Abn logo
Jun 3 2020 @ 05:49AM

అంతుపట్టని వ్యూహం

మారుమూల ప్రభావిత గ్రామాల్లో విస్తృత పర్యటనలు 

సేవా కార్యక్రమాల పేరిట గిరిజనుల వద్దకు..

మరోసారి నక్సల్స్‌ లొంగుబాటే లక్ష్యంగా ప్రణాళిక 

ఇప్పటికే జిల్లాలో ఆపరేషన్‌ సరెండర్‌ సక్సెస్‌ 

ఇంటీరియల్‌ టూర్‌ మ్యాప్‌ పేరిటా యాక్షన్‌ప్లాన్‌ 

రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి 


నిర్మల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పోలీసు బాస్‌ శశిధర్‌రాజు గత మూడు, నాలుగు నెలల నుంచి పలు మావోయిస్టు ప్రభావిత పల్లెల్లో సాహసోపేతంగా జరుపుతున్న విస్తృత పర్యటనలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఎస్పీ శశిధర్‌ రాజు కరోనా లాక్‌డౌన్‌ విధులను ఓ వైపు నిర్వహి స్తూనే మరోవైపు ఈ మారుమూల పల్లెలను లక్ష్యం గా చేసుకొని విస్తృతస్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. గిరిజనులకు మాస్క్‌లు, సానిటైజర్‌లతో పాటు నిత్యావసర వస్తువులను సైతం అందించి వారికి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం జిల్లా లోకి ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ర్టాల నుంచి మావోయిస్టులు చొరబడ్డారన్న ఇంటలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలోనే ఎస్పీ ఈ మారుమూల పల్లెలను లక్ష్యంగా చేసుకొని వరుస టూర్‌లు చేయడం వెనక ఏదో సరికొత్తవ్యూహం దాగి ఉందన్న ప్రచారం జరుగుతోంది.


పలుసార్లు ఎస్పీ ఈ మారుమూల పల్లెల్లో కరోనా విషయంలో అవగాహన కల్పించే పేరిట మోటార్‌ బైక్‌లపై కూడా కలియ తిరిగారు. ముఖ్యంగా కడెం, ఖానాపూర్‌, పెంబి, దస్తూరాబాద్‌ మండలాల్లోని ప్ర భావిత గ్రామాలనే ఎస్పీలక్ష్యంగా చేసుకున్నారు. ఇలావరుసగా మూడు, నాలుగు నెలల నుంచి  ఎస్పీ మారుమూల పల్లెలనే లక్ష్యంగా చేసుకొని సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాల పేరిట నిర్వహిస్తున్న పర్యటనలు ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారుతున్నాయి. అయితే జిల్లాకు చెందిన మావోయిస్టు నేతలను లొంగు‘బాట’ పట్టించేందుకే ఎస్పీ తన ఎత్తుగడను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మారుమూల పల్లెజనాన్నే కాకుండా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను ఎస్పీ కలవడం, అలాగే వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అజ్ఞాతంలో ఉన్న వారికి లొంగిపోయేందుకు సహకరించాలంటూ కోరడం లాంటి అంశాలన్నీ ఈ సమయంలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.


ఎస్పీ మావోయిస్టు కార్యకలాపాల అణచివేత, వారి లొంగుబాట్ల వ్యవహారంలో మొదటినుంచి మంచి అనుభవజ్ఞుడిగా ఈ శాఖలో పేరు గడించారు. ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మావోయిస్టు కార్యకలాపాలపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. ఇలా మావోయిస్టు కార్యకలాపాలను అదుపుచేయడంలో అనుభవం ఉన్న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టగానే ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను మొదలు పెట్టా రు. ఇందులో భాగంగానే ఆయన మొట్ట మొదటిసారిగా మావోయిస్టు పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, చత్తీస్‌ఘడ్‌, బీహార్‌, తదితర రాష్ర్టాల ఇన్‌ చార్జీ అయిన సట్వాజీ ఆలియాస్‌ సుధాకర్‌ను లక్ష్యం గా చేసుకున్నారు. సట్వాజీ కుటుంబసభ్యులతో ఆయన పలుసార్లు కౌన్సిలింగ్‌లు నిర్వహించడం, ఆయన తల్లి చేత సట్వాజీని లొంగిపోయే విధంగా పిలుపునిప్పించడం లాంటి యాక్షన్‌ప్లాన్‌ను అమలు చేశారు. అలాగే సట్వాజీ సన్నిహితులు, లొంగిపోయిన మాజీలు, పోలీసుశాఖలో అనుభవం ఉన్న రిటైర్డ్‌ అధికారుల సహకారం తీసుకొని జార్ఖండ్‌ రాష్ట్ర పోలీసులతో కమ్యూనికేషన్‌ నిర్వహించారు. దీని కారణంగా అప్పటికే మావోయిస్టు పార్టీలో ఇమడ లేకపోతున్న సట్వాజీతో పాటు ఆయన భార్య కదలికలను తెలుసుకొని ఎస్పీ శశిధర్‌రాజు అటు జార్ఖండ్‌ పోలీసులను ఇటు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయగలిగారు.


