కేసీఆర్ అంగీకరించిన సత్యం

ABN , First Publish Date - 2020-12-01T05:43:36+05:30 IST

రాజకీయాల్లో నిజమైన ప్రత్యర్థి ఎలా ఉంటాడో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిసివచ్చినట్లుంది. రెండు రోజుల క్రితం లాల్ బహదూర్ స్టేడియంలో...

కేసీఆర్ అంగీకరించిన సత్యం

దేశభక్తుల నెలవు హైదరాబాద్. కేసీఆర్ నిన్నమొన్న వచ్చిన నేత కావచ్చు కాని భారతీయ జనతా పార్టీకి బల్దియా, తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి మూలాలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా ప్రజల మనసుల్లో అంతర్లీనంగా గూడుకట్టి ఉన్న అసంతృప్తి కేంద్రంలో మోదీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సంఘటితం అయింది. సరైన సమయంలోనే, సరైన ప్రక్రియ ద్వారానే ఏ రసాయనిక చర్య అయినా జరుగుతుంది. అది పైకి ఉబకడానికి ఇవాళ కేసిఆర్ అసమర్థ, అరాచక, రాచరిక పాలన, కాంగ్రెస్ చరమదశ తోడ్పడ్డాయి. 


రాజకీయాల్లో నిజమైన ప్రత్యర్థి ఎలా ఉంటాడో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిసివచ్చినట్లుంది. రెండు రోజుల క్రితం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మొత్తం ప్రసంగమంతా భారతీయ జనతా పార్టీని విమర్శించేందుకే ఆయన ఉద్దేశించిన తీరు చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆయన ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది. ప్రసంగంలో ఆయన ఎక్కడా కాంగ్రెస్‌ను ప్రస్తావించలేదు. ఢిల్లీ స్థాయి నుంచి బీజేపీ నేతలు వెల్లువగా వస్తున్నారని ఆయన ఆక్రోశం వెలిబుచ్చడం, తనను దెబ్బతీయాలని చూస్తున్నారని వ్యాఖ్యా నించడం ద్వారా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తనకు నిజమైన ప్రత్యర్థి అవతరించాడని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.


దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీని ప్రజలు అంగీకరిస్తున్నారని, కశ్మీర్ నుంచి కన్యాకుమారివరకు బీజేపీని అడ్డుకోగల సత్తా ఎవరికీ లేదని స్పష్టమవుతోంది. ఇటీవల బిహార్‌లోనూ, దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టిన తర్వాత దేశమంతటా కాషాయ ధ్వజం రెపరెపలు ప్రభవిస్తున్నాయని తేలిపోయింది. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ అభివృద్ధి ఎజెండా ఫలితాలు ప్రజల అనుభవంలోకి రావడం ఇందుకు ప్రధాన కారణంకాగా ప్రతి పక్షాలు రోజురోజుకూ విశ్వసనీయత కోల్పోవడం ఇందుకు మరో కారణం.


ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు స్వంత అస్తిత్వం అంటూ ఏమీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారు పదవులకు అమ్ముడుపోయి చివరి నిమిషం వరకూ అధికారంలో ఉండి, కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ ఘనత లభించే అవకాశం ఇచ్చారు. పోనీ ఆ తర్వాతనైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ అస్తిత్వాన్ని నిరూపించుకున్నారా అంటే అదీ కనపడలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్న అభిప్రాయం ప్రజలకు ఏర్పడింది.


