పంచశీల మరోమారు.. మారని డ్రాగన్‌ తీరు!

ABN , First Publish Date - 2020-09-12T07:40:24+05:30 IST

లద్దాఖ్‌ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా భారత్‌, చైనా జరిపిన చర్చల్లో ఆశించినంత పురోగతి జరగలేదు. శాంతిస్థాపన దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఓ పంచసూత్ర- ప్రణాళికను రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదించింది.

పంచశీల మరోమారు.. మారని డ్రాగన్‌ తీరు!

వేగంగా దళాల ఉపసంహరణ

గత ఒప్పందాలకు కట్టుబడాలి

విదేశాంగ మంత్రుల భేటీలో నిర్ణయం

చైనా సేనల మోహరింపుపై అభ్యంతరం

కాల్పులు, కవ్వింపులు ఆపాలన్న చైనా

పంచసూత్రాల అమలు అనుమానమే

యథాతథస్థితిపై ప్రస్తావన లేని ప్రకటన

త్రివిధ దళాల చీఫ్‌లతో రాజ్‌నాథ్‌ భేటీ

ఘర్షణలు అనివార్యమా?


మాస్కో- న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: లద్దాఖ్‌ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా భారత్‌, చైనా జరిపిన చర్చల్లో ఆశించినంత పురోగతి జరగలేదు. శాంతిస్థాపన దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఓ పంచసూత్ర- ప్రణాళికను రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదించింది. సమావేశం ముగిశాక ఇరుదేశాలూ ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ప్రకటనను కూడా భారతే వెలువరించింది. అందులో ఉన్న అంశాలను పరికిస్తే వాస్తవ స్థితిలో ఎలాంటి మార్పూ రాదన్న విషయం వెల్లడవుతుందని నిపుణులంటున్నారు. జయశంకర్‌తో మాస్కోలో రెండున్నర గంటలపాటు చర్చించిన చైనా విదేశాంగ మంత్రి- వాంగ్‌ యీ - సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ వైఖరిలో మార్పులేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి. ఓ రకంగా పీఎల్‌ఏ దళాల దుందుడుకు, కవ్వింపు పోకడలను ఆయన సమర్థించారు. భారత్‌పై నిందారోపణలు చేస్తూనే- విషయాన్ని పీఎల్‌ఏకు వదిలేశారు. ఆయన వైఖరి చూశాక- సరిహద్దు  ఉద్రిక్తతలు ఇప్పటికిప్పుడే చల్లారే అవకాశం లేదన్న విషయాన్ని భారత బృందం కేంద్ర ప్రభుత్వ అధినాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం. పంచసూత్ర ప్రణాళిక కుదిరినా విబేధాలు యథాతథం... పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినా- లద్దాఖ్‌ ఘర్షణలు మున్ముందు కొనసాగే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.


ఇదీ పంచసూత్ర- ప్రణాళిక

విభేదాలు వివాదాలుగా మారకూడదు. ఇరు దేశాల అధినేతలు గతంలో జరిపిన చర్చలను మార్గదర్శకం గా తీసుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవాలి

ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఇరుదేశాలకూ శ్రేయస్కరం కాదు. అందుచేత సరిహద్దులో ఉన్న రెండు దేశాల దళాలూ చర్చలు కొనసాగించాలి. వేగంగా అక్కడి నుంచి ఉపసంహరించుకుని, తగిన దూరం పాటించి, ఉద్రిక్తతలు చల్లార్చాలి.

సరిహద్దులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఒప్పందాలకు, ప్రోటోకాల్స్‌కు కట్టుబడాలి. సరిహద్దు వెంట ప్రశాంతత కొనసాగించాలి. పరిస్థితి విషమించే ఎలాంటి చర్యలకూ పాల్పడరాదు

సరిహద్దు సమస్యకు సంబంధించి ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగం ద్వారా చర్చలు, సమాచార మార్పిడి కొనసాగించాలి. ఈ విషయమై గతంలో ఏర్పాటు చేసుకున్న డబ్ల్యూఎంసీసీ (వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌) నిరంతరం సమావేశమై చర్చలు కొనసాగించాలి

పరిస్థితులు చక్కబడ్డాక పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలను చేపట్టేందుకు, సరిహద్దుల్లో శాంతి స్థాపనకు గాను చర్చలను కొనసాగించాలి


బదులివ్వలేకపోయిన వాంగ్‌ యీ

లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఎందుకంత భారీగా దళాలను మోహరిస్తున్నారని విదేశాంగ మంత్రి జయశంకర్‌- వాంగ్‌ యీని ప్రశ్నించారు. 1993, 1996ల్లో కుదిరిన ఒప్పందాలను ఇది ఉల్లంఘించడమేనని ఆయన ఆక్షేపించారు. పెద్ద సంఖ్యలో మోహరించడమేకాక- ఘర్షణకు ఆస్కారం కలిగించేలా అనేక ప్రాంతాల్లో స్థావరాలను కొత్తగా ఏర్పరచడమేంటని నిలదీశారు. దీనికి వాంగ్‌ యీ నుంచి సమాధానం లేదు.  చైనా బృందం కూడా దీనికి తగిన కారణాల్ని చెప్పలేకపోయింది. ‘పీఎల్‌ఏ దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఘర్షణలకు ఆస్కారమున్న ప్రాంతాలకు సమీపాన వచ్చి మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. ఇది ఆందోళనకరం. ఇది ద్వైపాక్షిక ఒప్పందాలను బేఖాతరు చేయడమే’’ అని జయశంకర్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయితే వాంగ్‌ ఈ దీన్ని తిరస్కరిస్తూ- ‘ఇపుడు చేయాల్సిందల్లా భారత దళాలు కవ్వింపుల్ని, కాల్పుల్ని ఆపడం....! ఒప్పందాల్ని కాలరాసేలా ప్రవర్తించడం మానుకోవాలి’ అని ఎదురు బుకాయించారు. ‘‘భవిష్యత్తులో అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా ఉండాలంటే ఘర్షణలకు తావున్న అన్ని చోట్ల నుంచీ తక్షణం దళాలను ఉపసంహరించాలి. అది ఉభయదేశాలకూ మంచిది’’ అని జయశంకర్‌ ఆయనకు తేల్చిచెప్పినట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. 


మాది కఠిన వైఖరే: చైనా

సమావేశం తరువాత చైనా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘పొరుగుదేశాలన్నాక కొన్ని విభేదాలు సహజం. అయితే వీటిని అక్కడ ఆ సందర్భానికే పరిమితం చేయాలి తప్ప మిగిలిన వాటికి అన్వయించరాదు. ఇపుడు రెండు దేశాలకూ కావాల్సినది పరస్పర సహకారం. సరిహద్దు దళాల మధ్య నిర్దిష్ట అంశాల పరిష్కారానికి చర్చలను చైనా ప్రోత్సహిస్తుంది. సరిహద్దు పరిస్థితి విషయంలో చైనా కఠిన వైఖరిని వాంగ్‌ యీ భారత్‌కు స్పష్టం చేశారు. 


నిరంతర అప్రమత్తత

దళాలకు రాజ్‌నాథ్‌ సూచన

తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులు చేయిదాటుతున్న వేళ... రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ - శుక్రవారంనాడు   త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌లతో భేటీ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. బలగాలు సంఖ్య పెంచాలా, మరిన్ని ఫిరంగి దళాలు, ట్యాంకులూ తరలించాలా అన్నది చర్చించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న కమాండర్లు తమ దళాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. 

Updated Date - 2020-09-12T07:40:24+05:30 IST