ఫైజర్‌ వ్యాక్సిన్‌కు యూకే ఓకే

ABN , First Publish Date - 2020-12-03T08:31:07+05:30 IST

అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు యూకే (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దీనికి అనుమతులు మంజూరు చేసిన తొలిదేశంగా ఇది నిలిచింది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు యూకే ఓకే

వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్‌ 

లండన్‌, డిసెంబరు 2: అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కు యూకే (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దీనికి అనుమతులు మంజూరు చేసిన తొలిదేశంగా ఇది నిలిచింది. వచ్చే వారం నుంచి దేశ ప్రజలకు ‘ఫైజర్‌’ వ్యాక్సినేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. 4 కోట్ల డోసుల కోసం యూకే ముందస్తు ఆర్డరు ఇవ్వగా.. తొలి విడతగా వాటిలో 8 లక్షల డోసులు బెల్జియంలోని ప్యూర్స్‌ నగరంలో ఉన్న ఫైజర్‌ ఉత్పత్తి యూనిట్‌ నుంచి యూకేకు దిగుమతి కానున్నాయి. డ్రై ఐస్‌ (ఘనీభవించిన కార్బన్‌ డయాక్సైడ్‌) ఉష్ణోగ్రత మైనస్‌ 78.5 డిగ్రీల సెల్సీయస్‌ ఉంటుంది. డ్రై ఐస్‌తో నింపిన పెట్టెల్లో వ్యాక్సిన్‌ డోసులను ప్యాక్‌ చేసి పంపుతారు. ఆ పెట్టెలను ఫ్రిజ్‌లలో ఐదురోజుల పాటు నిల్వ చేయొచ్చు. ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైందని ఔషధ నియంత్రణ సంస్థ ‘మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ’(ఎంహెచ్‌ఆర్‌ఏ) ధ్రువీకరించాకే, వాడకానికి అనుమతులు మంజూరు చేశామని యూకే ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ ప్రకటించారు. త్వరలోనే కోటి వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు.


వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులు, సిబ్బందితో పాటు 80 ఏళ్లకు పైబడినవారు, నేషనల్‌ హెల్త్‌ సర్వీసు సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ నిల్వకు ఉన్న పరిమితుల దృష్ట్యా భారత్‌లో అందుబాటులోకి రాకపోవచ్చని వైరాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రష్యా కూడా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌తో వచ్చే వారం నుంచి మాస్‌ వలంటరీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం వచ్చే కొన్ని రోజుల్లో 20 లక్షల డోసులను ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు.

Updated Date - 2020-12-03T08:31:07+05:30 IST