నిరుద్యోగులు ఖుషీ

ABN , First Publish Date - 2022-03-10T07:15:11+05:30 IST

రాష్ట్రంలో ఇక కొలువుల జాతరే! ఎవరూ ఊహించని రీతిలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగులు ఖుషీ

  • 80,039 ఉద్యోగాల భర్తీ
  • 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల క్రమబద్ధీకరణ
  • తక్షణమే నోటిఫికేషన్ల ప్రక్రియ.. వయోపరిమితి పదేళ్లు పెంపు
  • ఓసీలకు 44 ఏళ్ల వరకు అవకాశం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు
  • దివ్యాంగులకు 54 ఏళ్ల దాకా చాన్స్‌
  • నోటిఫికేషన్ల మధ్య తగినంత వ్యవధి
  • అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా..
  • 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
  • ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌
  • డిసెంబరులో స్థానిక క్యాడర్ల కేటాయింపు పూర్తి
  • శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన 
  • అంచనాలకు మించి ఉద్యోగాల సంఖ్య
  • ఉద్యోగార్థుల్లో ఆనందోత్సాహాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
  • కాకతీయ వర్సిటీలో విద్యార్థుల భారీ ర్యాలీ


హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక కొలువుల జాతరే! ఎవరూ ఊహించని రీతిలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 వేలకు అటు ఇటుగా ఉద్యోగాలను భర్తీ చేయవచ్చన్న అంచనాలుండగా.. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా ఒకేసారి 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇవే కాకుండా 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులనూ క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మొత్తం ఉద్యోగాల ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు, బుధవారం నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితినీ పదేళ్లు పెంచారు. దీంతో ఎంతో కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో అధికార టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్‌ చిత్రాపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఉద్యోగాలు సరిపోవని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులనూ భర్తీ చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. 


బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులందరూ టీవీ చూడాలని, ఆశ్చర్యపోయే వార్త చెబుతానని సీఎం కేసీఆర్‌ మంగళవారం వనపర్తి సభలో చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే ఉదయం 10:30 గంటల సమయంలో ఉద్యోగాల భర్తీపై శాసనసభలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. వీటికితోడు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. 2014 జూన్‌ 2 నాటికి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్‌కు అర్హులుగా పేర్కొన్నారు. దీంతో మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేసినట్లవుతుందన్నారు. ఇక పోలీసు శాఖ, యూనిఫాం సర్వీసులు మినహా ఇతర అన్ని ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలు 44 ఏళ్ల దాకా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 49 ఏళ్ల వరకు, దివ్యాంగులు 54 ఏళ్ల దాకా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కలిగి ఉంటారన్నారు. ఇక ఉద్యోగార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా నోటిఫికేషన్ల మధ్య తగిన గడువు ఉండేలా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


ఏటా ఉద్యోగాల భర్తీ..

రాష్ట్రంలో ఇక ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కోసం క్యాలండర్‌ను విడుదల చేస్తామని, పారదర్శకంగా నియామకాలు చేపడతామని కేసీఆర్‌ ప్రకటించారు. యూపీఎస్సీ లాగే రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీ క్యాలండర్‌ విడుదల చేస్తామన్నారు. అన్ని శాఖలు ప్రతి ఏటా తమ వద్ద ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేసి, నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైకోర్టులో కేసును గతేడాది డిసెంబరు 7న కొట్టివేసినందున న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టుల్లో కేసులు వేయడం వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమయిందన్నారు. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక కేడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబరులో పూర్తిచేశామని చెప్పారు. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌లలో భర్తీ చేయాల్సిన ఖాళీలపై స్పష్టత వచ్చాకే నియామక ప్రక్రియ చేపట్టామన్నారు. పరిపాలన సజావుగా సాగడం కోసం 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేశామని, ఖాళీగా ఉన్న 1,56,254 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించి, ఇప్పటిదాకా 1,33,942 పోస్టులను భర్తీ చేశామని వివరించారు. 


షెడ్యూల్‌ 9, 10 సంస్థలు తేలితే మరో 10-20 వేలు 

షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన తేలితే.. అందులో మరో 10 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ విభజన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ముడిపడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, కేంద్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదని ఆక్షేపించారు. 


స్థానికేతరులకు 5 శాతం ఉద్యోగాలు..!

ప్రభుత్వ కృషి వల్ల ఇకనుంచి ఉద్యోగ నియామకాల్లో అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌లు అమలవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 5 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉద్యోగాల్లో ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలోని అభ్యర్థులు పోటీ పడవచ్చని అన్నారు. గతంలో ఉన్న విధానం ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, జిల్లా రిజిస్ట్రార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తదితర గ్రూప్‌-1 ఉద్యోగాలకు లోకల్‌ కేడర్‌ రిజర్వేషన్‌ వర్తించేది కాదని, ప్రస్తుతం వీటన్నింటినీ లోకల్‌ రిజర్వేషన్ల పరిధిలోకి తెచ్చామని వెల్లడించారు.  


జీవో 3 రద్దు ప్రభావం లేకుండా చూడండి

స్థానిక ఉద్యోగాల్లో గిరిజనులకు నష్టం జరగకుండా గతంలో మాదిరిగానే నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం ప్రకటించిన తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్ల క్రితం తెచ్చిన జీవో నంబరు 3ను ఇటీవల సుప్రీంకోర్టు కోట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు నష్టం జరిగే అవకాశం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం.. రద్దు ప్రభావం ఏ మాత్రం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎ్‌సను ఆదేశించారు.


ఏటా 7వేల కోట్ల అదనపు భారం

ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వంపై ఏటా రూ.7 వేల కోట్ల అదనపు భారం పడనుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అయినప్పటికీ ఉద్యోగాల భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. శాఖల వారీగా ఖాళీలపై కూడా సీఎం ప్రకటన చేశారు. 



Updated Date - 2022-03-10T07:15:11+05:30 IST