ఎస్పీ చేపట్టిన ఆపరేషన్‌ సరెండర్‌ వ్యూహం విజయవంతం కావడంతో సట్వా జీ, ఆయన భార్య అజ్ఙానం నుంచి బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండల కేంద్రానికి చెందిన సట్వాజీ లొంగుబాటు వ్యవహారం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. అలాగే అజ్ఞాతంతో ఉన్న జిల్లాకు చెందిన మరికొంతమంది మావోయిస్టుల లొంగుబాటు కూడా సట్వాజీ లొంగుబాటు వ్యవహారం ప్రభావం చూపుతుందని పోలీసులు భావించారు. ఇదే వ్యూహంతో కొంతకాలం స్తబ్దంగా ఉన్న ఎస్పీ మళ్లీ ఆపరేషన్‌ సరెండర్‌ను తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గత ఐదారు నెలల నుంచి విస్తృతంగా మారుమూల పల్లెల్లో పర్యటిస్తుండడమే కాకుండా పలువురు అజ్ఙాతంలో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా మంతనాలు సాగిస్తున్నారంటున్నారు. ఎస్పీ కొనసాగిస్తున్న ఆపరేషన్‌ సరెండర్‌ మరోసారి ఫలితమివ్వబోతున్న ప్రచారం కూడా మొదలైంది. జిల్లాకు చెందిన ఓ మావోయిస్టులొంగిపోయే అవకాశాలు ప్రచారం మేరకే ఎస్పీ ఈ ఇంటీరియల్‌ టూర్‌ మ్యాప్‌ను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 


మావోయిస్టు లొంగుబాటులో కీలక పాత్ర

ఓ వైపు సౌమ్యుడిగా మరోవైపు పోలీసుశాఖలో సామాజిక సంస్కరణలు అమలు చేస్తున్న ఉన్నతాధికారిగా పేరు గడించిన ఎస్పీ శశిధర్‌రాజు మావోయిస్టులపై కఠినవైఖరి కాకుండా వారిని లొంగిపోయే విధంగా చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయ న అజ్ఙాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌లు నిర్వహించడం, అలాగే వారికి నిత్యావసర వస్తువులు, దుస్తువులను పంపిణీ చేయ డం, ఇతర సహాయం అందించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎస్పీ ఆపరేషన్‌ సరెండర్‌ మంత్రాంగాన్ని జిల్లాలో వ్యూహత్మకంగా అమలు చేసిన కారణంగానే ఆ పార్టీ అగ్రనేత సట్వాజీ ఆలియాస్‌ సుధాకర్‌ పోలీసులకు లొంగిపోయినట్లు పేర్కొంటున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్‌ నక్సల్‌ నేతగా సుధాకర్‌కు పేరుంది. సుధాకర్‌ లొంగిపోయినట్లయితే మ రింత కొంతమంది జిల్లాకు చెందిన నక్సల్స్‌ లొంగిపోయే అవకాశాలుంటాయని భావించి ఎస్పీ ఆ దిశ గా గురిపెట్టారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన మైలారపు అడెల్లు ఆలియాస్‌ భాస్కర్‌, ఆయన భార్య కంతి లింగవ్వలతో పాటు లక్ష్మణచాంద మండలం కూచన్‌పల్లికి చెందిన సెంట్రల్‌కమిటీ సభ్యులు ఇర్వి మోహన్‌రెడ్డిలను కూడా లొంగిపోయే విధంగా చేయాలన్నదే ఎస్పీలక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. దీంతో పాటు కడెం, ఖానాపూర్‌, పెంబి, దస్తూరాబాద్‌ మండలాలకు చెందిన మరికొంతమంది మావోయిస్టులు వారి సానుభూతి పరులను సైతం ఎస్పీ టార్గెట్‌గా చేసుకొని వారి కోసం లొంగుబాటలు వేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారంటున్నారు. 


ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ఇద్దరు అజ్ఙాత మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే ఎస్పీ గత ఐదారు సంవత్సరాల నుంచి కరోనా లాక్‌డౌన్‌ అమలు వ్యవహారంలో బిజీగా ఉన్నప్పటికీ ఆ విధులతోపాటు మారుమూల పల్లెల్లో విసృత పర్యటనలు చేయడం లొంగుబాట ప్రచారానికి ఊతమిస్తోంది. ఎస్పీ వ్యూహత్మకంగా మావోయిస్టులను లొంగిపోయేందుకు అనేక రకాల ప్రయ త్నాలు చేశారని ఆ ప్రయత్నాల కారణంగానే ఒకరిద్దరు లొంగిపోబోతున్నట్లు కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం పోలీసు అధికారులు నిర్ధారించడం లేదు. అలాగే ఎస్పీ సైతం ఈ విషయంలో స్పష్టత నివ్వకుండా మారుమూల పల్లె ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకే కాకుం డా వారికి సేవా కార్యక్రమాలు అమలు చేయాలన్న లక్ష్యంతో పర్యటిస్తున్నట్లు చెబుతున్నారు.


దీంతో పాటు శాంతి భద్రతల విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను పోలీసు అధికారులతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నారంటు వివరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఖానాపూర్‌, కడెం, దస్తూరాబాద్‌, పెంబి మండలాల్లో ఎస్పీ జరుపుతున్న పర్యటనలు చర్చనీయంశమవుతున్నాయి. ఎస్పీ పర్యటనల వెనక ఏదో బలమైన కారణం ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement