఇరు దేశాలు అంగీకారంతో ఉన్నాయని చెప్పారు. అణు యుద్ధంలో గెలుపు ఉండదని, అది ఎన్నడూ జరగకూడదని గతంలోనూ, ఈ ఏడాది ప్రారంభంలోనూ చెప్పామని తెలిపారు. 



ఐరాస రష్యన్ మిషన్ దౌత్యవేత్తలపై అమెరికా వేటు

ఐక్యరాజ్య సమితికి రష్యా మిషన్‌ నుంచి 12 మంది దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది. వీరు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించింది. దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అత్యంత విరుద్ధ భావంతో తీసుకున్న చర్య అని వ్యాఖ్యానించింది. ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉన్న దేశమైన అమెరికా ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆరోపించింది. 


ఐరాసకు అమెరికా మిషన్ అధికార ప్రతినిధి ఒలివియా డాల్టన్ మాట్లాడుతూ, రష్యన్ మిషన్‌లోని 12 మంది ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌ను బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఐక్యరాజ్య సమితికి, దాని రష్యన్ పర్మనెంట్ మిషన్‌కు అమెరికా తెలియజేసినట్లు చెప్పారు. వీరు అమెరికాలో నివసించేందుకుగల ప్రత్యేక అధికారాలను దుర్వినియోగపరచారని తెలిపారు. అమెరికా భద్రతకు ప్రతికూలమైన గూఢచర్య కార్యకలాపాల్లో వీరు నిమగ్నమయ్యారని తెలిపారు. 


Updated Date - 2022-03-01T18:09:10+05:30 IST