తనకు తిరుగులేదని, భవిష్యత్‌లో ప్రతిపక్షం అంటూ ఉండదనే అహంకారంతో కేసీఆర్ విచ్చలవిడిగా వ్యవహరించారు. కుటుంబపాలనను కొనసాగించారు. అవినీతికోసం వేల కోట్లవిలువైన ప్రాజెక్టులను సృష్టించి డబ్బు చేసుకున్నారు. ఫార్మ్ హౌజ్‌కు పరిమితమై ప్రజలకు, నేతలకు దూరంగా గడిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య కార్యకలాపాల గొంతు నులిమివేశారు. మీడియాను అణిచివేశారు. కేసీఆర్ మూలంగా రాష్ట్రంలో అసలు పరిపాలనే ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఇష్టారాజ్యంగా నేతల అవినీతిని ప్రోత్సహించడం, ఎన్నికల్లో వేల కోట్లను గుమ్మరించడం, పోలీసులను పార్టీ ఏజెంట్లుగా ఉపయోగించుకోవడం మొదలైన కార్యకలాపాలతో అడ్డూఆపులేకుండా వ్యవహరించారు. ఉపాధి కల్పన, నిర్మాణాత్మక అభివృద్ధి వంటి వాటిని పట్టించుకోనే లేదు. మతతత్వ పార్టీ అయిన ఎంఐఏంతో మిలాఖత్ అయి ఆ పార్టీ అరాచకత్వాన్ని ప్రోత్సహించారు. ఈ కారణంగానే ఇటీవలి వరదల్లో పాత బస్తీలో అనేక కాలనీలు మునిగిపోవడం జరిగింది. అస్తవ్యస్థ అభివృద్ధి విధానాలవల్లే వర్షాలు, వరదలు హైదరాబాద్‌లో ప్రజా జీవనాన్ని రోజుల తరబడి స్తంభింపచేశాయి. ప్రజల రోదనను వినేందుకు కేసీఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి బయటకు రాలేదు. అధికారులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. అసలు ప్రజలు ఏ ప్రమాదానికి గురైనా, ప్రకృతి వైపరీత్యాలకు గురైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి బాధితులకు అందుబాటులో ఉండాలి. ప్రజల మధ్యకు రావాలి. ప్రజలు కడగండ్ల పాలైనప్పుడు ఓదార్చేందుకు గడపదాటి అడుగుపెట్టకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏమి ప్రయోజనం? హాయిగా నడుస్తున్న సెక్రటేరియట్‌ను నేలమట్టం చేసేందుకు వెనుకాడని ముఖ్యమంత్రి ప్రజల జీవితాలు విధ్వంసం జరిగినప్పుడు ఎందుకు స్పందిస్తారు? కరోనా విలయంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య సౌకర్యాలు మెరుగుపరచని ముఖ్యమంత్రి, ఉద్యోగాలు భర్తీ చేయకుండా వేలాది ఖాళీలను కొనసాగించిన ముఖ్యమంత్రి, ఉపాధ్యాయులను నియమించకుండా విద్యావ్యవస్థను నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎంత కాలం మాయమాటలతో పబ్బం గడుపుకుంటారు? తన పాలనలో నేరాల శాతం తక్కువ ఉన్నదని చెప్పుకుంటున్న కేసీఆర్ హైదరాబాద్‌లో నేర సామ్రాజ్యం నడుస్తోందని, పత్రికల్లో రోజూ వెలువడుతున్న నేర వార్తలను చదవడం లేదని అర్థమవుతోంది. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో ముఖ్యమంత్రి ఏమి అభివృద్ది చేశారో, గతంలో ఏ అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేస్తే కేసీఆర్ ఏమి వెలగబెట్టారో అర్థమవుతుంది. ‘నాలాలన్నీ కబ్జా అయ్యాయి.


మురుగు కాల్వలన్నీ మూసుకుపోయాయి. వాటన్నింటిని తొలగించాలి. తాత్కాలిక, మధ్యతరహా, దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలి’ అని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పడం తన పాలనలో ఉన్న అధ్వాన్నమైన పరిస్థితిని అంగీకరించినట్లే. తన కుమారుడి ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ గెలిచిందని మురిసిపోయిన కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్లుండి ప్రజలు ఎందుకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవాలి. యువకుడైన కేటిఆర్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసి విశ్వనగరంగా మారుస్తారని అనుకుంటే అది విశ్వ నరకంగా మారిపోయింది. ట్రాఫిక్ రద్దీలు, గుంతలరోడ్లు, మురికి కాల్వలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఫార్మ్ హౌజ్‌లు, బంగళాలనుంచి బయటకువచ్చి బస్తీల్లో తిరిగితే పేదరికం ఎంత ఘోరంగా తాండవిస్తుందో అర్థమవుతుంది. పదివేల రూపాయలకోసం ఇటీవల ‘మీ సేవా సెంటర్’ లో మహిళలు తొక్కిసలాటకు గురైన దృశ్యాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. హైదరాబాద్ ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు భరించాలో చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదు. ఇన్నాళ్లకు వారికి ప్రత్యామ్నాయం లభించింది.


కేసీఆర్‌కు ప్రతిపక్షంలేని శూన్యత ప్రస్ఫుటంగా కనిపిస్తున్న సమయంలోనే బీజేపీ రంగ ప్రవేశం చేసింది. ఇందుకు ప్రోద్బలం కలిగించింది ప్రజలే. ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తూ, విసిగిపోతున్న వారికి బీజేపీ ఆశాకిరణంగా కనిపించింది. ఇది ఒక్క రోజున జరిగింది కాదు. హైదరాబాద్ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ ఇవాళ జాతీయ ప్రధాన స్రవంతిలోకి కలిసేందుకు తహతహలాడడం ఒక్క పూటలో జరిగింది కాదు. నిజాంపాలనలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలోకి తీసుకువచ్చిన ఘనత ఆర్య సమాజ్‌ది. హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్‌ది. దేశభక్తుల నెలవు హైదరాబాద్. కేసీఆర్ నిన్నమొన్న వచ్చిన నేత కావచ్చు కాని భారతీయ జనతా పార్టీకి, జనసంఘ్‌కు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కూ, ఆర్య సమాజ్‌కూ ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి మూలాలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా ప్రజల మనసుల్లో అంతర్లీనంగా గూడుకట్టి ఉన్న అసంతృప్తి కేంద్రంలో మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సంఘటితం అయింది. సరైన సమయంలోనే, సరైన ప్రక్రియ ద్వారానే ఏ రసాయనిక చర్య అయినా జరుగుతుంది. అది పెటిల్లుమని పైకి ఉబకడానికి ఇవాళ కేసీఆర్ అసమర్థ, అరాచక, రాచరిక పాలన, కాంగ్రెస్ చరమదశ తోడ్పడింది. ఉన్నట్లుండి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ, హోంమంత్రి అమిత్ షా అన్నట్లు త్వరలో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. దుబ్బాక గెలుపే బీజేపీ విజయ భేరీకి నాంది. అమిత్ షా హైదరాబాద్ రంగ ప్రవేశం చేయడంతోనే ఈ విజయానికి ఇక తిరుగుండదని స్పష్టమైంది.


కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా చేసిన వ్యాఖ్య ‘అందరూ పూలబొకేలా ఉండే నగరం కావాలి.’ అని. నిజానికి భారత దేశమంతటా అందరూ కలిసి ఉన్నారు. దేశంలో అనేక నగరాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులతో సహా అనేక వర్గాల ప్రజలు సహజీవనం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న నగరాల్లో లక్నో, మీరట్, భోపాల్‌లో 30 శాతం, బెంగళూరులో 14 శాతం పైగా ముస్లింలు ఉన్నారు. నిన్నమొన్నటి వరకూ బిజెపి ప్రభుత్వం ఉన్న ముంబైలో 22 శాతం పైగా ముస్లింలు ఉన్నారు. కొన్ని కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతటా ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడింది. గుజరాత్‌లోనైతే మత కల్లోలాలు అన్న మాటనే ప్రజలు మరిచిపోయారు. అభివృద్ధే మోదీ ప్రధానమైన ఎజెండా అని, అభివృద్ధికి అడ్డుపడే ప్రగతి నిరోధక శక్తులను ఆయన సహించరని ప్రజలకు ఏనాడో అర్థమైంది. మోదీని వ్యతిరేకించేందుకు కుహనా లౌకిక వాదాన్ని జపించే శక్తులు ఇవాళ దేశమంతటా నిర్వీర్యమయ్యాయి. కేసీఆర్ కూడా త్వరలో ఆ శక్తుల జాబితాలో చేరనున్నారు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-12-01T05:43:36+05:30 IST